Previous Page Next Page 
మధుకీల పేజి 25

    "నాకేం అక్కర్లేదు తన కూతురికివ్వడా?"
    "కూతురికో-కూతురి పిల్లలకో ఆయనిష్టం. మొన్న మన పక్కింటి రాఘవయ్యగారితో మనకి అబ్బాయి పుడితే దత్తత తీసుకుంటునన్నారు తెలుసా?"
    "అలాగే కానిలే! మనకేం లోటుగా వుందా?"
    "ఏమిటోయ్ మధూ లోటు అంటున్నావు?" అని ప్రశ్నించాడు అప్పుడే ఫేక్టరీ నుంచి యింటికి తిరిగివచ్చిన పాపయ్య.
    "నీ వన్నమాట చెప్పాను నాన్నా! పోనిద్దూ మామగారికి బోలెడుంది కదా అంటున్నారు."
    "ఇదిగో చూడు మధూ! ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఆశ! ఆ ఆశ కేంద్రం డబ్బు. మంత్రులకూ, సినిమా వాళ్ళకొ యింకా ఇండస్ట్రియలిస్ట్సుకూ డబ్బు లేకనా వాళ్ళు సంపాదిస్తున్నారు. డబ్బెలాంటిదో తెలుసా? దానికో రోజు రోజుకీ అంతో యింతో జత అవుతూ వుంటేనే అది ఓ చోట నిలుస్తుంది. లేదా తిరగటం ప్రారంభిస్తుంది. తనంటే జాగ్రత్త వుండి కాచి రక్షించగలిగిన వాడి పంచన లక్ష్మి పెరిగినట్టు మిగతా స్థలాల్లో పెరగదు---
    సముద్రంలో జలం లేదూ! ఇంకా నదులనుండి నీరు రావాలనే కోరుతుందది. మేఘాలన్నీ తనపైనే కురవాలని ఆశిస్తుంది.
    ఇదీ అంతే!"
    జవాబు చెప్పలేదు మధు.
    "ఇంతకీ పెళ్ళి కావలసిన అమ్మాయి వుందనుకో. ఆ ఖర్చుకి యీ డబ్బు వాడినా యింటిలోనయినా నీకు వాటా యివ్వాలిగా"
    "అవున్నాన్నా ఆయన అడగలేరు... మరి..."
    "ఆలోచిద్దాం మణీ! వచ్చేదాన్ని వద్దంటామా?"
    "మా నాన్నగారు అన్యాయం చేయర్లే మణీ! ఆయన ఎలా నిర్ణయిస్తారో"
    "నిర్ణయమై పోయాక ఏం చేస్తారు?"
    "అయితే యిప్పుడేం చేయాలి?" అసహనంగా అడిగేడు మధు.
    అల్లుడి మనస్సు మారటం గుర్తించిన పాపయ్య ఇక దాన్ని రెట్టించటం బావులేదని "మణీ" అతనికి బాధ్యత తెలుసు హక్కు పోగొట్టుకున్న తర్వాత మళ్లీ రాదని తెలుసు. సమయం రానీ అతనే చేస్తాడు అన్నీ అని సర్దుబాటుగా అన్నాడు.
    మణి రెట్టించలేదు.
    మధు ఫాక్టరీకి వెళ్ళిపోయేడు.
    తర్వాత పాపయ్య "ఆ యిల్లు ఎంత చేస్తుందమ్మా? పైగా అంతో యింతో అప్పులూ వున్నట్టున్నాయ్. చేతికెదిగి వచ్చిన కొడుకు తలిదండ్రుల్ని విచారించకుండా వెళ్ళాడన్న అపవాదు వుండనే వుంది. ఇప్పుడిక మళ్ళీ భాగాలంటూ రాద్దాంతం చేస్తే నలుగురూ మనల్ని అంటారు. కానీ రోజులు గడవనీ... ఎక్కడికి పోతుంది" అన్నాడు.
    "మీకు ఆలోచన చెప్పేటంత దాన్ని గాదు నాన్నగారూ" అని పనిమీద వెళ్ళిపోయింది. ఆమె ఫాక్టరీకి సెలవు పెట్టటం వల్ల చికాకుగా వుంది ఆమెకి.
                            *        *        *
    వళ్ళు మండిపోతుంది సుధాకర్ కి.
    ఎవరా మనిషి?
    ఫోటోలు ఎలా తీయగలిగాడు?
    అదే అర్ధం కాలేదతనికి.
    ఆవేశం రగులుతోంది. అశక్తత అణుస్తుంది ఆవేశాన్ని.
    కోపం పట్టలేక ఆవేశాన్ని అణుచుకోలేక సిగరెట్ పై సిగరెట్ తగలేస్తున్నాడతను. వీలయితే ఆ వెధవల్ని యిలా మసి చేయాలనిపిస్తోంది. కానీ అతనెవరో అతనెక్కడుంటున్నాడో తెలీదు.
    చిచ్చు రగలకూడదు.
    రగిలితే అది జ్వలించటం మానదు.
    దేన్నీ దహించలేని జ్వాల తన ఆశ్రయాన్నే దహిస్తుంది.
    తీరని కోపం పారని శాపం మనిషిని తలక్రిందులు చేస్తాయ్.
    అతని ఆలోచనలు పరి పరి విధాల పోతున్నాయ్.
    "చక్ర బంధంలో మనిషిని యిరికించినట్టుగా చిక్కించుకుని త్వరపెట్టి ఆలోచన శూన్యుడిని చేసి తమ పని నెరవేర్చుకున్నారు.

    అది అంతటితో ఆగుతుందా?
    ఆగకపోతే ఏం చెయ్యాలి?
    ఇంకా ఇవ్వటానికి కేముంది యింట్లో?
    తనేం చేయగలడు? ఏం చేయాలి
    ఇంట్లో డబ్బు పోయినట్టు తెలియగానే ఏం చేయాలి. తప్పు ఎవరిమీద వెయ్యాలి?
    "బ్రతికే దెలా?"
    ఆలోచనతో తల బద్దలవుతోంది సుధాకర్ కి.
    పార్కు గేటు మూయబోతు తోటమాలి కేకేశాడతన్ని.

 Previous Page Next Page