రాత్రి పదకొండు అవుతూంటే "డాక్టరుగారున్నారా? అంటూ ఒకతడు అరవింద్ వాళ్ళ తలుపు తట్టాడు.
"ఉన్నారు! పడుకొన్నారు" నౌఖరు చెబుతూండగా, అరవింద్ వెనుక నుండి అడిగాడు "ఎవరు?"
"నా వైఫ్ కి చాలా బాగాలేదు డాక్టర్! మీరొకసారి వచ్చి చూడాలి" చక్కని ఇంగ్లీష్ లో అన్నాడతను.
"ఎక్కడికి వచ్చి చూడాలి?"
"మా ఇంటికి."
"పేషెంట్ ని హాస్పిటల్ కి తీసుకురండి. వచ్చి చూస్తాను"
"ఆమెకు హాస్పిటల్ వాతావరణం పడదు డాక్టర్! ఇప్పుడు తీసుకువచ్చే కండిషన్ లో కూడా లేదు! మూర్చో ఏమిటో...బిగుసుకుపోయి పడుకొంది."
"ఇదే మొదటిసారా?"
"ఎక్కడ మొదటిసారి? పెళ్ళయినప్పటినుంచి వేగుతున్నాను. ఆమెకేమోగాని నాకు పిచ్చెత్తిపోయేలా వుంది. రండి డాక్టర్! ఒకసారి వచ్చి చూడండి. కారు తెచ్చాను. మళ్ళీ కారులో డ్రాప్ చేస్తాను."
రెండు నిమిషాల్లో డ్రెస్ చేసుకొని అతడితో బయల్దేరాడు అరవింద్.
ఇంటికి చేరేలోగా అతడి వివరాలు తెలిశాయి.
అతడి పేరు జగన్మోహన్. అతడి తల్లిదండ్రులు ఆ పేరెందుకు పెట్టారోగాని పేరుకుపూర్తిగా విరుద్దమైన రూపం. రామాయణంలో లంక జాతికి చెందినట్టుగా ముఖం. బొత్తిగా నల్ల పెరుమాళ్ళు. బుర్రమీసాలు, చేతికి కర్ర పట్టించి, పంచె పైకి కట్టించి కాటిలో నిలబెడితే సరిగ్గా సరిపోతాడు. అసిస్టెంట్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. వారంరోజుల క్రితమే ఈ ఊరికి ట్రాన్స్ ఫరై వచ్చాడు. అతడికి అహల్యతో పెళ్ళయి పదేళ్ళయింది. పెళ్ళయినప్పటినుంచి ఏదో ఒక సుస్తీ. పిల్లల్లేరు.
"గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ అరవింద్ కి చూపండి. ఏమున్నదీ చిటికలో కనిపెట్టేస్తాడు. మంచి హస్తవాసి వున్నవాడు. అతడు చెయ్యి ముట్టి వదిలితేనే సగం జబ్బు వదిలిపోతుంది" అని పక్కింటామె సలహా ఇవ్వడంవల్ల అరవింద్ ని తీసుకుపోవడానికి వచ్చాడట.
ఇంజనీరు హోదాకు తగ్గట్టుగా అద్దెకు తీసుకున్న పెద్ద యిల్లు. కిటికీలకు, గుమ్మాలకు ఖరీధైన కర్టెన్లు చక్కగా అమర్చిన ఫర్నీచర్. గోడలకు ప్రకృతి దృశ్యాలు. అద్దాల వెనుక బొమ్మలు- ఇంటి యజమాని చక్కని అభిరుచిని తెలియ జేస్తున్నాయి.
మంచం మీద ముసుగుతనని పడుకుని వుంది అహల్య. ఆమె చుట్టూ నిలబడ్డ ఆడంగులు డాక్టర్ని చూడగానే దూరంగా జరిగారు. అందులో రుక్మిణి అన్న ఆమె అరవింద్ కు చీరపరిచితురాలు. తరచూ హాస్పిటల్ కి వస్తూ వుంటుంది. పిల్లలకి సుస్తీ అనో, తనకి సుస్తీ అనో....
"అహల్యా! డాక్టరుగారు వచ్చారు" అంటూ ఒకావిడ అహల్య ముఖంమీది నుండి దుప్పటి లాగింది.
అరవింద్ సమీపించాడు. స్టెత్ ఆమె గుండెలమీద పెట్టబోతూ ముఖంలోకి చూసి షాక్ కొట్టినట్టుగా అయిపోయాడు. ఎవరో రుషి ఆగ్రహించి శపిస్తే ఏ దేవకన్యో ప్రతిమగా మారి పడ్డట్టుగా వుందామె. అతిలోక సౌందర్యం. కళ్ళు మూసుకుని నిశ్చలంగా పడుకుని వుంది.
"సాయంత్రం నుండి ఉలుకూ పలుకూ లేకుండా పడివుంది, డాక్టరు గారూ! అప్పుడప్పుడూ ఇలా పడుకునేది. మళ్ళి తనే లేచేది. తిరిగేది. ఇవాళేమిటో ఎంతసేపయినా లేవడంలేదు. పిలిస్తే పలకడంలేదు. తట్టితే కదలడంలేదు. బిగుసుకు పోయినట్టుగా పడుకుంది." ముఖం మీదినుండి ముసుగు తీసినావిడ చెప్పింది.
"ఇలా పడుకోవడంకాక ఇంకేమైనా సుస్తీ వుంటుందా?"
"ఏదో మామూలు సుస్తీనే. కాళ్ళు, చేతులు లాగుతాయంటుంది. నరాలు పట్టుకుపోతాయంటుంది. అప్పుడప్పుడు గుండెలో నొప్పి అంటుంది. ఏవో మాత్రలు వేసుకుంటుంది తనే."
రుక్మిణి అన్న ఆవిడ చెప్పసాగింది. "వారం రోజులనుండి చూస్తున్నాను కదా. అప్పుడే సంతోషం. అప్పుడే విచారం. నవ్వుతూ మాట్లాడుతున్నదల్లా 'ఒంట్లో ఏమిటో అవుతూందండీ' అంటూ మంచమెక్కేస్తుంది. దేనికో చాలా బాధ పడిపోతున్నట్టుగా, ముఖం క్షణాల్లో పీక్కుపోతుంది. ఈ లక్షణాలన్నీ చూస్తుంటే 'హిస్టీరియా' అనిపిస్తూందండీ! మా పెద్దక్కయ్యకి ఇలాగే వుండేది. ఆవిడా ఇలాగే బాధపడేది."
"మానసిక వ్యధ వున్నవాళ్ళకి హిస్టీరియా వస్తుందంటారు. పిల్లల్లేరన్న ఒక్క దిగులుతప్ప నా కోడలికి బాధపడాల్సింది ఏముందమ్మా? వాడికి అహల్య ప్రాణంకంటే ఎక్కువ. పిల్లలకోసం మళ్ళీ పెళ్ళి చేసుకొమ్మని అన్నా చేసుకోలేదు. పిల్లల్లేకపోతేనేం ఎవరినైనా పెంచుకుందాం లెమ్మంటాడు. నాకు అహల్య కోడలేగాని కూతురుగానే చూసుకుంటాను. ఆ పిల్లకి ఇక బాధలేమున్నాయని?"
రుక్మిణమ్మ అరవింద్ కేసి ముఖంతిప్పి మూతి తిప్పింది. అదిచూసిన అరవింద్ కి ఆవిడ భావం- కాకిముక్కుకి దొండపండులా కట్టావుకదా ఆ కుందనపు బొమ్మకి. ఆ దరిద్రపు ముఖం చూడలేక.....అసలు దిగులంతా అదే వుంటుంది అన్నట్టుగా అర్ధమైంది.