"ఏవిటీ! ఋషీ బ్యాంక్ లో మన డబ్బు కూడా ఉందా?" తెల్లబోతూ అంది కాదంబరి.
"అవునే... అవును... అదీ ఎంతోకష్టపడి నీకు తెలియకుండా జాగ్రత్త చేసి దాచిన డబ్బు.... ప్రాణం ఉసూరుమంటోంది."
"నిన్నెవరు దానిలో దాచ,మన్నారు? కనీసం ఒక్కమాటైనా చెప్పావా? నాకు! అనుభవించు..."
"మన ఎదురింట్లో వున్న ఆ రామనాథం సచ్చినోడు ఆ బ్యాంక్ లో వేసేవరకూ ఒకటే నసపెట్టాడు. పైగా అన్ని బ్యాంక్ ల కంటే ఎక్కువగా వడ్డీ ఇస్తారు బామ్మగారూ అని చెప్పి సచ్చాడు. దొంగసచ్చినోడు. నా వుసురు తగలక పోదు..." మెడికల్ విరుస్తూ అంది బామ్మ.
"ఎక్కువ వడ్డీ వస్తుంది కదాని ఆశపడితే నీలాంటి అమాయకులు అలాంటి బ్యాంకుల్లో డిపాజిట్ చేసి మోసపోతున్నారు. నాకు చెప్పకుండా ఇలాంటి పనులెప్పుడూ చెయ్యకు".
"ఇంకెందుకు చేస్తానే... నీకు చెప్పే చేస్తాను. అయినా నువ్వు లైనేసిన చైర్మన్ కోటీశ్వరుడేగా, అదే నాకు కొంత నిశ్చింత." అంది కాస్తలో కాస్త మెరుగన్నట్టు.
"ఆయన పేరెత్తితే చంపేస్తాను...."అంది ఆ విసుగులో కాదంబరి.
ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది బామ్మ. కాదంబరి కోపం చూసి.
* * *
కాదంబరి హడావిడిగా ఆఫీసుకు తయారవుతోంది. చీర కట్టుకుని, కొంగుకి సేఫ్టీపిన్ కోసం డ్రెస్సింగ్ టేబుల్ పైన వెతుకుతోంది.
బామ్మ తెచ్చి అందించింది.
"బా....మ్మా..." అంది ఆశ్చర్యంగా.
"అవును బామ్మనే... ఇక నుండి కొంగుకి పిన్ను గట్టిగా పెట్టుకో కొంగు జార్చే అవసరం ఇకలేదు..."
"బామ్మా! అంటే....?"
"పొద్దున్నే కూరగాయల మార్కెట్ లో మీ ఆఫీసులో పనిచేసే సునంద కలిసింది. పప్పన్నం ఎప్పుడు పెడతారు బామ్మ" అని అడిగింది.
"మీ బాస్ తో మా కాదంబరి పెళ్ళి మ్యాచ్" అని చెప్పాను.
"నాతో జోక్ చేస్తున్నారా బామ్మా... మా బాస్ విరజ మేడమ్ ను కదా చేసుకునేది" అంది.
"నేనింక ఏం మాట్లాడలేక పోయాను. ఎందుకే నన్నంత మోసం చేశావ్....నిన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడని ఎందుకే అలా అబద్దాలు చెప్పావు? విరజ అంటే ఆ కంపెనీ యజమానట కదూ! నా మనవరాల్ని కాకుండా ఆ అమ్మాయిని చేసుకొని ఏం సుఖపడతాడో... అదీ చూస్తాను...."
కాదంబరి చప్పున ఆమె నోరు మూసింది.
"దయచేసి అలాంటి శాపనార్ధలు పెట్టకు బామ్మ! వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్... ఇంకెప్పుడూ వాళ్ళనేం అనకు..." కహ్చ్చితంగా చెప్పింది కాదంబరి.
"నీతో మీ బాస్ సినిమాలకు వచ్చాడని చెప్పింది. రెస్టారెంట్లకు వచ్చాడనిచెప్పింది. అంతా... అంతా అబద్దం కదూ..."
"బామ్మా!" కాదంబరి బామ్మ ఒడిలో తల పెట్టుకుంది బాధగా.
"నీ బాధ పడలేక అలా అబద్దాలు సృష్టించాను. నన్ను క్షమించు బామ్మ! మనసులో అనుకోసాగింది కాదంబరి. ఆమె మనసు తెలుసుకున్న బామ్మ...
"పిచ్చి పిల్లా.... తప్పునాదేనే.... నా మనవరాలు పెద్దింటి కోడలు కావాలని ఆశపడి నిన్ను బాధ పెట్టాను. నానా కష్టాలు పెట్టాను. పాపిష్టిదాన్ని. నన్ను క్షమించు. అయినా నీకేమిటి తక్కువే తల్లీ.... ఏ రాకుమారుడో వస్తాడు...." అంది మనవరాలి తల నిమురుతూ...
"వస్తే వస్తాడు. లేకుంటే లేడు గానీ... నువ్వు మాత్రం నన్ను చంపకు 'ప్రేమో' అని. ప్రేమ అనేది సహజంగా కలగాలి గానీ... లొంగదీసుకోవడాలు.... వశపరచుకోవడాలూ... ప్రేమ కాదే...."
"అవునే తల్లీ... నాకు బుద్దొచ్చింది. నీకు అన్నివిధాల అన్యాయం జరిగిందే నా వల్ల. అటు దాచుకున్న డబ్బులూ పోయాయి. బంగారంలాంటి అబ్బాయి చేజారే...."
"అత్యాశకు పోతే అంతే జరుగుతుంది". అంది అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోతూ కాదంబరి.
* * *
ఫోన్ రింగవుతోంది. బిజీ వర్క్ లో ఉన్న కాదంబరి లిఫ్ట్ చేసింది.
"హల్లో! విరజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్..." అంది.
"కాదంబరీ! నేను విరజని" అవతలి నుండి విరజ కంఠం వినడంతోనే అలర్ట్ అయింది.
"చెప్పండి మేడమ్" అంది మృదువుగా.
"రేపు సెప్టెంబర్ లెవెన్త్. అభినయ్ వస్తున్నాడు. వెళ్ళేప్పుడు చెప్పింది గుర్తుందిగా! సరిగ్గా ఈవినింగ్ సిక్స్ వరకూ బిర్లా మందిర్ కి వచ్చేయి. పూలదండలతో... అక్కడే మా మేరేజ్ అన్నీ గుర్తున్నాయిగా...!"
"యస్... మేడమ్... గుర్తుంది...."
"వెరీ గుడ్..."
"మేడమ్! మీరేమీ అనుకోనంటే... ఓ చిన్న మాట..." అంది కాదంబరి.
"ఏవిటో చెప్పు?"
"మీరేమీ ఫీలవకూడదు మరి..."
"అనన్లే చెప్పు..."
"అలా ఎవరూ లేకుండా ఎందుకు మేడమ్ సింపుల్ గా మ్యారేజ్! గ్రాండ్ గా చేద్దాం... అంతా!"
"ఓ! అదా! ఆ తర్వాత అందరికీ గ్రాండ్ గా రిసెప్షన్ ఎలాగూ ఉంటుందిగా! సెప్టెంబర్ లెవెన్త్ అంటే మేం కలుసుకున్న రోజు... అందుకే ఆ ముహూర్తానికి సింపుల్ గా మ్యారేజ్ చేసుకుని, తర్వాత గ్రాండ్ గా పార్టీ ఇద్దామని అనుకున్నాం... అందుకనే...."
"సరే మేడమ్! మీ ఇష్టం. నేను మీరు చెప్పిన సమయానికి బిర్లా మందిర్ కి వచ్చేస్తాను".
"నేను అభినయ్ ని ఎయిర్ పోర్ట్ లో పికప్ చేసుకుని వచ్చేస్తాను... ఓ...కే..."
"ఓ...కే... మేడమ్"
"రైట్... బై..." అంది విరజ.
నిజానికి విరజకి కూడా అలా సింపుల్ గా దండలు మార్చుకోవాలని లేదు. కానీ అభినయ్ సరిగ్గా అదేరోజుకి రావడం వలన దేనికీ టైం లేకుండా పోయింది.
అభినయ్ కి చెప్పి రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేయించాలి అనుకుంది విరజ.
* * *
సెప్టెంబర్ 11.
ఎర్లీ మార్నింగ్ అభినయ్ నుంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంది విరజ.
"హాయ్...విరూ...మ్యారేజ్ కి ప్రిపేరవుతున్నావా? నేను వచ్చేసరికి అక్కడి టైం ప్రకారం సాయంత్రం సిక్స్ థర్టీ అవుతుంది. నువ్వు సిక్స్ థర్టీ వరకూ ఎయిర్ పోర్టుకు వచ్చేయ్. అక్కడ్నుంచి అటే డైరెక్ట్ గా బిర్లా మందిర్ కు వెళ్దాం. మన మధ్య సాక్షి ఆ శ్రీ వెంకటేశ్వరుడే. కాదంబరిని రమ్మని చెప్పావా? మనకున్న ఆత్మీయ అతిథి తనేగా... అన్నట్టు నాకేం తెస్తావ్... అదేనా పెళ్ళికి నువ్విచ్చే కానుక..." అటువైపు నుంచి అభినయ్ గొంతులో హుషారు.
"అభీ! యిన్ని రోజులూ నన్నొదిలి ఎలా వున్నావు? రాగానే నిన్ను పీక పిసికి చంపేస్తా" ఏడుస్తూ వుంది విరజ.
"ఏయ్ విరూ..! ఏమైంది?"
"ఏమైందంటావేంట్రా ఫూల్... వారం రోజులు నన్ను వదిలి ఎలా వెళ్ళావ్రా... నేనేమై పోవాలనుకున్నావు?"
"నువ్వే కదా వెళ్ళమంది" అయోమయంగా అడిగాడు అటువైపు నుంచి అభినయ్.
"వెళ్ళమంటే వెళ్ళడమేనా? జార్జిబుష్ పెళ్ళాం మొగుడ్ని వెళ్ళమంటే పెళ్ళాన్ని వదిలి జార్జిబుష్ యిండియా వచ్చేస్తాడా?"
"అదేంటి విరూ... ప్లేటు ఫిరాయించేశావ్... నేనిప్పుడు రానా! వద్దా...ఎందుకైనా మంచిది.... రెండ్రోజులాగి నీ కోపం చల్లారేకా వస్తాను" అభినయ్ భయం నటించాడు.
"చంపుతా... వెంటనే వచ్చేయ్..." అంది విరజ.
"హమ్మయ్యా.... ఎయిర్ పోర్ట్ లోనే నన్ను కొట్టి రక్కి సీన్ క్రియేట్ చేయనంటేనే వస్తాను".
"సరే... రారా!" అంది కసిగా.