Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 28


    "బై విరూ... షార్ప్ సిక్స్ థర్టీకల్లా ఇండియాలో, అదీ ఎయిర్ పోర్ట్ లో వుంటాను..."
    "బై..." అంది విరజ.
    ఫోన్ డిస్ కనెక్ట్ చేశాడు అభినయ్.
    
                                * * *
    
    అతివేగంగా వస్తోంది అంబులెన్స్ సరాసరి మహాపతి యింటి ముందు ఆగింది. హడావిడిగా గేటు తీశాడు వాచ్ మెన్.
    అంబులెన్స్ లోపలికి వచ్చింది. హాస్పిటల్ బోయ్స్, నర్సులు పరుగు పరుగున దిగారు. హాలులోనే ఆత్రుతగా ఎదురుచూస్తూ కూర్చున్నాడు మహాపతి. ఆయన మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
    రామ్ బెనర్జీ కాలుగాలిన పిల్లిలా అటూ... ఇటూ... తిరుగుతున్నాడు.
    మేడమీద గదిలో అద్వైతి అతికష్టంగా ఊపిరి తీస్తోంది. ఆక్సిజన్ మాస్క్ లు మొహానికి అమర్చి వున్నాయి. యిద్దరు లేడీ డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. నర్సులు ఆ గదిలోకి పరుగెత్తుకెళ్ళారు. అద్వైతను చకచకా స్ట్రెచర్ మీదకు మార్చారు. మేడమెట్లు వేగంగా దిగుతూ అద్వైతను తీసుకెళుతున్నారు. నిమిషాల్లో అద్వైతను అంబులెన్స్ లోకి ఎక్కించారు. డోర్స్  మూసుకున్నాయి. డాక్టర్లు అద్వైతకు ఫస్ట్ ఎయిడ్ చేస్తూనే ఉన్నారు. అంబులెన్స్ ముందుకు కదిలింది.
    ఆ వెనకే కారులో మహాపతి, రామ్ బెనర్జీ బయల్దేరారు.
    సరిగ్గా గంట క్రితం....పెయింటింగ్ చేస్తున్న అద్వైతి తండ్రితో మాట్లాడుతూనే విరుచుకు పడిపోయింది. శ్వాస పీల్చడం కూడా కష్టమైంది. ఫ్యామిలీ డాక్టర్లు, రెగ్యులర్ చెకప్ చేస్తున్న డాక్టరు, హుటాహుటిన వచ్చారు. పరిస్థితి గమనించారు. హాస్పటల్ కు తరలించమని సలహా ఇచ్చారు. క్షణాల్లో అంబులెన్స్ వచ్చింది.
    "దేవుడా.... నా బిడ్డను బ్రతికించు... నా ఆయుష్షు పోసైనా సరే..." మహాపతి మనసులోనే దేముడ్ని వేడుకున్నాడు.
    రాం బెనర్జీ కూడా ఆ క్షణం దేముడ్ని వేడుకున్నాడు. కాకపోతే మరోలా...
    
                                 * * *
    
    కాదంబరి విరజకు ఫోన్ చేసింది.
    "మేడమ్! నేను కావాల్సిన ఏర్పాట్లలో సిక్స్ వరకూ రెడీగా వుంటాను బిర్లామందిర్ లో.... మీరు వచ్చేయండి" అంది.
    "ఓ.కె. అన్నీ పర్ ఫెక్ట్ గా వుండాలి.... తెల్సిందా?"
    "యస్... మేడమ్..."
    సాయంత్రం వరకూ అతికష్టంమీద వుండగలిగింది విరజ ఇంట్లో... క్షణాలు కూడా లెక్కబెడుతోంది.
    ఈవినింగ్ సిక్స్...
    అభినయ్ పెళ్ళి కోసం కొన్న పట్టుచీరలో విరజ ముస్తాబయింది.
    ఓసారి అద్దంలో తనను తాను చూసుకుంది.
    అభినయ్ చేతుల్లో ఎప్పుడు వాలిపోదామా అని వుంది.
    
                                * * *
    
    ఆరు అయిదుకు లాన్సర్ లో బయల్దేరింది విరజ.
    ఎయిర్ పోర్టుకు ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు. అయిదు నిమిషాలు ముందే వుంటుంది తను.
    డ్రైవర్ ని వద్దంది. తనే డ్రైవింగ్ సీటులో కూచుంది.  కారు ముందుకు కదిలింది.
    
                               * * *
    
    చలిగాలి రివ్వున వీస్తోంది. అయినా కారు విండో డోర్స్ ఓపెన్ చేసే వుంచింది. ఆ గాలి అదోలాంటి ఆనందాన్నిస్తోంది.    
    ట్రాఫిక్ విపరీతంగా వుంది. సాయంత్రం సమయం కావడం వల్ల అది మరికాస్త ఎక్కువయింది. రోడ్డుకు ఇరువైపులా షాపులు షాపుల ముందు అమర్చిన రంగు రంగుల విధ్యుద్దీపాలు...
    రోజూ చూస్తూ వుండే షాపులే... కానీ ఈరోజు షాపులు అందంగా కనిపిస్తున్నాయి. రోడ్డుమీద నడిచే మనుషులు అందంగా కనిపిస్తున్నారు. చివరకు రోడ్డుమీద వెళ్ళే వెహికల్స్ కూడా విరజకు అందంగానే కనిపిస్తున్నాయి. బహుశః అది తన అభినయ్ ని చూడబోతున్నానన్న ఆనందం వల్ల కాబోలు.
    మానసికానందం ఇచ్చే సంతృప్తిని మరే యితర ఆనందమూ ఇవ్వలేదు. ఆ మానసికానందం డబ్బువల్ల.
    ఆకర్షణవల్ల కాకుండా, కేవలం మన మనిషిలోని మనసువల్ల కలిగితే, ఆ మానసికానందం ఉనికి తాలూకు ఉధృతి సముద్ర కెరటాలవల్ల వేగాన్ని మించుతుంది.
    మరో పదిహేను నిమిషాల్లో ఎయిర్ పోర్ట్ వస్తుందనగా గుర్తొచ్చింది. తను అభినయ్ కోసం కనీసం బొకే కూడా తీసుకెళ్ళటం లేదన్న విషయం.
    ఓ పక్క డ్రైవ్ చేస్తూనే మరోవంక బొతిక్ షాపులకోసం చూస్తూంది. సరిగ్గా అప్పుడే ఆమె దృష్టి లెఫ్ట్ సైడ్ వున్న షాపుమీద పడింది.
    ఆ షాపు ముందు ఓ హార్ట్ బొమ్మ డిస్ ప్లే చేయబడి వుంది. దాదాపు ఒకటిన్నర అడుగుల బొమ్మ అది. విరజ కారుని స్లో చేసి చూస్తూ వెళ్ళసాగింది. ఆ బొమ్మలో అంత అట్రాక్షన్ వుంది. క్షణ క్షణానికి రంగులు మారుతూ వుంది. రంగులు మారడం పూర్తవ్వగానే, వెంటనే ఆ గుండె బొమ్మకు వున్నరెండు డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. లోపల 'ఒక గుండె సవ్వడి' అని రాసి వుంది. రేడియం అక్షరాలతో మెరిసిపోతూ వుందా వాక్యం. కొద్ది క్షణాల్లోనే మళ్ళీ గుండెకు అమర్చిన రెండు తలుపులు మూసుకుంటున్నాయి. మళ్ళీ రంగులు మారుతున్నాయి ఏడువర్ణాలు మారగానే మళ్ళీ తలుపులు తెరుచుకోవడం....
    చాలా విచిత్రంగా అనిపించింది విరజకు. వెంటనే కారును రివర్స్ చేసి, ఆ షాపుముందు ఆపింది.
    విరజను చూసి ఆ షాపు ఓనర్ వినయంగా ఎదురొచ్చాడు. విరజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ గా ఆమెను గుర్తుపట్టాడు.
    విరజ ఆ హార్ట్ బొమ్మవైపు చూపించి "ఇదేమిటి చిత్రంగా వుంది" అని అడిగింది.
    జస్ట్ అరగంట క్రితమే వచ్చింది మేడమ్. కొత్త వెరైటీ. 'ఒక గుండె సవ్వడి' పేరుతో ఈ ప్రోడక్ట్ త్వరలో మార్కెట్ లోకి వస్తుంది. ఆక్చువల్ గా వాలెంటెన్స్ డే రోజు మార్కెట్ లోకి ఈ ప్రోడక్ట్ ని ప్రవేశపెట్టాలనుకున్నారు. అందుకే ఈ లోగా పబ్లిసిటీకోసం డిస్ ప్లే పర్సన్ కోసం పంపించారు.
    ట్విన్ సిటీస్ లో ఈ ప్రొడక్ట్స్ కి ఒకే ఒక డిస్ట్రిబ్యూటర్ ని.... గర్వంగా చెప్పాడా షాపతను.
    "దీని ప్రత్యేకత ఏమిటి?" అడిగింది విరజ.
    "మనం సప్త వర్ణాలు అంటాంగా మేడమ్... అలా ఇది ఏడు రంగులు ఆటోమేటిగ్గా మారుతుంది. ఏడు రంగులు మారగానే ఈ గుండె తలుపులు రెండు తెరుచుకుంటాయి. లోపల 'ఒక గుండె సవ్వడి' అని రాసి వున్న రేడియం అక్షరాలు మెరుస్తాయి. దీనిలోపల ప్రేమికుల బొమ్మలు ఇన్ సెట్ చేసుకునే సదుపాయం వుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాషలో వుంటుంది. ఏ భాషలో వున్నా, లోపల వచ్చే అక్షరాల భావం, 'ఒక గుండె సవ్వడి' మాత్రమే. ఈ బొమ్మలో వున్న మరో గొప్ప విశేషం ఏమిటంటే ఈ గుండె లోపల ఓ చిన్న చిప్ వుంటుంది. అమ్మాయిగానీ, అబ్బాయిగానీ 'ఐ లవ్ యు' అని తమ వాయిస్ ని రికార్డు చేసి, ఆ చిప్ లో పెడితే.... గుండె కంటిన్యూగా గుండె తలుపులు తెరుచుకున్న ప్రతిసారీ, రంగులు మారే ప్రతీసారీ 'ఐ లవ్ యు' అనే వాయిస్ రిపీట్ అవుతూ వుంటుంది. ఆ చిప్ ని మార్చాల్సిన అవసరం వుండదు. ఎందుకంటే ఆ వాయిస్ ఆ చిప్ అందులో వున్నంతవరకూ వినిపిస్తూనే వుంటుంది" వినయంగా డిటైల్స్ చెప్పాడు ఆ షాపతను.
    "నాకా 'ఒక గుండె సవ్వడి' బొమ్మ కావాలి..." అంది వెంటనే విరజ.
    "సారీ మేడమ్.... అది డిస్ ప్లే కోసం తీసుకువచ్చాను. ఫిబ్రవరి 14 వరకూ ఆగాల్సిందే...." చెప్పాడు వినమ్రంగా షాపతను.
    "అలా కాదు.... ఆ బొమ్మ నాకు యిమీడియట్లీగా కావాలి"
    "సారీ మేడమ్... అంతగా కావాలంటే నేను ఈ ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీ నుంచి ట్రయ్ చేస్తా..."
    "నో...నో... ఐ వాంట్ యిమీడియట్లీ...."
    "అది కాదు మేడమ్..."
    "ఈ బొమ్మ మార్కెట్ లోకి వచ్చాక, ఎంత ఖరీదు చేస్తుంది."

 Previous Page Next Page