Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 29


    "సుమారు పదివేలు.... కొద్దిగా కాస్ట్ లీనే..."
    "ఓ.కె. నేను పాతికవేలిస్తాను..."
    "అదికాదు మేడమ్"
    "ఫార్టీ థవుజండ్"
    "మేడమ్"
    "ఫిఫ్టీ"
    "మే....డ..."
    "సిక్స్ టీ..."
    "మే....డ....మ్..." అతని గొంతు తడారిపోయింది.
    "ఆల్ రైట్.... లక్ష.... వన్ లాక్...." చెప్పండి అంది ఫైనల్ గా విరజ.
    షాపతను యింక ఆలోచించదల్చుకోలేదు.
    "ఓ.కె... మేడమ్... మీ మాట కాదనలేకపోతున్నాను. ప్యాక్ చేయించమంటారా?"
    "వన్ సెకన్... నా వాయిస్, రికార్డ్ చేయాలి...."
    షాపతను అలాగే అన్నాడు.
    "అభీ.... ఐలవ్ యు... నీ కోసమే ఈ గుండె సవ్వడి.... నీ కోసమే ఒక గుండె సవ్వడి...." రికార్డ్ చేశాడు షాపతను. చిప్ ఫిక్స్ చేశారు, సెల్ పెట్టారు. దాన్ని అందంగా, గిఫ్ట్ ప్యాక్ లా చేయించి యిస్తానన్నా, టైమ్ లేదని, అలానే కారులో పెట్టించింది.
    టైం చూసుకుంది.....
    సిక్స్ ట్వంటీ...
    "మై గాడ్... పది నిమిషాల్లో ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాలి. ఎంత స్పీడ్ గా వెళ్ళినా, అంత త్వరగా వెళ్ళడం ఈ ట్రాఫిక్ లొ కుదరదేమో...! అనుకోసాగింది విరజ.
    
                                                        * * *
    
    "మేడమ్... యిది వన్ వే...." చెప్పాడు ట్రాఫిక్ కానిస్టేబుల్.
    "వన్ వే" లో వెళ్తే ఎంత ఫైన్ వేస్తారు?" అడిగింది విరజ.
    ట్రాఫిక్ కానిస్టేబుల్ బుర్రగోక్కుని చెప్పాడు ఎంత ఫైన్ వేస్తారో.
    ఆ ఎమౌంట్ కి డబుల్ అమౌంట్ పర్స్ లో నుంచి తీసి యిస్తూ... "సారీ ఇంతకు మించి గత్యంతరం లేదు.... అవతల నా ప్రాణాన్ని రిసీవ్ చేసుకొనే టైమయింది..." అంటూ వన్ వేలోనే కారును పోనిచ్చింది.
    
                           * * *
    
    కారు వేగంగా వస్తోంది. వన్ వే కావడం వల్ల కార్లు ఎదురొస్తున్నాయి. తన పక్కనే సీటు మీద 'ఒక గుండె సవ్వడి' బొమ్మ రంగులు మారుతోంది. డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. లోపలవున్న రేడియం అక్షరాలు మెరుస్తున్నాయి.
    "అభీ! ఐ లవ్ యు... నీ కోసమే ఈ గుండె సవ్వడి... నీ కోసమే ఈ ఒక గుండె సవ్వడి" తన వాయిస్ మంత్రంగా వినిపిస్తోంది.
    ఎయిర్ పోర్ట్ లో అభీకి తన గుర్తుగా ఈ కానుక యివ్వాలి. తన పెళ్ళికి, తనక్కాబోయే భర్తకు తనిచ్చే అపురూప కానుక.
    ఆ క్షణం తన గుండెను దోసిట్లోకి తీసుకొని, ఆ గుండెను ఆ బొమ్మలో పెట్టి, అభినయ్ కు కానుకగా యివ్వాలనిపించింది.
    టైం చూసుకుంది. సిక్స్ ట్వెంటీ నైన్. కారు స్పీడ్ మరింత పెంచింది. మాగ్జిమమ్ స్పీడ్, కారు రోడ్డు మీద ఎగురుతోన్నట్టు వెళ్తోంది.
    తన డ్రైవింగ్ మీద  తనకున్న కాన్ఫిడెన్స్, అభినయ్ ని త్వరగా కలుసుకోవాలనే ఆత్రమూ ఆమెను ఆ స్పీడుకి తీసుకువెళ్ళాయి.
    ఎదురుగా లారీ... వేగంగా ఫుల్ లోడ్ లో వున్న లారీ... బ్రేక్ మీద కాలేసినా పనిచేయలేదు. ఆ వేగాన్ని కంట్రోల్ చేయడం ఆమె వల్ల కాలేదు...
    స్ప్లింట్ సెకన్... లిప్తకాలం...
    కాలం స్థంభించిందో... ప్రకృతి నివ్వెరపోయిందో... సృష్టి దిగ్భ్రాంతమైందో...
    పెద్ద శబ్దం...
    "అభీ... ఐ లవ్ యు... అంటోంది గుండె బొమ్మ. అప్పుడే యా..క్సి..డెం..ట్...
    తనకు ఫైన్ కట్టి రెండు నిమిషాలు గడవకముందే అదే కారు యాక్సిడెంట్ కు గురవ్వడం దూరం నుంచే చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పరుగెత్తుకొచ్చాడు.
    అతని పేరు వేలాయుధం.
    
                                * * *
    
    రక్తం మడుగులో పడివున్న వితజను చూసి వెంటనే దగ్గర్లో వున్న స్టార్ హాస్పిటల్ కు అంబులెన్స్ కోసం ఫోన్ చేశాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలాయుధం.
    నిమిషాల్లో అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. విరజను స్ట్రెచర్ మీద అంబులెన్స్ లోకి ఎక్కించారు.
    అంబులెన్స్ సైరన్ మోగించుకుంటూ ముందుకు కదిలింది.
    యాక్సిడెంట్ కు గురైన కారు చుట్టూ రాళ్ళు పెట్టి, డ్రైవింగ్ సీటు పక్కనే వున్న 'ఒక గుండె సవ్వడి' బొమ్మను చేతిలోకి తీసుకున్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలాయుధం.
    రక్తం తడి యింకా ఆ బొమ్మ మీద అలానే వుంది. ఆ బొమ్మ రంగులు మారుతూ వుంది. హార్ట్ బొమ్మ షట్టర్స్ ఓపెన్ అయ్యాయి. లోపల రేడియం అక్షరాలు 'ఒక గుండె సవ్వడి' అని... విరజ వాయిస్ చిప్స్ నుంచి వినిపిస్తూనే వుంది.
    సరిగ్గా అదే సమయంలో...
    
                                 * * *
    
    స్టార్ హాస్పిటల్.
    ఆ గదిలో ఎయిర్ కండిషనర్ శబ్దం తప్ప మరే శబ్దం వినిపించడం లేదు. అంత చలిలోనూ మహాపతి మొహంలో స్వేదం.
    "ఒరేయ్... సిద్దూ... బ్రతికించరా... నా బిడ్డను బ్రతికించరా... నా ఆయుష్షు పోసైనా నా బిడ్డను బ్రతికించరా. మనం చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్ మి కదరా.... ఏం చేసైనా సరే నా బిడ్డను నాకు దక్కించరా... చెప్పు... చెప్పరా ఏం కావాలి? నా ప్రాణాలు యివ్వాలా? నా ఆస్తి కావాలా? లక్షలు.... కోట్లు.... నా సర్వస్వాన్ని ధారపోస్తాన్రా.... నా బిడ్డకు ప్రాణాన్ని ధారపోయారా... నా చిట్టి తల్లిని బ్రతికించరా...." మహాపతి గుండె బద్దలవుతోంది.
    అప్పటి వరకూ అలుముకున్న నిశ్శబ్దం, శబ్దమైంది అప్పటి వరకూ గూడుకట్టుకున్న  విషాదం.... విస్ఫోటనమైంది.
    డాక్టర్ సిద్దార్ధ తన సీటులో నుంచి లేచి వచ్చి, మహాపతి భుజం మీద చేయేసాడు.
    "ఒరే పతీ! అద్వైత నాకు కూడా బిడ్డలాంటిదేనన్న విషయం మరచిపోతున్నవురా... అన్ని దారులూ మూసుకుపోయాయిరా... చివరికి ఆ చిట్టితల్లి గుండె కవాటాలు కూడా...
    ఒరే పతీ! శరీరంలో ఏ అవయవం కొంతసేపు విశ్రాంతి తీసుకున్నా ఫర్వాలేదు. యాభై సంవత్సరాల జీవితకాలంలో రెండు వందల కొట్ల సార్లు కొట్టుకొని, పన్నెండు వేల కోట్ల మిల్లీ లీటర్ల రక్తాన్ని శరీరానికి నిరంతరం సరఫరా చేసే గుండె మూడు నిమిషాలు కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా వుండదురా...
    నేత్రదానం చేసే వాళ్ళుంటారు, కిడ్నీదాతలు వుంటారు. కానీ, గుండెను దానం చేసేవాళ్ళెవరుంటార్రా....మనిషికి వుండేది ఒకే ఒక గుండె కదరా.... ఆరోగ్యం, బ్లడ్ గ్రూప్, ప్రాణాన్ని ధారపోసే ఉదారత్వం ఎవరికుంటుందిరా...."
    "అంటే... అంటే నా చిట్టితల్లి బ్రతకదా... నా చిట్టితల్లిని బ్రతికించాలేవా...ఎందుకురా మీ వైద్యశాస్త్రం.... ఎందుకురా విజ్ఞానం..." తలని టేబుల్ కేసి బాదుకోసాగాడు మహాపతి.
    "ఒరే పతీ... ప్లీజ్ కంట్రోల్.... కంట్రోల్ యువర్ సెల్ఫ్...."
    "ఎలారా....హౌ.... హౌ....కెన్ ఐ? పోనీ కృత్రిమ గుండె అమర్చయినా..."
    "అదీ ప్రయత్నించానురా.... మయో కార్డియల్ యిబ్బందితో బాధపడే రోగికి ఈ ఆపరేషన్ చేసి గుండె అమర్చవచ్చు. (హైదరాబాద్ లో కేర్ ఆసుపత్రిలో నలభై అయిదు సంవత్సరాల ఓ రోగికి అరుదైన ఆపరేషన్ ఏర్పాటుచేసి కృత్రిమ గుండెను ఏర్పాటు చేశారు. మయోకార్డియల్ యిబ్బందితో బాధపడే రోగికి ఈ ఆపరేషన్ చేసి విజయం సాధించారు. దేశంలోని మూడు, నాలుగు ఆసుపత్రులలోనే ఈ విధానంతో చికిత్స చేస్తున్నట్టు కేర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సోమరాజు చెప్పారు.... -రచయిత్రి)
    "మరింకేంరా.... నా బిడ్డను బ్రతికించరా... ఎంత డబ్బయినా...
    "అద్వైతకు వచ్చింది మయోకార్డియల్ కాదురా. యింత వరకూ సైన్స్ కే అంతు చిక్కనిది. కృత్రిమమైన గుండెను అమర్చడం కుదరని పని... కానీ...
    "చెప్పరా కానీ...."

 Previous Page Next Page