Previous Page Next Page 
పాదాభివందనం పేజి 27

గత పదిరోజులుగా తను పిలిచినా తన గదికి తనెందుకు రాకుండా ముభావంగా వుంటున్నాడో అర్ధమైంది శైవాలినికి. ముంగొంగు పసిడి చేజారి పోయినట్లుగా అనిపించిందామెకి.

                                                    రెవిన్యు స్టాంపు

కంచంలో అన్నం వడ్డించింది రామక్క. ఇంత ఉల్లిగడ్డ కారం వేసింది. చిట్టిలోంచి చారెడు నెయ్యి అన్నం మీద గుమ్మరించింది. కలుపుకో అంది కొడుక్కి విసనకర్రతో విసుర్తూ.

కొడుకు పక్కనే కూర్చున్నాడు సీతయ్య. జానెడు పీట మీద ఇరుకిరుగా కూర్చున్నా అది ఇరుకనిపించడం లేదు. కానీ కట్టుకున్న పెండ్లాం కట్టుకున్నోడి కంటే కన్నోడికి కొసరి కొసరి వడ్డిస్తోంటే మాత్రం మనసులో ఇరికిరుగ్గా ఉంది.

అంతకుముందు అదే చోట తనా కంచంలో అదే గొడ్డుకారం కలుపుకుని తను తిన్నాడు. అది తిన్న తర్వాత ఉల్లిగడ్డలు మాత్రమే ఉడకేసిన పులుసు వడ్డిస్తే అది తిన్నాడు. ఆపై ఇన్ని మజ్జిగ నీళ్ళు గుమ్మరిస్తే కంచం నిండా పోసుకుని అన్నం పిసుక్కున్నాడు. తనతో పాటు రామక్కా అవే తిన్నది.

కానీ నేయి గుమ్మరించటం అటుంచి , నే చుక్క విదిలించను కూడా లేదు. ఇప్పుడేమో కొడుక్కు అప్పుడు లేని నెయ్యి ఇప్పుడెలా వచ్చింది.

సీతయ్య చూస్తున్నాడు. కానీ ఏమి అనలేదు. నెయ్యేసుకుని తిన్నికి తనేం మారాజా? తన కొడుకేం జమిందారా? ఉన్న గొడ్డు శేరు పాలిస్తే పాలమ్మి , పెరుగమ్మి, నేయ్యమ్మి ముల్లెకడ్తేనే గదా విడ్ని ఎమ్మే సదివించడం అయింది. కడుపు గట్టుకుంటేనే గదా ముల్లెముడేసేది......

అయినా ఇంటిది తనతో ఏమంది? "ఇదో! కొడుకు పుట్నాడు. ఈడ్ని మా యన్న కొడుకులాగా సదిగించు. నీలాగా మట్టి పిసుక్కునే బతుకు ఈడికొద్దు. నా కొడుకు దర్జా ఎలగబెట్టాల. సదుకుని ఉజ్జోగం చెయ్యాల"

అదంత ఇప్పుడేమయింది?

'సదువైపోయిందనుకో, ఉజ్జోగంకూడా వస్తుందే అనుకో.....అప్పుడు ఎలగ బెట్టమను తన దరిజా దిలాసా! అల్లేదు సుల్లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది దీని యిరగబాటు' అనుకున్నాడు.

"గొడ్డుకారం కలుపు కున్నాడు చంద్రం.....ఉహూ ఒక్క ముద్దా నోట్లోకి పోవడం లేదు చంద్రానికి......ఉహూ చంద్రశేఖరానికి. అతనిప్పుడు రెడ్డోళ్ళ చంద్రశేఖరం ఏం.ఏ.బి.ఎడ్......

మొన్న మొన్నటి దాకా ఇదే పల్లెలో ఇదే మిద్దె ఇంట్లోనే ఉంటూనే పక్కనున్న తాలుకా కేంద్రంలో హైస్కూల్ చదువూ.

అక్కడే జూనియర్ కాలేజిలో ఇంటర్. ఆ పై డిగ్రీ కాలేజిలో బియస్సీ పూర్తీ చేశాడు. హైస్కులు చదువు నడకతో పూర్తీ చేశాడు. ఇంటర్, డిగ్రీ సైకిల్ పై తిరుగుతూ పూర్తి చేసాడు. ఆ తర్వాత పట్టుబట్టి యూనివర్సిటీలో ఎం.ఎ పూర్తి చేశాడు.

అక్కడే టిచర్ ట్రైనింగ్ పూర్తి చేశాడు. ఈ మూడేళ్ళలో చంద్ర శేఖరంలో బాగా మార్పు వచ్చింది.

డ్రెస్ లో మార్పు తలకట్టులో మార్పు వచ్చింది. మాట తీరే మారిపోయింది. అక్కడ హోటళ్ళలో, మెస్సుల్లో రకరకాల తిండి తిని సెలవులకు వచ్చి ఒకటి రెండు వారాలు ఉండుర్లో గడపడం అతనికి పాండవుల అరణ్యవాసం, శ్రీరాముడి అరణ్యవాసం కంటే కష్టం అనిపించింది.

కొడుకు తీరులో మార్పుని సీతయ్య గమనించినా రామక్క గుర్తించలేకపోయింది.

'వాడి వూళ్ళో ఉంటె సదువు కొచ్చిన నాలుగచ్చరాలు మర్చిపోతాడు. ఉండేది ఒక్కడు. బాగా సదవని ఆడ్ని ఆడనే ఉండని' అని మొగుడ్ని దబాయించి సెలవుల్లో కూడ అక్కడికే పంపేది.

డిగ్రీ పూర్తయ్యాక కూడా ఒకింత ఘర్షణే అయ్యింది. 'ఇగ జాలు--టిశర్ ట్రైనింగ్ జెయ్యి. ఉండుర్లో ఉజ్జోగం యేయిస్తా' అన్నాడు సీతయ్య.

సర్రున కత్తి దూసినట్టు అడోచ్చింది రామక్క 'నాకొడుకు కలకటేరో, ఇంజనీరో, డాకటేరో అయితాడనినే నాశపడ్తంటే నువేంది యిక సాలుసాలంటావు' అంది.

'డాక్టర్ కావాలంటే మెడిసిన్ చదవాలి' అన్నాడు చంద్రం.....

'అదేన్నేళ్ళు?' అడిగాడు సీతయ్య.

'నాలుగేళ్ళపై మాటే. ఆపైన యాడాది హౌస్ సర్జేన్సి.'

మనస్సులో ఏదేదో లేక్కలేసుకుని 'ఇంజనీరు గావాలంటేనో?' అడిగింది రామక్క.

"అదిప్పుడు కష్టమమ్మా!" లెక్కలు చదవలేదు.

"మరికలకటేరు గావాలంటే?'

'ఐ ఎ ఎస్ పాసవాల. ముందు ఎమ్మే చదవాల'

'అయితే అదేదో సదువు. దానికేన్నేండ్లు పడ్తుంది.'

'ఎమ్మేకు రెండేండ్లు. తర్వాత మనమే చదువుకుంటూ ఐఎఎస్ పాసవాలి. దానికి డిల్లిలో ట్రైనింగ్ ఇస్తారు.'

'అట్లయితే ముందది రెండేండ్లు సదివిరా!' రేపొద్దున్నఎల్లి కనుక్కురా!

'అదట్లాకాదమ్మా. అది యూనివర్సిటీలోనే చదవాల......' నోరు వెళ్ళబెట్తిందామె.

"ఎందది ఈగలు ముసుర్తాయ్" ఎగతాళిగా అన్నాడు సీతయ్య.

మూతి మూడు వంకర్లు తిప్పిందామె. "శానా కర్సయితాదా?'

'కర్సుమాట నీకెందుకే ఇంటిదానా? నువు నీ కొడుకు నిడిసి ఉంటావా? అజ్జేప్పు'. రామక్క కళ్ళు చెమర్చాయి.

'ఎట్టయితది? ఆడు బాగా సదుకుని కలకటేరై బంగలాలో ఉంటె పెండ్లాంతో దర్జాగా కార్లో సికారొస్తే సుడాలంటే ఇప్పుడిడిసి ఉండకపొతే ఎట్టా?'

'సరే!' అన్నాడు సీతయ్య.

ఎమ్మే కూడా అయిపొయింది.
ఈలోగా ఆ ఉళ్ళోనే హైస్కులు పెట్టాడు. దాంతో సీతయ్య మనస్సు మారిపోయింది.

టీచర్లను కలుసుకుని ఆ ఉజ్జోగం రావాలంటే ఏమేం చదవాలో తెలుసుకున్నాడు. అదే చదవమన్నాడు. 'ఇంటి పట్టున ఉండొచ్చు. కడుపులో చల్ల కదలకుండా నెలకు రెండేసి యేలు సంపాయించొచ్చు.

యడాదికి పండెండు రెండ్లు దాదాపు పాతికవేలు. నాలుగెండ్లలో లచ్చ దాటిపోతాది. తను లచ్చాదికారి......' చూస్తూ చూస్తూ ఆ భాగ్యం పోగొట్టుకోలేకపోయాడు. అందుకే శతపోరి ట్రైనింగ్ కు పంపించాడు. "ఇది సదుకుంటూనే ఆ పరిచ్చలు రాయోచ్చంట గదా" అని కొడుకుని ఒప్పించాడు.

కొడుకు డిల్లికి పంపడానికి ఓ మంచి ఐడియా వేసి అడ్డేవాడు. 'అక్కడ ఎప్పుడూ గలటాలు జరుగుతంటాయాంట! బాంబులేసి, పిస్తోలు కాల్చి మడుసుల్ని ఊరికినే సంపెస్తా ఉంటారంట!' అని చెప్పాడు.

రామక్క గుండె చెరువై పోయింది.

 Previous Page Next Page