సుధాకరు ఆగేడు.
"నీవు నన్ను చంపినా నీ అప్పు మునిగిపోదు.పైగా హత్యా నేరానికి జైలు కెళ్ళాలి తెలుసా?"
"సుధా! ఏమిటా దూకుడు ఆగు" అని "పాపయ్యా! మా అబ్బాయి రాసిన ప్రామిసరీ నోటు తెచ్చావా?" అడిగేడు సుందర్రావు.
"నేనేం పిచ్చివాడిననుకున్నారా అలా తేవటానికి. ఊరకే వచ్చిన మనిషినే చంపెయ్యాలని తయారయ్యాడే నీ సుపుత్రుడు. నోటు తెచ్చివుంటే కచ్చితంగా ఖూని చేసేసేవాడు"
"సుపుత్రుడు! నేను కాదురా నీ అల్లుడు సు-పు-త్రు-డు అయినా కొడుకులు లేని వెధవవు. నీకేం తెలుసు ఆ బాధ! నిజంగా మా అన్నే అప్పుచేసి వుంటే రేపే తీసుకురా అన్ని రిజిస్ట్రేషన్ చేయిస్తాం" రోషంగా అన్నాడతను.
కొడుకు మాటలు విని గుండె పగిలింది అన్నపూర్ణకఫ్.
"సుధా?"
"అమ్మా ఈ ఇల్లు లేకపోతే మనం బ్రతకలేమా? మెడల్లో వుండేవాడు బ్రతుకుతున్నాడు - ఇలాంటి యింటి వాడూ బ్రతుకుతున్నాడు. గుడిసెల్లో వాళ్ళూ జీవిస్తున్నారు. అదీ లేనివాళ్ళూ బ్రతుకుని లక్కోస్తున్నారు. ప్రయాణం లాంటిది ఈ జీవితం. ఫస్టు క్లాస్ సెకండ్ క్లాస్. ఏదయితేనేం చేరటానికి."
జవాబివ్వలేదు ఆమె.
"నీ వన్నమాట మీదే నిలుచుంటానంటే ఇప్పుడే పిలిపిస్తా"
"నేను సుందర్రావుగారి రక్తం పంచుకుని పుట్టాను గుర్తుంచుకో"
"అయితే క్షణంలో వస్తాను" అని గబగబా వెళ్ళిపోయాడు.
తిరిగి అతను వచ్చే వరకూ ఎవరూ ఏం మాటాడలేదు. అందరూ మనసులో మధన పడుతూనే వున్నారు...
"ఇవిగో స్టాంపులు. అగ్రిమెంట్ రాయించేను చదవండి సంతకాలు చేయండి. రేపు రిజిస్ట్రేషన్ వెడదాం" అన్నాడు పాపయ్య.
వచ్చిన పెద్ద మనుషులిద్దరూ సాక్షిసంతకాలు చేశారు. వీళ్ళు సంతకాలు చేశాక మధు నోరెత్తలేదు. తలెత్తి చూళ్ళేదు.
అగ్రిమెంట్ ఫారాలు తీసుకుని వెళుతూ వుంటే ఆవేశాన్ని అణచుకోలేక "ఒరేయ్! ఇంత కింత అనుభవిస్తార్రా మీరు! తల్లినీ తండ్రినీ కాదని నీవేం బావుకుంటావో చూడటానికి నేను బ్రతికే వుంటాను. క్రింది రాలిన కొద్ది కాలానికి పై ఆకు నేల రాలకపోదురా" అంది అన్నపూర్ణ.
మధు నోరు మెదపలేదు.
పాపయ్య విషపు నవ్వు నవ్వాడు.
"పిల్లి శాపాలకు ఉట్లు తెగవమ్మా తల్లీ! ఆఁ ఇంతకి యిల్లెప్పుడు ఖాలీ చేస్తారు?"
"రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత క్షణకాలం వుందం. పాము పడిగనీడని బ్రతికేకంటే బజార్లో వుండటం మేలు" అన్నాడు సుధాకర్.
"మీ ఇష్టం! నే కాదంటానా?" అని వెళ్ళిపోయాడతను, మధు అనుసరించేడు.
సామాన్లన్నీ బండిలో చేరవేస్తున్నారు. కుర్చీలో కూర్చుని ఈ నాటికి తన కుటుంబానికి సంప్రాప్తించిన దుర్దశకు దుఃఖిస్తున్నాడు సుందర్రావు.
ఏడిస్తే పోయేది ఆగదు. వచ్చేది రాక మానదు. ఎలా జరగావలసివుంటే అలా జరుగుతుంది అనే నిశ్చయానికి వచ్చేసింది అన్నపూర్ణ.
"బాబుగారూ!"
కళ్ళు తుడుచుకుని "ఎవరూ?" అన్నాడు సుందర్రావు.
"నేను బాబూ! మీ వెంకన్నని"
"వెంకన్నా! చూశావా పరిస్థితి ఎలా మారిపోయిందో? నా ఉద్యోగం పోయింది. కళ్ళు పోయాయి. జీవనాధారం పోయింది. చేతి కేదిగివచ్చిన కొడుకు విడిచి వెళ్లాడు. వచ్చిన డబ్బు పోయింది. చివరికి తలదాచుకోటానికి తాత తండ్రులు సంపాదించిన ఇల్లూ పోయింది."
"బాబుగారూ! మీరూ అలా బెంబేలు పడకండి. అన్నిటికీ భగవంతుడున్నాడు. ఇప్పుడెక్కడికి వెళతారు బాబుగారూ?"
"ఏదో ఓ సత్రంలో గది చూసివస్తానని చిన్నబ్బాయి వెళ్లేడు"
"బాబుగారూ!"
"అవును వెంకన్నా. ఇప్పటికిప్పుడు అద్దెకు ఇల్లెక్కడ దొరుకుతవి? పైగా అద్దె చెల్లించే తాహతు వుండొద్దూ?"