Previous Page Next Page 
మణిదీపం పేజి 27

    "ఆమె లేస్తుందేమో, ఒకసారి తట్టి పిలవండి" అరవింద్ చెప్పాడు జగన్మోహన్ తో.

    "అహల్యా! అహూఁ..."

    ఆమె ఉలుకూ పలుకు లేనట్టుగా అలాగే వుండిపోయింది.

    ఆమెకు ఇంజక్షన్ చేసి బయటికి వస్తూ, "ఆమెను రేపు హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. కొద్ది రోజులు ఆమెను నా అబ్జర్వేషన్ లో వుంచుకోవడం అవసరం" చెప్పాడు అరవింద్.

    "హాస్పిటల్ వాతావరణమంటే దానికి ఎలర్జీ."

    "కావాలంటే స్పెషల్ రూం ఎలాట్ చేస్తాం. సరైన ట్రీట్ మెంట్ కావాలంటే ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేయక తప్పదు."

    జగన్మోహన్ జేబులోంచి పర్స్ తీసి, "మీ ఫీజు..." అంటూ ఆడబ్బు ఇవ్వబోయాడు.

    "సారీ! నేను ఫీజు తీసుకోను, గవర్నమెంట్ సర్వీస్ లో వున్న వాడిని."

    "ఇంత రాత్రివేళ....ఇంటికి వచ్చారుకదా...."

    "రాత్రొచ్చినా, పగలొచ్చినా ఆ బాబు తీసుకోడు. రోగులనుండి పైసా ముట్టడు" రుక్మిణమ్మ చెప్పింది.

   
                              *    *    *    *


    అహల్యని హాస్పిటల్లో అడ్మిట్ చేసి మూడు రోజులయింది.

    ఆమె అందం డాక్టర్ల నే కాదు, నర్సులనూ ముగ్ధపరిచిందేమో సుజాత అన్న నర్స్ ఆమెకు 'ఏంజల్' అని పేరు పెట్టింది. ఆమె అందం గురించే చర్చ. అంత అనాకారి భర్తను ఎలా చేసుకుందన్న ఆశ్చర్యం.

    నర్సులతో చక్కగా కబుర్లాడుతూ, పుస్తకాలు చదువుకుంటూ లొ వాయిస్ లొ టేప్ రికార్డర్ లొ పాటలు వింటూ, ఇంట్లో వున్నంత ఫ్రీగా కులాసాగా వుంది అహల్య. ఆమెకు ఏదో జబ్బుందంటే ఎవరూ నమ్మరు.

    తను వాళ్ళింట్లో చూసినప్పుడు ప్రతిమలా పడివున్న అహల్య ఆమేనంటే అరవింద్ కి ఆశ్చర్యంగా వుంది.
   
    ఈ మూడు రోజుల్లో ఆమెను బాగా స్టడీ చేశాడు అరవింద్. అత్తగారి మాట నిజమే. అహల్యను ఆప్యాయంగా కూతుర్లా చూసుకుంటుందామె. జగన్మోహన్ సరే సరి. అప్పుడే సరస్సులోంచి కోసి చేతిలో పట్టుకున్న 'కలువ' పువ్వంత సుతారంగా చూస్తాడు ఆమెను. ఇంజనీర్ గా అతడి జీతం పెద్దదేకాక వెనుక బాగా ఆస్తిపాస్తులున్నవాడు. ఆమె సంతోషం కోసం డబ్బును తృణప్రాయంగా ఖర్చు పెట్టేస్తాడు.

    అతడి పరోక్షంలో నవ్వుతూ, త్రుళ్ళుతూ వుంటే అహల్య అతడి సమక్షంలో ముభావంగా వుండిపోవడం గుర్తించాడు అరవింద్.

    సుజాత వెంటరాగా ఒక సాయంత్రం ఆమె గదిలోకి వచ్చాడు.

    అహల్య ఏదో నవల చదువుతూంది. డాక్టర్ని చూసి దిండుమీద బోర్లించింది.

    ఆమెకు బి.పి. చూడ్డం అయ్యాక, బోర్లించిన పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు అరవింద్.

    స్వరూపారాణి 'నీటిపూలు' నవల అది.

    "మీ అభిమాన రచయిత ఎవరు?" అని అడిగాడు.

    "నా అభిమాన రచయిత్రి స్వరూపారాణే! ఆమె వ్రాసిన ప్రతి నవలా నాలుగైదుసార్లన్నా చదివి వుంటాను. 'నీటిపూలు' అయిదోసారి. నా హోం లైబ్రరీలో ఆమె వ్రాసిన నవలలన్నీ వున్నాయి."

    "అలాగా? ఏముంటుంది ఆమె నవలల్లో?"

    "నవల చదువుతున్నట్టుగా వుండదు. ఏదో రసవత్తర దృశ్యాన్ని చూస్తున్నట్టుగా వుంటుంది. సినిమా చూస్తున్నట్టుగా వుంటుంది. ప్రతి సన్నివేశం కళ్ళకు కట్టినట్టుగా రాస్తుంది. 'బాపు' బొమ్మకు ఒక ప్రత్యేకత ఎలా వుంటుందో స్వరూపరాణి హీరోయిన్ కూ ఒక ప్రత్యేకత వుంటుంది. అందం, అందంతోపాటు ఆత్మాభిమానం, అనుకున్నది సాధించగల ఆత్మవిశ్వాసం వుంటాయి"

    "స్వరూపరాణి హీరోలకే ప్రత్యేకత వుందనుకొన్నానే. మీరు ఆమె హీరోయిన్ లకూ వుంటుందన్నారు. స్వరూపరాణి హీరో అనగానే ఆరడుగుల అందగాడూ....పడవంత కారు..."

    "ఆగండాగండి! ఈ విషయంలో ఒక స్వరూపరాణిణే అనడం ఎందుకు? ఏ రచయితలైనా తమ హీరో హీరోయిన్లను అందగాళ్ళణే వర్ణిస్తారు. అంతెందుకు? శరత్ బాబు నవలలు చదివారా? ఆయన కథానాయిక లందరూ అతిలోక లావణ్యవతులే. శేషప్రశ్నలో శివానీని చూడండి. చరిత్రహీనుల్లో సావిత్రిని చూడండి. విజయను చూడండి. విరాజ్ బహును చూడండి, రాజ్యలక్ష్మిని చూడండి శ్రీకాంత్ లో, అందరూ అసమాన సౌందర్యవతులే. అలాగే ఆయన హీరోలు కూడా.విప్రదాసును ఎలా వర్ణించాడో చూశారా? ఆరడుగుల ఆజానుబాహువూ, స్పురద్రూపి, దృఢ కాయుడూ అని వర్ణిస్తాడు. ఆడవాళ్ళ కన్నీళ్ళను, కరుణామయ గాధలను ఆయనంత బాగా యింకెవరూ చిత్రించలేరని పేరుపొందిన ఆయన జమీందారు కుటుంబాలు లేకుండా వ్రాసిన నవలలు చాలా తక్కువ. హీరోలో, లేకపోతే హీరోయినో జమీందారు కుటుంబాలకు చెందినవాళ్లై వుంటారు."

    "అయితే మీరు పుస్తకాలు బాగా చదవడమే కాదు చాలా చక్కగా విమర్శిస్తా రన్నమాట."

    "ఈ దిక్కుమాలిన ప్రపంచంలో అందం, ఐశ్వర్యం ఎందరికి వుంటాయంటారు? అవి నిజ జీవితంలో పొందాలంటే ఎంత కష్టం? కాని ఊహల్లో ఈజీగా అందుకోవచ్చు కదా? ఊహల్లో ఎంత ఆనందముంటుందని? కథల్లో కూడా దరిద్రం, కురూపిత్వం, కన్నీళ్ళు, కష్టాలు, సమస్యలు, ఎవరు చదువుతారండీ? సినిమాలైనా అలాంటివి ఎవరు చూస్తారు? అందంతో పనిలేదనుకుని మా వారిని తీసికెళ్ళి హీరోను చేస్తే ఎవరు చూస్తారు?"   

 Previous Page Next Page