లేచి ఇంటికి ముఖం పట్టదతను.
యాంత్రికంగా ఇల్లు చేరాడు.
"అలా వున్నావేం సుధా? ఇంతవరకూ ఎక్కడికి. కాలేజికి వెళ్లడం ఇప్పుడా వచ్చేది, పరీక్షలు ఇంకెన్ని రోజులో లేవు. ఇలాగయితే ఎలా? బాగా చదివి పాసవ్వాలి"
"చదువుకుంటూ వుంటే కాలం తెలీలేదమ్మా?"
"సరే! సరే! భోజనానికి పద" అని సిద్దం చేసిందామె.
పళ్ళెం ముందు కూర్చున్నా మెతుకులు మింగుడు పడటంలేదు. ఆందోళన మనస్సుని చీల్చివేస్తోంది.
"రేపు ఎవరో అబ్బాయి జయాని చూడటానికి వస్తున్నాడు. కాలేజీకి సెలవుపెట్టి యింట్లో వుండిపో"
"అలాగే అమ్మా"
"అన్నయ్యని కూడా పిలిచారా?"
అతని గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతున్నాయ్. "రేపు జరగబోయే దానికిది నాంది. చూపులవగానే పెళ్ళి ప్రయత్నాలు భగవాన్! దొంగతనం బయట పడుతుంది. తప్పుకోవటం ఎలా? ముప్పు తప్పించటం ఎలా?" ఆలోచనలతో భారమైన మనస్సుతో భోజనం చేయలేక పోయాడతను.
చేయి కడుక్కుని లేచాడు అర్ధాంతరంగా.
"అదేమిట్రా..."
"మనస్సంతా ఎలాగో వుందమ్మా" అని వెళ్ళిపోయాడతను.
"ఏం పిల్లలో? ఏం పరీక్షలో?" అనుకుందామె.
రేపటి విషయాలు ఆ యింట్లో ముఖ్యులిద్దరి మనస్సులో రకరకాల ఆలోచనలు రేపుతున్నాయ్.
* * *
"అన్నపూర్ణమ్మ తల్లీ! అబ్బాయొచ్చాడు" అన్నాడు శాస్త్రిగారు ముఖానపట్టిన చెమట తుడుచుకుంటూ.
బయట వరండాలో భర్త కెదురుగా కుర్చీలో కూర్చున్న అబ్బాయిని చూసి తృప్తిగా తలూపి "రెండు క్షణాలు కూర్చోమనండి, అమ్మాయిని యీ గదిలో కూర్చోబెట్టి పిలుస్తాను" అందామె.
"అవశ్యం" అని నశ్యం పీల్చుకుంటూ వెళ్ళారాయన.
మరో ఐదు నిమిషాల తర్వాత చాపపై కూతుర్ని కూచోబెట్టి "ఇక రండి శాస్త్రిగారూ!" అంది ఆమె.
అబ్బాయివచ్చి కుర్చీలో కూర్చున్నాడు. బయటున్న కుర్చీ తెచ్చి శాస్త్రిగారికి వేసి భర్త కుర్చీ కూడా
తెచ్చిందామె. తడుముకొంటూ వచ్చి కూర్చున్నాడు సుందరరావు.
కేశవమూర్తికి జయప్రద నచ్చింది. అయినా సంప్రదాయకంగా వచ్చాడు. అతనూ వాళ్ళకి నచ్చాడు.
వీళ్ళు గదిలో కూర్చున్న రెండు నిమిషాలకి సుధాకర్ వచ్చాడు.
"ఇతను వీళ్ళ రెండో అబ్బాయి సుధాకర్. బి.ఏ. చదువుతున్నాడు రెండో సంవత్సరం. పెద్దబ్బాయి షుగర్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. పాపయ్యగారి అమ్మాయిని చేసుకుని ఇల్లరికం వెళ్ళాడు" అన్నాడు శాస్త్రిగారు.
పరిచయాలయ్యాక ఒక వారగా నిలబడ్డాడు సుధాకర్.
"ఏమయ్యా! నీ ముఖంగా వాళ్ళు వినాలనుకుంటున్నారు నీకు అమ్మాయి నచ్చినట్టేనా?"
కాఫీ గ్లాసు క్రిందిపెడుతూ "శాస్త్రిగారూ! నేను మొదటే చెప్పానుగా. నాకెప్పుడో నచ్చింది ఇక నచ్చాల్సిందల్లా వాళ్ళకే..."
ఆ మాట విని జయప్రద లేచి వెళ్ళింది.
"శుభం! అన్నపూర్ణమ్మ! సుందర్రావు! ఇక అనుకున్న విషయాలు అయిపోతే..."
"పూర్ణా! వెళ్ళి తాంబూలాలు పట్రా" అన్నాడు సుందర్రావు. అతడికి కూతురికి పెళ్ళి ఇంత సులభంగా సుఖ
"జయా!" అని వణుకుతున్న గొంతుకతో పిలిచింది పూర్
దగ్గరగా వచ్చిన కూతురితో "ఇందులో డబ్బు పెట్టె చూశావా? మరెక్కడైనా పెట్టావా?" అని అడిగిందామె గాబరాతో - భయంతో - కంగారుతో.
"లేదమ్మా! నాకు తెలీదు నీవే ఎక్కడయినా పెట్టావేమో."
"లేదు జయా! లేదు... యింకెక్కడా పెట్టలేదు" అని "సుధా! ఇలారా?" అని కేకేసింది.
భూమికి పాదాలు అతుక్కుపోయాయా అన్నట్టుగా నిలుచుండిపోయడతను ఓ క్షణంసేపు, భూమి చీల్చుకుని తనని తనలో కలుపుకోకూడదా అనుకున్నాడు మరుక్షణంలో.యాంత్రికంగా శవంలా విధిలేని మనిషిలా నడిచాడు. వధ్యశిలకు వెళ్ళే ఉరిశిక్ష నేరస్తుడిలా వెళ్ళాడు.