Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 25


    అప్రయత్నంగా అతని చేయి ఆమె నడుం ఒంపులో పడింది.
    ఇద్దరిలో దగ్గరి తనం.... ఎంతసేపలా ఉన్నారో తెలియదు. "సెల్ ఫోన్ రింగవుతుంటే ఉలిక్కిపడి విడిపోయారు.
    
                                                            * * *
    
    "హల్లో! నేను సార్ కాదంబరిని..... సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్ సర్.... విష్ యు హేపీ జర్నీ....."
    "థాంక్యూ...."
    "ఇంకేటి సర్! మాకేం తెస్తున్నారు సర్ అక్కడ్నుంచి..."
    "ఏం కావాలి చెప్పు" అన్నాడు.
    "ఊరికే అన్నాను సర్... ఓ.కె. సర్.... ఉంటాను.... మీరొచ్చే రోజు పెళ్ళి హడావుడిలో వుంటాను.... నేనే కదా మరి మీ పెళ్ళి పెద్దను...."
    "అవునవును.... అన్నట్టు మేడమ్ జాగ్రత్త...." అన్నాడు.
    విరజ నవ్వుతూ అతని సంభాషణ వింటూ.... అతని షర్ట్ బటన్స్ తెంపుతోంది.
    "మేడమ్ ని, ఆఫీస్ కి సేఫ్ గా చూసుకునే బాధ్యత నాది. మీరు వెళ్ళిరండి సర్.... బై...."
    "బై" అంటూ కట్ చేశాడు అభినయ్.....
    "కాదంబరా?" అడిగింది విరజ అభినయ్ ఫోన్ ఆఫ్ చెయ్యగానే.
    "అవును... హేపీ జర్నీ చెప్పింది".
    "అభీ! నువ్వు నిజంగా లక్కీ..." అంది.
    "ఎందుకు?"
    "నాలాంటి భార్య ఇంట్లోనూ, కాదంబరి లాంటి ఎఫిషియంట్ లేడీ అసిస్టెంట్ గానూ ఉంటే నీకు లక్కేగా మరి!"
    "ఎస్... రియల్లీ ఐ యామ్ లక్కీ...." అన్నాడు అభినయ్ ఒప్పుకుంటున్నట్లు.
    "విరూ! ఈ ట్రాఫిక్ లో ఎంత స్పీడ్ గా వెళ్ళినా గంట పడుతుంది. యిప్పుడెలా?" అడిగాడు అభినయ్.
    "డోంట్ వర్రీ అభీ.... ఈ విరజ ఉండగా నిన్ను ఏదీ 'మిస్' చేసుకోనివ్వను.... నీ కేదీ మిస్సవ్వదు" అంది విరజ.
    "మరీ అంత ఫాస్ట్ గా..."
    "చూస్తుండు.... నా డ్రైవింగ్ పై నీకు ఎప్పటికి నమ్మకం కుదురుతుందో ఏమిటో...?" అంటూ మరింత స్పీడ్ పెంచింది.
    "జాగ్రత్త విరజా!" అన్నాడు.
    "ఓ.కె...." అంది నవ్వుతూ.
    మెరుపు వేగంతో వెళ్తున్న కారును ట్రాఫిక్ అవాక్కయి చూస్తోంది.
    తూనీగలా వెళ్తోంది.
    "విరూ... జాగ్రత్త...." భయంతో వణికిపోయేడు అభినయ్.
    విరజ మాత్రం చాలా కేర్ ఫుల్ గా డ్రైవ్ చేస్తోంది. ఒకట్రెండు, మూడ్నాలుగు.... అయిదారు.... నిమిషాలు గడుస్తున్నాయి. ఏ మాత్రం ప్లేస్ దొరికినా సర్రున దూసుకుపోతోంది.
    అభినయ్ కు ముచ్చెమటలు పట్టాయి.
    సరిగ్గా అరగంటకు రెండు నిమిషాలు వుందనగానే ఎయిర్ పోర్ట్ ముందాపింది కారు.
    రిపోర్టింగ్ కౌంటర్ వైపు నడిచాడు కారు దిగి అభినయ్.
    
                                    * * *
    
    ఫ్లయిట్ టేకాఫ్ తీసుకొని గాలిలోకి ఎగిరే వరకూ వుంది విరజ. ఆ తర్వాత ఎయిర్ పోర్ట్ బ్యాక్ సైడ్ కు వెళ్ళి ఆకాశంలో ఆ విమానం కనిపించే వరకూ చూస్తూ చేతులూపుతూనే వుంది. కళ్ళు మసక బారే వరకూ...
    
                                    * * *
    
    కాదంబరి భ్రమలో బ్రతకడం ప్రారంభించింది. బామ్మ బాధ పడలేక ఓ చిన్న అబద్దాన్ని, నిజంగా మార్చింది. అభినయ్ తనని ప్రేమిస్తున్నాడన్న అబద్దం అది. బామ్మ ఎప్పటికప్పుడు విశేషాలు అడుగుతూ వుంది. కాదంబరి తనకు తోచిన, నోటికి వచ్చిన అబద్దం చెబుతూనే ఉంది.
    ఈ అబద్దాలు యిలా ఎంత కాలం???
    సాగినంత కాలం....
    బామ్మ బ్రతికి వున్నంత వరకూ యిలా అబద్దాలు ఆడుతూనే ఉంటుంది. ఏదో ఓ రోజు నిజం తెలుస్తుంది. తెలియనీ.... అప్పుడు.... అప్పుడేమవుతుంది? కాలమే చెప్పాల్సిన జవాబు అది.
    "కాదంబరీ" బామ్మ పిలుపు విని తలెత్తింది కాదంబరి.
    "ఏంటి బామ్మ" అడిగింది కాదంబరి.
    "మీ బాస్ తో నీ ప్రేమ వ్యవహారం ఎంతవరకూ వచ్చిందే?"
    "పెళ్ళి వరకూ వచ్చేసింది లేవే..." అంది కాదంబరి.
    "నిన్ను తప్పకుండా పెళ్ళి చేసుకుంటాడంటావా?"
    "తప్పకుండా చేసుకుంటాడు బామ్మా...."
    "ఎలాగూ పెళ్ళి చేసుకుంటాడంటున్నావుగా! అతనితో ఏదో ఓరోజు కమిటైపోరాదూ! ఇంక కన్ ఫర్మ్ అన్నట్టు వుంటుంది".
    "పెద్దదానివై పోయావ్! లేకుంటే చెంప చెళ్ళుమనిపించే దాన్ని నీకిదేం బుద్దే. చిన్నవాళ్ళు తప్పు చేస్తోంటే, చెప్పేది పోయి, ఇలాంటి సలహాలిస్తావా? అసలు నేను నీకు మనవరాలినేనా? లేక నన్నెక్కడయినా కొట్టుకొచ్చావా?" కోపంగా చెడా, మడా వాయించేసింది కాదంబరి.
    "అదేవిటే.... అంతమాటనేసావ్.... ఏదో డబ్బున్నవాణ్ణి కట్టుకుంటే సుఖపడతావనే నా యీ తాపత్రయం అంతానూ...."
    "అయితే మాత్రం ఇంత ఘోరంగా ఆలోచిస్తావా?"
    "సర్లే.... పెళ్ళి చేసుకున్నాకే శోభనం చేసుకో...." అంది అక్కడ్నుంచి వెళ్ళిపోతూ....
    "నువ్వు సామాన్యురాలివి కాదే బామ్మా! హైటెక్ బామ్మవి!" అనుకుంది మనసులో కాదంబరి.
    
                                 * * *
    
    "కాదంబరీ! ఇదిగో రెండు సినిమా టిక్కెట్స్ కష్టపడి సంపాదించాను. తెల్సా! సంగీత్ లో.... నువ్వూ, మీ బాసూ.... హాయిగా వెళ్ళి చూసిరండి." అంది రెండు సినిమా టిక్కెట్స్ కాదంబరి చేతిలో పెడుతూ బామ్మ.
    "నీకెందుకంత శ్రమ...." విసుగ్గా అంది కాదంబరి.
    "నీ మొహం నీకోసం ఆ మాత్రం కష్టపడకుంటే ఎలా? అడ్వాన్స్ బుకింగ్ లో నిలబడి రెండు కార్నర్ సీట్స్ సంపాదించాను తెల్సా?" అదేదో ఘనకార్యం అన్నట్లు చెప్పింది.
    "మేం వెళ్ళాలనుకుంటే వెళ్తాం. ఇలాంటి వెధవ పన్లు మానేయ్" చెప్పులేసుకుంటూ అంది కాదంబరి.
    "నీదంతా బడాయి. ఇంత మంచి రొమాంటిక్ పిక్చర్ కి నీకింత తొందరగా టిక్కెట్స్ ఎవడిస్తాడు గానీ... అన్నట్టు.... బోలెడు సెక్సీ సీన్సట.... బాగా ఎంజాయ్ చెయ్యండి" అంది.
    "ఛీ....ఛీ.... నిన్ను మార్చటం నా తరం కాదు" అంటూ సర్రున ఆ టిక్కెట్స్ చింపి చెత్తబుట్టలో వేయబోయి ఆగింది. మళ్ళీ అది చూస్తే ఓ రామాయణం చేస్తుంది ముసల్ది. అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్ లో కుక్కుకుంది కాదంబరి ఆ టిక్కెట్స్ ని.
    
                                * * *
    
    మరో రెండు రోజుల తర్వాత....
    కాదంబరి లేచేసరికి వంటింట్లో నుండి ఘుమఘుమ వాసనలొస్తున్నాయి.
    ఏం చేస్తోంది బామ్మ అనుకుంటూ లేచింది కాదంబరి.
    వంటింట్లో వంటతో కుస్తీ పడుతోంది. చికెన్ కర్రీ వాసన అదిరిపోతోంది.  కాదంబరి ఆశ్చర్యంగా చూస్తూ....
    "బామ్మా! నువ్వు.... నువ్వు... చికెన్ వండుతున్నావా?" అంది.
    "అవునే! మీ బాస్ కి చికెన్ కర్రీ అంటే తెగ ఇష్టం అని చెప్పావు కదా! అందుకే కష్టపడి నేర్చుకుని, వండుతున్నాను. ఇది తీస్కెళ్ళి నువ్వే వండావని చెప్పేయ్ అతనికి. తిని, తెగ మెచ్చుకుంటాడు నిన్ను ఏ మగాడైనా తనకిష్టమైనది వండిపెట్టిన ఆడదంటే పడి చస్తాడు. ఆ విధంగా నువ్వు లక్కీ...."
    చిన్నప్పట్నుంచీ కనీసం కోడిగుడ్డు కూడా ముట్టని బామ్మ.... తనకోసం..... తన ప్రేమకోసం.... ఇదంతా చేస్తోందా! నిజంగా తను కలవారింటి కోడలు కావాలని ఇంత ఇదై పోతోందా? ఛ... తను మోసం చేస్తోంది బామ్మని. ఇదంతా ఎక్కడికి దారితీస్తుందో!
    "ఏవిటే! ఆలోచిస్తున్నావ్.... నేనెలా నేర్చుకున్నాననేగా! జీ... టీ.....వీ...లో...నిన్న చూసి పేపర్ మీద రాసుకున్నా మన ఎదురింటి ఆవిడ్ని అడిగి కన్ ఫర్మ్ చేసుకున్నానే... వండటం మొదలు పెట్టా.... సూపర్ గా వుంది వాసన.... తిని చూడు..." అంది అందిస్తూ....

 Previous Page Next Page