Previous Page Next Page 
మధుకీల పేజి 30

    "బాబుగారూ! నాదో మాట వినండి. చెప్పుతున్నానని కోపగించుకోకండి. మీ దయవల్ల నాకు ఇళ్ళస్థలం ఇప్పించేరు. కొట్టం వేసుకుని బ్రతుకుతున్నాను. మీరూ రండి. రాములు వారంటే అడవుల పాలైనపుడు కొట్టాల్లో తల దాచుకున్నాడు. మళ్ళీ మంచి రోజులు రాకపోవు..."
    "వెంకన్నా!"
    "బాబుగారూ! ఋణం తీర్చుకోనివ్వండి నన్ను... మీ వుప్పు తిన్నందుకు మేలు చెయ్యనివ్వండి"
    "పూర్ణా! భగవంతుడు దయామయుడు పూర్ణా! వెంకన్నా సరిగా సమయానికి వచ్చాడు. తాత్కాలికంగా తలదాచుకోటానికి దారి చూపుతున్నాడు"
    ఆ మాటలోనే సుధాకర్ వచ్చాడు నిరుత్సాహంగా.
    "ఎక్కడా ఖాళీ లేదంటున్నారునాన్నా! ఎలా చేయాలో ఏం చేయాలో?-"
    "హుఁ భగవంతుడు కరుణామయుడు సుధా! ఇప్పటికి దిగులు పడనవసరం లేకుండా చేసాడు. ఇదిగో వెంకన్న వచ్చాడు. పద సామానంతా రెండుబళ్ళకి ఎత్తించు. వెంకన్న ఇంటికి వెళదాం"
    "బాగుందయ్యా సుందరయ్యా! పెద్దమనిషివే. కొడుక్కి భాగం పంచకుండా వెళుదమనుకుంటున్నావా? నోట్లో నాలికలేని వాడిని చేసి ఆడిద్దామనుకున్నా నేను బ్రతికే వున్నాను. దించు దించు! సామాను సరిగా పంచి ఇచ్చి నీ భాగం తీసికెళ్ళు" అన్నాడు పాపయ్య.
    "పాపయ్యా!"
    "మరియాద! మరియాద! గౌరవించటం నేర్చుకోరా కుర్రాడా?"
    "నీకు మరియాద నేర్పాలిగా ముందు? చెప్పుతో నలుగు బాదితే బుద్ధివస్తుంది. మరియాద నేర్చుకుంటావ్, అంతే."
    "ఆఁ ఆఁ పెద్దా చిన్నా లేకుండా నోటి నోటి కెంత వస్తే అంత మాట అనటమేనా? న నీకు నాలుగు పడితే కానీ బుద్ధిరాదు"
    "ఇదిగో ఇప్పుడు నీకు బుద్ధి చెప్పి-"
    "సుధా!" అన్నపూర్ణ కేకకి ఆగిపోయడతను.

    "తప్పుబాబూ?" అతన్ని మనం కొట్టకూడదు. ఆరోజు వస్తే అతన్ని కొట్టే వాళ్ళు తంతారు. ఊఁ వెనక్కి రా! ఆ సామాను దింపు. పాత్ర సామానంతా రెండు భాగాలు చెయ్"

    ఆజ్ఞాపించినట్టుగా అంది అన్నపూర్ణ.

    "నీవు దేవతవి అన్నపూర్ణమ్మ తల్లీ! మనిషి ఏది తప్పినా ధర్మం తప్పకూడదు. మీకు ఇద్దరు కొడుకులూ సమానమే... ఒకరెక్కువా ఒకరు తక్కువా అంటూ లేదు..."

    మనస్సులో అసహ్యించుకుందతన్ని... జవాబు చెప్పలేదు.
    పంచారంతా.
    భాగం సామాను బండ్లకెత్తారు. మధు భాగం  మళ్ళీ ఇల్లు చేరింది.
    దిగులుతో, బ్రతుకుపై భవిష్యత్తుపై ఆశతో కదిలారు నలుగురూ!
    ఇల్లు దాటుతూ అన్నపూర్ణ చూసిన చూపు బల్లెంలా దిగింది పాపయ్య గుండెలో...
    ఊరు చివరగా వుంది వెంకన్న పాక.
    బండి ఇంటిముందుకి రాగానే "నిన్నటిదాకా మేం యీ పాకలో వున్నాం. ఈరోజే ఆ వెనుక భాగానికి మారాం. ఇక ఇదంతా మీకే మాదేవుంద
    "చాలా బావుంది వెంకన్నా! ఈ రోజుకి మా పాలిట దేవుడివి నీవే!" అంది అన్నపూర్ణ కృతజ్ఞత వెల్లివిరిస్తున్న కళ్ళతో.
                           *        *        *
    నిజంగా ఆ రోజు సుధాకర్ జీవితంలో చాలా చెడ్డ రోజు.

 Previous Page Next Page