Previous Page Next Page 
మణిదీపం పేజి 29

    "మీరు నిగ్రహపరులని మీరే చెప్పుకుంటున్నారన్నమాట. చెప్పకపోయినా తెలుస్తూనే వుందిలెండి. ఎంత జడపదార్ధం కాకపోతే నడివయసు వచ్చినా, ప్రేమ, పెళ్ళి అనేవి లేకుండా వుంటారు. అయినా మీ సంగతి నాకెందుకులెండి. రెండు రోజులుండి ఇంటికి వెళ్ళిపోయే పేరెంటుని" గబుక్కున దుప్పటి తీసి ముఖంమీద కప్పుకు పడుకుంది అహల్య.

    విచిత్రమయిన మనిషి!

    తన భర్త అందంగా లేడని కుమిలిపోతూంది.

    అందమైన భార్యను పొందడం జగన్మోహన్ తప్పు కాదు. కాని పదేళ్ళ వైవాహిక జీవితంలో ఆమె మనసు చూరగొనే ప్రయత్నం చేయకపోవడం నిజంగా అతడి తప్పు.

   
                                                          *    *    *    *


    "ఈ రోజు మీ వదిన రమ్మన్నది" ఒకరోజు చెప్పాడు రామకృష్ణ.

    "ఏమిటి విశేషం?"

    "మా జయంతి పుట్టినరోజు ఈ రోజు."

    "జయంతి వచ్చిందా?" అరవింద్ స్వరంలో సంతోషం.

    "ఊ! శెలవులు కదా? వారం రోజులుంటుంది."

    జయంతి అర్చనా రామకృష్ణల ఒక్కగానొక్క కూతురు. హైదరాబాద్ లో వాళ్లమ్మమ్మ వాళ్ళ దగ్గర వుండి చదువుకొంటూంది. పదహారేళ్ళు వుంటాయి. సెలవుల్లో తల్లిదండ్రుల దగ్గరికి వస్తూ వుంటుంది. అరవింద్ ఆ పిల్లకి మంచి ఫ్రెండ్. సాహిత్యపరంగాగాని, సోషల్ గా గాని డిస్కషన్స్ అంటే ఇష్టం ఆ పిల్లకి. డిబేట్స్ లో ఆ పిల్లకి చాలా బహుమతులు వచ్చాయి.

    ఆ రోజు ఆరవుతుంటే గిఫ్ట్ బాక్స్ తో ఇంట్లోకి అడుగుపెట్టిన అరవింద్ ని, "హాయ్ అంకుల్! బాగున్నారా?" అంటూ చెస్ బోర్డు ముందు నుండి పరిగెత్తుకు వచ్చింది.

    "జన్మదిన శుభాకాంక్షలు" అంటూ గిఫ్ట్ బాక్స్ ఆ పిల్లచేతికి అందించాడు.

    "థాంక్యూ అంకుల్" సంతోషంతో జయంతి అరవింద్ చేతిమీద ముద్దు పెట్టేసింది. "ఒక్క పదినిమిషాలు కూర్చోండి అంకుల్! ఈ ఆట ముగించేసి వస్తాను."

    "అమ్మలేదూ?"

    "డాడీతో కలిసి గుడికి వెళ్ళింది అంకుల్! వచ్చేస్తుంది. ఈమె నా చదరంగం ప్రత్యర్ధి. ఓ! ఎంత బాగా ఆడుతుందో. ఎత్తులు వేయడంలో చాకు...చాకులా వ్యవహరిస్తుంది. రాక్షసిలా పోరాడుతుంది. మొన్నటి నుండి ఆడుతున్నాను. ఒక్క ఆటలో కూడా గెలుపు నాది కానివ్వలేదు" అంటూ ఎదురుగా కూర్చున్న అరుణోదయ బుగ్గ పొడిచింది.

    పది నిమిషాలు కూడా పట్టలేదు. జయంతి ఆట కట్టించింది అరుణోదయ.

    "ఇవ్వు! ముద్దివ్వు!" గెలుపు గర్వంతో జబర్దస్తీగా చేస్తున్నట్టుగా అడిగింది అరుణోదయ.

    "అన్ని ముద్దులూ నీ బుగ్గమీద నేనే పెట్టాలేం? నువ్వు ఇవ్వవా నా బుగ్గమీద?" బుంగమూతి పెట్టింది జయంతి.

    "నన్ను గెలువు! నీ బుగ్గమీద నేను ముద్దు పెడతాను."

    ముద్దు సుతారంగా పెట్టడానికి బదులు ఓడిపోయానన్న ఉక్రోషంతో పెడుతున్నట్టుగా బుగ్గమీద గాటుపడేలా కసిగా పెట్టింది జయంతి.

    అరుణోదయ బాధగా చెంపమీద రుద్దుకుంటూ "ముద్దు పెట్టమంటే బుగ్గని ఏపిల్పండులా కొరికిపెడతానా?" అంది గాటుపడ్డచోట ఎర్రగా కంది బుగ్గ అదో అందాన్ని సంతరించుకున్నట్టుగా అయింది.

    "కసి! నాలో కసి! ఓడిపోయిన కసి."

    "అయితే కసికి కాసే సమాధానం. ఈసారి నేనోడిపోయి రెట్టింపు కసితో" నీ బుగ్గమీద ముద్దు పెడతాను అన్నట్టుగా సంజ్ఞ చేసింది అరుణోదయ.

    "ఇదేం బెట్? ఇద్దరు ఆడపిల్లల మధ్య ఇలాంటి బెట్ కట్టుకోవడంలో మజా?" అన్నాడు అరవింద్ ఆశ్చర్యంగా.

    "మజా వుండేలా మీరూ, నేనూ పెట్టుకుందామా బెట్?" కొంటెగా కన్ను కొట్టి మరీ అడిగింది అరుణోదయ.

    గుండె జల్లుమన్నట్టుగా అయింది అరవింద్ కి. ముఖం హఠాత్తుగా ఎర్రబడిపోయింది. ఆ పిల్ల ధైర్యానికి విస్తుపోయాడు కూడా.

    "బెట్ లేకుండా మనిద్దరం ఆడదాం. చూద్దాం ఎలా గెలుస్తారో. నన్ను? వచ్చీరాని వాళ్ళతో ఆడి గెలవడం లో గొప్పేముంది?" చాలెంజ్ చేస్తూ అన్నాడు.

    "వచ్చీరానివాళ్ళతో ఆడడంలో గొప్పేమీలేదు. గెలవడంలో గొప్ప గర్వమూ లేదు. ఎన్నాళ్ళుగానో సమఉజ్జీ కోసమే నా అన్వేషణ_రండి ఆడదాం. కాని బెట్ లేకుండా ఆడడం నాకలవాటులేదు. బెట్ లేకుంటే అసలు నాకు ఆటలో ఉత్సాహం వుండదు."

    "పందెం తప్పనిసరి అంటే డబ్బు పెట్టుకుందాం."

    "పందెంలో డబ్బు పెడితే అది జూదం అవుతుంది. జూదమాడే అలవాటు నాకు లేదు. ఇంకేదైనా పందెం కాయండి."

    "ఇంకేం పందెం?"   

 Previous Page Next Page