ఊహలు ఎంత అందంగా వున్నా వాస్తవం నుండి పారిపోవడం మంచిదా? అందం, ఐశ్వర్యం వుంటే చాలా? మనిషికి విజ్ఞానం, వికాసం అక్కరలేదా? ఈ సమాజం ఏమిటి? ఈ బాధలు గాధలు ఏమిటి? మనిషికెన్ని సమస్యలు. వాటిపట్ల ఒక అవగాహన కలిగిస్తూ ఒక సందేశం ఇవ్వని నవలలెందుకు? సినిమాలెందుకు?"
"విజ్ఞానం కావాలంటే జీవితాన్ని చదవాలంటే నవలలు కాదు, సినిమాలు కాదు. వాటి ప్రయోజనం పాఠకులను రంజింపజేయడం వరకే జీవిత పాఠాలు నేర్పాలని ప్రయత్నిస్తే నిర్మాత తలమీద గుడ్డ కప్పేసుకుంటాడు."
"మీ మాటలు బాగున్నాయి. కాని మీవారి మీద మీరు చేసిన కామెంటే బాగాలేదు. పాపం ఆయన వింటే ఏమనుకుంటారు?" అన్నాడు అరవింద్.
"బాగా లేనిమాట నిజమేకదా! ఉన్నమాటంటే ఏదో అనుకోవడం ఎందుకు?"
"బాహ్యసౌందర్యంకంటే ఆత్మసౌందర్యం గొప్పదండీ! మనం ప్రేమించాల్సింది రెండవదాన్నే."
"అలాగని ఎవరూ అనాకారిమొగున్నీ, అనాకారి పెళ్ళాన్నీ కోరుకోరుకదా?"
"మరి నచ్చనప్పుడు ఎందుకు చేసుకున్నారు?"
"దిక్కుమాలిన ఈ దేశంలో ఆడపిల్లకి పెళ్ళి తన విషయంలో స్వేచ్ఛ కూడా వుందా?"
"ఎలా జరిగింది మీ పెళ్ళి?"
"ఏదో ఫంక్షన్ లో నన్ను చూసి పెళ్ళి చేసుకుంటానని కబురుచేశారు ఆయన. ఇంజనీరు, ఆస్థిపరుడు- మా వాళ్ళు ఎగిరి గంతేశారు. వాళ్ళ దృష్టిలో ఆయన మొరటురూపం అభ్యంతరంగా కనిపించలేదు. నా అభ్యంతరాన్ని లెక్క చెయ్యలేదు. తరువాత అంతా చక్కబడుతుందాని బలవంతంగా కట్టబెట్టేశారు."
"సరే! ఈ విషయంమీద మరోసారి మాట్లాడదాం. వస్తాను."
మరురోజు సుజాత చెప్పింది_ "నిన్న మీ గురించి ఆమె గ్రుచ్చి గ్రుచ్చి అడిగింది. 'డాక్టరుగారు పెళ్ళెందుకు చేసుకోలేదు? ఎవరినయినా ప్రేమించారా?' అంటూ, మీరు చాలా బాగుంటారని కూడా కామెంట్ చేసింది. ఆమె కళ్ళు మీ మీద పడ్డట్టుగా నాకుమానం డాక్టర్!"
"తప్పు! ఆమె ఒకరికి భార్య. అలా ఆమె గురించి అనుకోవడం తప్పు" మందలించాడు అరవింద్.
ఆ సాయంత్రం సుజాత అనుమానం బలపడేలా మాట్లాడింది అహల్య_ "మీరెందుకని అవివాహితులుగా వుండిపోయారు డాక్టర్? ఇంత అందమయినవాడిని ఏ అమ్మాయీ స్వంతం చేసుకోకపోవడం దురదృష్టకరం."
"మనిషి అందం ముఖంలో వుండదు. మనసులో వుంటుంది. మిమ్మల్నే కాదు, మీ వారినీ అబ్జర్వ్ చేశాను. అతడి బాహ్యరూపాన్నే చూశారుగానీ అతడి ఆంతర్యాన్ని చూడలేకపోయారు. మీ వారు చాలా మంచి మనిషి. ఆ మంచి మనిషిలో కొండంత ప్రేమ వుంది మీరంటే. అతడి మనసును చూడటం మొదలుపెట్టండి. అంత సుందరమైన మనిషి మరొకరు కనిపించరు మీకు. శారీరకంగా మీకు ఏ అనారోగ్యంలేదు. వున్నదంతా మీ మనసులోనే. మీ వారిని ప్రేమించడం ఒక్కటే మీ అనారోగ్యానికి సరయిన మందు."
"నేను మా వారిని ప్రేమించడంలేదని మీరెలా అంటారు?" చురుగ్గా అడిగింది అహల్య.
"భర్తను ప్రేమించిన ఏ ఆడదీ పరాయి మగాడిలో అందచందాలు వెదకదు."
"సౌందర్యాన్వేషణ కళాత్మకతకు సంబంధించిన విషయంకదా? అందులో అంత పాపం ఏముంది?" ఏదైనాసరే, నిర్భయంగా మాట్లాడగలగడం అహల్య ప్రత్యేకత.
"సౌందర్యాన్వేషణ పిట్టల్లో, పువ్వుల్లో, గుట్టల్లో పుట్టల్లో సాగించండి ఆత్మానందం కలుగుతుంది. మనసును ఆరోగ్యవంతంగా వుంచుతుంది. అంతేగాని ఇలా పరాయి మగాళ్ళలో వెదకడం మొదలుపెడితే చివరికి వ్యభిచారిణిగా ముద్రపడతారు."
"బాగుంది. మీరు అందంగా వుంటారని మెచ్చుకున్నంత మాత్రాన నేను వ్యభిచారిణిని అవుతానా? మొన్న సుజాత సిస్టర్, జీవరత్న సిస్టర్ 'మీరు చాలా అందంగా వుంటారు' అని నన్ను మెచ్చుకున్నారు. వాళ్ళూ వ్యభిచారిణులైనట్టా?"
"మిమ్మల్ని వాళ్ళు మెచ్చుకోడానికీ, నన్ను మీరు మెచ్చుకోడానికీ తేడా లేదా?"
"మీరు అందంగా వున్నారు కాబట్టి అన్నాను."
"ఉన్నా అనకూడదు."
"మావారిలో లేని అందం ఎక్కడ కనబడ్డా నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది."
"ఈ మాట ఏ మగాడి దగ్గరా అనకండి. రెచ్చిపోయి మీద పడతాడు."