"ఎవరైనా ఆరోగ్యంగా వుండి, బ్లడ్ గ్రూప్ సరిపోయి, వాలంటరీగా మన అద్వైతకు గుండెను దానం చేయగలిగితే, అది మన అద్వైత బాడీకి సూటవుతే..." ప్చ్... కానీ అలా దొరకడం... అదీ వితిన్ ఎయిట్ అవర్స్ లో... డాక్టర్ సిద్దార్ధ రెండు చేతులతో కణతలు నొక్కుకున్నాడు.
చిన్నప్పట్నుంచి అద్వైతను చూస్తూనే వున్నాడు. తన చేతుల్లోనే కన్ను తెరిచిన బిడ్డ... చివరి క్షణాల్లో మృత్యువుతో పోరాడుతూంది.
అప్పుడే డాక్టర్ మూర్తి వచ్చాడు.
"వాట్ మిస్టర్ మూర్తి... వాట్ హేపెండ్..." అడిగాడు డాక్టర్ సిద్దార్ధ.
"సర్... ఓ అమ్మాయిని యిందాకే తీసుకువచ్చారు. బ్రతకడానికి ఛాయిస్ అసల్లేవ్.... యాక్సిడెంట్ కేసు... అంత సీరియస్ లో కూడా అప్పుడప్పుడు కళ్ళు తెరిచి, అభీ... అభీ... అని అంటోంది. మీరోసారి వచ్చి చూడగలరా.... నాకేం చేయాలో పాలుపోవడం లేదు....
డాక్టర్ సిద్దార్ధ "ఇప్పుడు కుదర్దు...." అంటూ తల అడ్డంగా తిప్పబోయి, ఏదో స్ఫురించి, "ఆల్ రైట్ పదండి" అన్నాడు.
మహాపతి భుజం తట్టి "ఒరేయ్ పతీ.... నీ అదృష్టం ఎలా వుందో చూద్దాం... నువ్వు ధైర్యంగా వుండు..." అని బయటకు నడిచాడు.
* * *
ఇంటెన్సివ్ కేర్ యూనిట్.
విరజ రక్తం ముద్దలా మారివుంది. అలాంటి పరిస్థితిలోనూ కళ్ళు తెరిచింది. ఆమె పెదవులు అస్పష్టంగా, స్పష్టాస్పష్టంగా 'అభీ....అభీ....' అని పలకరిస్తున్నాయి.
డాక్టర్ సిద్దార్ద విరజ దగ్గరికి వచ్చాడు. కేసు పది నిమిషాల్లో అతనికి పూర్తిగా అర్ధమైంది. నోఛాయిస్ బ్రతికే అవకాశం లేదు.
"డాక్టర్.... ఆవిడేదో చెప్పాలనుకుంటున్నారు...." డాక్టర్ మూర్తి సిద్దార్ధతో చెప్పాడు.
డాక్టర్ సిద్దార్ధ విరజ తల దగ్గరకూచున్నాడు. ఆక్సిజన్ మాస్క్ తొలగించమన్నట్టు సైగ చేసింది. డాక్టర్ సిద్దార్ధ నర్స్ కు సైగ చేశాడు. నర్స్ వచ్చి ఆక్సిజన్ మాస్క్ తీసింది.
"డాక్టర్....నేను..... నేను బ్రతకను కదూ...." మాట్లాడ్డం కూడా కష్టమవుతోంది విరజకు.
"ప్లీజ్ మేడమ్.... డోంట్ గెట్ ఎక్సయిట్.... ఎమోషనవ్వకండి... ఉయ్ విల్ ట్రయ్ అవర్ లెవల్ బెస్ట్...." డాక్టర్ సిద్దార్ధ చెప్పాడు.
"డాక్టర్....టైం....టైమెంత?"
డాక్టర్లిద్దరూ ఆశ్చర్యపోయేరు.
ఇలాంటి పరిస్థితిలో టైమెంత అని అడగడమా?
"చెప్పండి డాక్టర్..."
"సెవన్ ట్వంటీ...."
"డాక్టర్.... నన్ను... న...న్ను....అ....ర్జం....టుగా ఎయిర్ పోర్టుకు తీసుకువెళ్ళగలరా?"
"వాట్... ఇప్పుడా... ఈ పరిస్థితుల్లోనా... ఆర్యూ మ్యాడ్..." డాక్టర్ మూర్తి కోపంగా అన్నాడు.
డాక్టర్ సిద్దార్ధ అతడ్ని వారించి...
"మీ కండిషన్ క్రిటికల్ గా వుంది" అన్నాడు.
"బట్.. ఐ వాంట్ టు సీ మై అభీ..."
"హు ఈజ్ హి..."
"హాయ్ ఈజ్ మై లవ్.... హీ ఈజ్ మై లైఫ్...
హాయ్ ఈజ్ మై బ్రీత్...
డాక్టర్ సిద్దార్ధకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. ఇలాంటి క్రిటికల్ స్టేజ్ లో కూడా ఆమె మాట్లాడగలగడమే మిరాకిల్ గా అనిపిస్తోంది.
"చూడండి"
"విరజ"
"చూడండి విరజగారూ.... మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వుంటే కబురు చేయండి..."
"ఎం...దు...కు డాక్టర్.... ఫర్లేదు నాకు చెప్పండి.... నాకు సంబంధించిన ఒకే ఒక వ్యక్తి యిప్పుడు ఎయిర్ పోర్ట్ లో వున్నాడు...."
"సారీ మిస్ విరజా..." డాక్టర్ సిద్దార్ధ బాధగా చెప్పాడు..." మీరు మృత్యువుకు అతి చేరువలో వున్నారు కొద్ది నిమిషాలు..లేదా అతి కొద్ది గంటలు..."
"డా...క్ట.....ర్...." విరజ గొంతులో నుంచి మాటలు రావడం కష్టమైపోతోంది.
అప్పుడే నర్స్ పరుగెత్తుకుంటూ వచ్చింది. "డాక్టర్....అద్వైత..." ఆమె మాటాలింకా పూర్తి కాకుండానే మహాపతి పరుగెత్తుకుంటూ వచ్చాడు.
"ఒరే.... నా చిట్టి తల్లి విలవిల్లాడిపోతోందిరా.... దాన్ని ఎలాగైనా బ్రతికించరా... నా చిట్టితల్లికి గుండెనిచ్చే దాత కోసం వెతకరా...." మహాపతి బావురుమన్నాడు.
విరజ అలానే వాళ్ళిద్దర్నీ చూస్తూండిపోయింది. "ఒరే పతీ... ఆ దేవుడి మీద భారం వేయరా.... యిప్పటికిప్పుడు నీ కూతురికి గుండెను దానం చేసేవాళ్ళు ఎక్కడ దొరుకుతార్రా.... యిన్నేళ్ళుగా ప్రయత్నిస్తోన్నా దొరకని వాళ్ళు యిప్పుడు దొరుకుతారా...?"
"డాక్టర్... ఏమిటిదంతా..." అంత బాధలోనూ మహాపతి దుఃఖాన్ని చూసి కదిలిపోయి అడిగింది విరజ.
క్లుప్తంగా పరిస్థితి వివరించి చెప్పాడు డాక్టర్ సిద్దార్ధ.
* * *
"డాక్టర్... నేను కొద్ది నిమిషాల్లో లేదా కొద్ది గంటల్లో చనిపోతాను కదూ...."
అవునన్నట్లు తలూపాడు డాక్టర్ సిద్దార్ధ.
"నా గుండెను ఆ అమ్మాయికి అమర్చవచ్చు...."
ఒక్క క్షణం ఆమె మాట్లాడుతున్నది అర్ధం కాలేదు సిద్దార్ధకు అర్ధమైన మరుక్షణం, ఉద్వేగం.... విస్మయం.... కలిగాయి.
"కానీ... దీనికి మీ వాళ్ళు సమ్మతించాలి...."
"చెప్పానుగా డాక్టర్... నాకు సంబంధించిన ఒకే ఒక ఆత్మీయ వ్యక్తి... నా ప్రాణం యిప్పుడు ఎయిర్ పోర్ట్ లో వున్నాడు. అతను నా గురించి వెతుక్కుని వచ్చేసరికి నేనుండను. నా మృతదేహం వుంటుంది.
నేను చనిపోతానన్న భయం నాకు లేదు డాక్టర్. "కానీ, నా అభినయ్ ని విడిచి దూరంగా ఎక్కడికో తెలియని, తిరిగిరాని లోకాలకి వెళ్తానని...యికనేనుండనని, నా అభీతో జీవితాన్ని పంచుకోలేననే నిజం భరించలేకపోతున్నాను. అయినా... నేను చనిపోయినా, నా గుండె బ్రతికేవుండాలి. ఆ గుండె నా అభినయ్ కోసం కొట్టుకుంటూనే వుండాలి.... అందుకే నా గుండెను దానం చేస్తాను... నా గుం...డె...ను... దా...నం... చేస్తాను..."
మహాపతి విరజ పాదాల మీద పడ్డాడు. కంగారుపడిపోయింది విరజ.
"తల్లీ.... నువ్వు నాకు నా కన్నతల్లివి... నా బిడ్డకు ప్రాణం పోసే మాతృమూర్తివి... చిన్నవాళ్ళ పాదాలు తాకితే ఆయుక్షీణం అవుతుంది అంటారు... ఆయుష్షు కోల్పోతూ కూడా నా బిడ్డకు ఆయుష్షు పోసిన నీకు పాదాభివందనం..."
"అయ్యో.... ఏమిటిది.... నాకు తండ్రిలాంటివారు" విరజ వారిస్తోంది.
డాక్టర్ సిద్దార్ధ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. చక చకా తన కార్యక్రమాలు మొదలెట్టాడు. విరజకు అన్ని పరీక్షలు పూర్తి చేశాడు. అన్నీ సరిపోయాయి.
విరజ గుండెను అద్వైతకు మార్చవచ్చు.... టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ ఓ...కె.
* * *
"డాక్టర్...! నా గుండెను ఎవరికి అమరుస్తున్నారో ఆ వ్యక్తిని నేనోసారి చూడవచ్చా?" అడిగింది విరజ. స్ట్రెచర్ మీద, అద్వైత దగ్గరికి తీసుకువెళ్ళారు.
* * *
చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టులాడుతున్న అద్వైతని చూసింది విరజ.
"ఫ్రెండ్... నా ఆయుష్షు... కాదు... కాదు... నాగుండె ఆయుష్షుని పోసుకొని, నూరేళ్ళు నవ్వుతూ బ్రతుకు.... క్షణం క్రితం వరకూ నువ్వెవరో తెలియదు... ఈ క్షణం తర్వాత నుంచి నేను నీ శరీరంలో అంతర్భాగాన్ని.... నిన్ను నవ్వించాలన్నా, నిన్ను కంట తడిపెట్టించాలన్నా.... నీ ఉచ్చ్వాస, నిశ్వాసాలను నేనే అయిపోతాను. నా గుండె అనే ఆత్మతో, నీ శరీరం ఊపిరిపోసుకుంటుంది. నువ్వెలా వున్నా, ఈ గుండె మాత్రం నా అభినయ్ కోసం నిరంతరం తపిస్తూనే వుంటుంది. బెస్టాఫ్ లక్ మై ఫ్రెండ్....
ఫ్రెండ్.... మరోమాట... వింటావా ఈ గుండె సొద... నా గుండెను నేను నీవెందుకు ధారాదత్తం చేసుకున్నావో తెలుసా.... నా అభినయ్ కోసం... ఈ గుండె ఆగిపోకూడదు.... రక్తనాళాలు తెగి, శరీరభాగాలు చిద్రమైనా సరే... ఈ గుండె మాత్రం నా అభిషేకం కొట్టుమిట్టాడుతూ, నిరంతరం లయబద్దంగా ఊపిరి వదులుతూ ధ్వనిస్తూ వుండాలి... అందుకే నా ప్రాణమైన గుండెను, నీ కోసం మొత్తం యిచ్చేస్తున్నా..."