Previous Page Next Page 
మధుకీల పేజి 28

    ముఖం మాడిపోయింది. కమిలిన వంకాయలా అయిపోయింది. తల వంచుకుని అవమానంతో గబగబా వెళ్ళిపోయాడు.
    నిశ్శబ్దం!
    భయంకరమైన మౌనం.
    దిగులు! ఉక్రోషం! ఆవేశం! చేతకానితనం... దుఃఖం.
    "రావుగారూ! ఇప్పుడెలా?" శాస్త్రిగారు అడిగేడు.
    "రేపు సాయంకాలం కల్లా రెడీ చేస్తామని చెప్పండి. విషయం విశదీకరించండి."
    "ఆయనేం చెప్పక్కర్లేదండి. తప్పయినా వచ్చి అంతా విన్నాను. మళ్ళీ నన్ను తప్పుగా భావించనంటే ఓ మాట చెపుతాను" అన్నాడు కేశవమూర్తి.
    సిగ్గుతో అవమానంతో భుమిలోకి చొచ్చుకుని పోతున్నట్టుగా వుంది సుందర్రావుకి.
    "చెప్పండి" అన్నాడు సుధాకర్
    "నాకు ఉద్యోగం ముఖ్యం- దానికి మూలకారణం పెళ్ళి...... మరో అవకాశం నాకు జన్మలో మళ్ళిరాదు.
అందుకని మీరెలాగైన రేపటిలోగా సర్దుబాటు చేయగలిగితే--" అని ఆగి పూర్తి చేయకుండా వెళ్ళి పోతూ "వస్తాను" అని వెళ్ళిపోయాడు.
    పిడుగు పడ్డాక వున్న పచ్చిక బీడులా అయింది ఆ యింటి వాతావరణం
    శాస్త్రి గారు మెల్లగా సెలవు తెసుకున్నారు.
    దిగాలు పడిపోయారు సుందర్రావు గారు. అన్నపూర్ణ మనస్సులో వ్యక్తం చేయలేని ఆవేదన సుళ్ళు తిరుగుతుంది.
    జయప్రద మనస్సుని నే చెప్పలేను.
    సుధాకర్ కి మనస్సులో వేడి యినుముని సమ్మెటతో బాదుతున్నట్టుగా వుంది.... యింట్లో వుండలేక బయటికి వెళ్ళిపోయాడు.
                                   *    *    *
    "ఏమయ్యా! సుందర్రావు పెద్ద మనిషివే! కళ్ళు పోయినా యింకా బుద్ది రాలేదా?" కర్కశంగా కోపంగా ప్రశ్నించాడు పాపయ్య.
    "పాపయ్యా!"
    "మర్యాద! మర్యాద! పాపయ్య గారూ అనాలి!"
    "అది యిచ్చి పుచ్చుకునే వాళ్ళకే పాపయ్యా! ఇవ్వ నమ్మకు దొరకదు పెట్టనమ్మకు పుట్టారు అనటం విన్లే! రానిది రమ్మంటే రాదు"
    "నీ వేదాంతం చాలుగానీ నలుగురు చీ! చీ! అనేట్టు చేస్తున్నావే?"
    "ఏం చేశాను" ఆవేశాన్ని అణచుకుంటూ అడిగేడు సుందర్రావు!
    "కొడుకుని అన్యాయం చేయటం లేదూ?"
    "హు కొడుకు ఎవరయ్యా కొడుకు? తండ్రి గతి చెడి యిల్లు చేరితే తల్లినీ చెల్లినీ తమ్ముడిని తండ్రినీ ఆదుకోవలసిన వాడు బంగారు చిలక వెంటపడి వెళతాడా? వాడా కొడుకు? నాకొక్కడే పాపయ్యా కొడుకు"
    "ఇదుగో సుందర్రావు? కాదంటే పోవటానికి ఇదేం ఆషామాషీ వ్యవహారం కాదు. పెద్దమనుషులున్నారు."
    "రమ్మను యిలా! ఏ పెద్ద మనిషి వచ్చి తగవు చెపుతాడో!"
    "అలా అంటే కోర్టు వుండనే వుంది"
    "ఛీ! నువ్వు మనిషివా?"
    "మనీ దండిగా వున్నవాడే మనిషి సుందర్రావు! నీ వద్దేముంది యిక నువ్వు బికారివి. రేపటి నుంచి నువ్వు బజార్లో వుండాలి."
    "పాపయ్యా!"
    "అలా అరిస్తే పనులు జరగవు. నీ కొడుకు నాకు పదివేలు బాకీ. మీరంతా కలిసి వున్నప్పుడు ప్రామిసరీ నోటు వ్రాశాడు. ఈ ఇంటి ఖరీదు ఎంత కాదన్నా పదిహేను వేలకి మించదు. మూడోవంతు భాగం అయిదువేలు - నా అప్పు పదివేలు ఈ ఇంటికి సరిపోతుంది. మరియాదగా యిల్లు నా పేర్నో, నా కూతురి పేర్నో రిజిస్టర్ చేసి ఖాళీ చేసి వెళ్ళండి. లేదా కోర్టు వుండనే వుంది."
    "ఏమిటలా కేకలు వేస్తున్నారు?" అప్పుడే బయటి నుంచి వచ్చిన సుధాకర్ అడిగేడు. అంతలో అన్నపూర్ణ కూడా వచ్చింది.
    "మీ అన్నయ్య భాగం మీ అన్నకి కావాలి. మీ జాయింట్ కుటుంబంలో ఉన్నప్పుడు నా వద్ద పదివేలు బాకీ చేశాడు. నా అప్పు తీరాలి. అందుకని యిల్లు జమ వేయమటున్నాను" తాపీగా చెప్పాడు పాపయ్య.
    "రాస్కెల్! ఎంత చేస్తున్నావురా? మా అన్నయ్యకి మాకు కాకుండా చేయాలనీ చూస్తున్నావా? నీకీ రోజు ఆయుష్షు తీరింది. నీ పీడ వదిలితే మేం సుఖపడతాం"
    మీద మీదకు వస్తున్న అతన్ని చూసి క్షణం జంకాడు పాపయ్య "ఆగు!" అని బిగ్గరగా కేకేశాడు.

 Previous Page Next Page