Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 26


    "బామ్మా!" కాదంబరి కళ్ళల్లో నీళ్ళు.
    "ఛ... ఏడుస్తావేంటి? తినకపోతే పోన్లే. కనీసం అబ్బాయికైనా పట్టుకెళ్ళు....అతను సంతోషించడమేగా మనక్కావల్సింది..." చెప్పుకు పోతోంది బామ్మ.
    "అసలు నువ్వెలా ముట్టుకున్నావే!"
    "పిచ్చి కాదంబరీ! నా మనవరాలి పెళ్ళి కోసం నేనేమైనా చేస్తాను. చెయ్యగలను...సరేనా..." అంది నవ్వుతూ.
    కాదంబరికి ఆ క్షణం అభినయ్, విరజ గుర్తొచ్చారు. అభినయ్ లాంటి వ్యక్తి మరొకరుంటే బావుణ్ణు అనుకుంది మొదటిసారిగా కాదంబరి.
    
                                 * * *
    
    బాల్కనీలో కూచుంది విరజ.
    ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకు మంటున్నాయి. ఇప్పుడు అభినయ్ ఎక్కడ వుండి వుంటాడు. ఎక్కడున్నా తన గురించి ఆలోచిస్తూ మాత్రం ఉంటాడు. అది తనకు తెలుసు. మై స్వీట్ హార్ట్.... మై లవ్... ఆమె కళ్ళముందు అభినయ్ కనిపిస్తున్నాడు.
    అభినయ్ తన పక్కనే కూచొని వున్నట్టు అనిపించింది. ఎన్ని సాయంత్రాలు, తనూ, అభీ కూచున్నారిక్కడ.... ఎన్ని రాత్రులు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. చందమామను చూస్తూ, పున్నమివేళ వేడివేడిగా అన్నం తింటూ... ఒకరికొకరు తినిపించుకుంటూ.... అల్లరి చేస్తూ.... ఏడిపించుకుంటూ... ఎన్ని జ్ఞాపకాలు... ఎన్ని తీపిగుర్తులు....
    ఎవరికైనా సరే, ఆ మనిషి ఉన్నప్పుడు కంటే, లేనప్పుడే ఆ మనిషి విలువేమిటో, అతనితో మనకున్న అటాచ్ మెంట్ ఎంతో తెలుస్తుంది.
    ఆమెకు అభినయ్ స్టేట్స్ కు వెళ్ళినప్పటి నుండి ఆకలి వేయడం లేదు. దప్పిక లేదు.
    కంటిమీదికి కునుకు రావడం లేదు. "కంటిమీద కునుకా.... నీకెందుకే నాపై కినుక? అభీ... నీ వెలితి ఎంత భయంకరంగా వుంది.... అనుకుంది.
    ఆ రాత్రంతా అలానే కూర్చుని ఉండిపోయింది బాల్కనీలో మగతగా ఆమె కళ్ళు మూతలు పడుతుండగా ఫోన్ రింగ్ యింది. పరుగున గదిలోకి వెళ్ళింది.
    "విరూ! నేను... ఎలా ఉన్నావ్? సరిగ్గా భోజనం చేస్తున్నావా? లేదా? రాత్రంతా నిద్రపోలేదు కదూ...." అభినయ్ చూస్తున్నట్టే అడిగాడు. అతని గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తోంది.
    "అభీ!.... మై లవ్.... ఎలా వున్నావు? నేను ఓ....కె.... ఏంటీ.... ఏమైనా తిన్నావా? జాగ్రత్త చలి ఎక్కువైతే స్వెట్టర్ వేసుకో నన్నొదిలి ఎలా వున్నావ్ అభీ! నాకు ఏడుపొస్తోంది...." ఏడ్చేసింది విరజ.
    "విరూ! నేను.... నేను.... వచ్చేయనా?" అడిగాడు ఆదుర్దాగా అభినయ్.
    "వద్దొద్దు..... ఇంకెంత అని.... అయామ్ ఓ.కె...ఏదో సరదాగా అనేసాను...." అంది విరజ.
    "విరూ.... నువ్వు బాధ పడుతున్నావు"
    "లేదు అభీ! అయినా ఇది తీపి బాధ.... విరహం. తరువాత కలిసే కలయిక అద్భుతంగా వుంటుంది. నీ కోసం ఎదుర్చూడ్డం నాకు బావుంటుంది. నువ్వు వచ్చేలోగా నీ కోసం ఓ సర్ ప్రైజ్.... రెడీగా వుంచుతాను".
    "థాంక్యూ.... విరూ.... వుండనా... బై...."
    "బై అభీ!...."
    ఫోన్ పెట్టేసాక విరజ ఏడ్చేసింది. అభినయ్ దూరాన్ని తట్టుకోలేక పోతోంది.
    "అభీ... నీ కోసం ఎదురు చూస్తూ వుంటాను" అనుకుంది విరజ.
    
                                 * * *
    
    మనకు యిష్టమైన మనిషి మనమధ్య లేకపోవడం ఎంత బాధాకరమో..... ఆక్షణం అనుభవ వేధ్యంగా అర్దమైంది విరజకు.
    అభినయ్ మీద తనకు ప్రేమ వుందని తెలుసు. ఆ ప్రేమ ఉధృతి యింత తీవ్రంగా వుందని మొదటిసారి అర్దమైంది. ఎప్పుడూ అతని జ్ఞాపకమే.... ఆ జ్ఞాపకమే ఆమె వ్యాపకం పొద్దున్నే తన నుదురుమీద ముద్దు పెట్టుకుని 'గుడ్ మార్నింగ్' చెప్పడం తను కళ్ళు తెరవకపోతే అల్లరిగా తన పొట్ట దగ్గరికి వచ్చి పొట్టమీద ముద్దు పెట్టుకోవడం.
    అభినయ్ పరిచయమైన తర్వాత అభినయ్ లేకుండా తనెప్పుడూ భోంచేయలేదు.
    ప్రేమంటే ఓ మనిషి ఉనికినే కాదు, జ్ఞాపకాన్ని కూడా దూరంగా ఉంచలేనంతగా వుంటుందా?
    అభినయ్ ప్రతీ ఆరు గంటలకూ ఫోన్ చేస్తున్నాడు. విరజ ఇంట్లోనే వుంటోంది. ఎక్కడికీ కదలడం లేదు. ఒక్క క్షణం తను బయటకు వెళ్తే ఎక్కడ అభినయ్ ఫోన్ కాల్ మిస్సవుతుందో అన్నంత భయం.
    ఆఫీసు వ్యవహారాలు కూడా ఇంట్లో నుంచే పర్యవేక్షిస్తోంది. అభినయ్ తోడు లేకుండా ఆ ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టాలని అనిపించడం లేదు. ఎక్కడ ఇంట్లో నుంచి అడుగు బయటకు పెడితే అభినయ్ జ్ఞాపకాలు దూరం అవుతాయోనన్నంత భయం... అది కూడా ఏ మాత్రం భరించలేక పోతోంది.
    విరజకు ఏమీ తోచడం లేదు. అభినయ్ గది అంతా నీట్ గా సర్దింది. పదే పదే సర్దినవే సర్దుతోంది. అతని బట్టలు సరిగ్గా పెడుతుండగా, ఓ కవర్ కనిపించింది. ఆ కవర్ క్లోజ్ చేసి వుంది. ఇదెప్పటిది? తనెప్పుడూ చూళ్ళేదు?
    కవర్ మీద 'నా ప్రియమైన ప్రాణబెన్స్ కు' అని వుంది. యాంగ్జయిటీ....అంతకుమించి ఓ ఉద్వేగం ఆమెను ఆక్రమించుకుంది.
    మెల్లగా కవరు ఓపెన్ చేసింది. లోపల రెడ్ కలర్ స్కెచ్ తో, తెల్లటి కాగితంమీద అక్షరాలు.
    "విరజ నా ప్రాణం మాంత్రికుని ప్రాణాలు ఎక్కడో సప్తసముద్రాల అవతల, మర్రిచెట్టు తొర్రలో చిలుకలో వుంటాయంటారు ఆ విధంగా నా ప్రాణాలు ఎక్కడ పెట్టాడో తెలుసు. నా విరజ గుండెలో.... ఆ గుండె కొట్టుకున్నంత కాలమూ నేను ఎక్కడున్నా శ్వాసిస్తూ బ్రతుకుతూనే వుంటాను.
    అంతకు మించి ఇంకేమీ లేదు.
    చాలా చిన్న వాక్యం.... చాలా పెద్ద అర్ధం. విశ్వాన్ని పిడికిట్లో బంధించినట్టు, తన ప్రేమ సర్వస్వాన్ని తన గుండెలో భద్రపరిచాడా?
    విరజ ఆ ఉత్తరాన్ని తన గుండెలకు హత్తుకుంది.
    
                                  * * *
    
    విరహం అద్భుతమైన అనుభూతిని యిస్తుందని చెప్పిందెవరు?
    అదే నిజమైతే? తనకూ, అభినయ్ కు మధ్య ఉన్న ఈ విరహం.... ఇలా.... తన గుండెను మలిపెడుతుందా? అతని ఆలోచనని..... అతని జ్ఞాపకం.... అతని ఊసు.... అన్నీ తనని వెంటపడి తరుముతున్నాయి.
    అతని జ్ఞాపకమే తనకు వ్యాపకమైంది.
    అతని ఆలోచనే తనకు నేస్తమైంది.
    రోజులెలా గడిచాయో కూడా గుర్తు లేదు.
    క్షణాలు... నిమిషాలు.... గంటలు... లెక్క బెడుతూ కాలాన్నే విస్మరించింది.
    కాదంబరి వచ్చి మధ్యలో పలకరించి వెళ్ళింది. ప్రతిరోజూ ఆఫీస్ నుంచి ఫోన్ లో మాట్లాడుతూనే ఉంది.
    విరజకు మాత్రం ఎవరితో మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా అభినయ్ జ్ఞాపకాలే... అతనితో ఫోన్ లో ఎంతసేపు మాట్లాడినా, అతను తన ఎదురుగా ఉన్న ఫీలింగ్ కలగడం లేదు.
    అభినయ్ లేచి రోజులన్నీ భారంగానే గడుస్తున్నాయి విరజకు.
    
                                  * * *
    
    కాదంబరి ఆఫీస్ నుంచి వచ్చేసరికి బామ్మ లబోదిబో మబ్ని ఏడుస్తోంది.
    "ఏమైందే? ఆ ఏడుపేంటి?" గాబరాగా అడిగింది కాదంబరి.
    "ఇంకేంటే కాదంబరీ! మోసపోయాను. ఘోరంగా మోసపోయానే...."
    "ఏమైంది? అసలు సంగతి చెప్పు త్వరగా..."
    "నీకు తెలియకుండా..." చెప్పడానికి భయపడసాగిందావిడ.
    "ఆఁ! తెలియకుండా.... ఏం చేసావ్....!"
    "ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు కదాని.... ఆ ఋషీ బ్యాంక్ లో నీకు తెలియకుండా నీ పెళ్ళికని యాభైవేలు దాచాను. ఇందాకే తెల్సింది. ఆ బ్యాంక్ ఎత్తేసారని..... బామ్మ ఏడుస్తూ చెప్పింది.

 Previous Page Next Page