"ఇందులో ఆలోచించేందుకు ఏముంది" అని "అన్నపూర్ణా! వింటున్నావు కదా-అబ్బాయిని చూసుకోటానికి రమ్మందాం" అన్నాడు సుందర్రావు.
"అలాగే కానీండి" అందామె.
"అయితే---" అన్నాడు శాస్త్రిగారు. "రేపు మంచి రోజు. వచ్చి చూస్తాడు. మీ కంగీకార అయితే మహుర్తాలు పెట్టుకుందాం" అని ఆగి "కానీ, వెంటనే డబ్బంతా ఇచ్చెయ్యాలి. అది అతని అవసరం. మన అవసరమూ అనుకో- ఆర్డర్ రాగానే పెళ్ళి అన్నారు.
సుందర్రావు తటపటాయించాడు ఏమనటానికీ.
అన్నపూర్ణ పలకలేదు.
"అతని తల్లి నగలున్నాయ్. వాటిని బ్యాంక నుంచి విడిపించి అమ్మెయ్యొచ్చనుకో. కానీ అని రాబోయే కోడలికిమ్మని తల్లి ఆజ్ఞట. చూడండి మీ ఇష్టం మీరు కాదంటే అతని ప్రయత్నమేదో అతను చేస్తాడు."
"ఆ రోజు ఇచ్చినా--- రేపు ఇచ్చినా అతనిదే కదా! అన్నీ అనుకున్నాక అతని బాధ్యతా మనదే అవుతుంది. కానివ్వండి. రేపు అబ్బాయిని తీసుకుని రండి" అన్నాడు సుందర్రావు.
"శుభం! ఇక నే వెళతాను" అని లేచి సెలవు తీసుకున్నాడాయన.
సాయంకాలం కాలేజి నుంచి వస్తున్న సుధాకర్ ని ఓ వ్యక్తి పిలిచాడు "హలో! సుధాకర్ గారూ!" అంటూ-
అతను వూరికి కొత్త వ్యక్తి. సుధాకర్ ఎప్పుడూ చూడలేదు. తను అతనికెలా పరిచయమా అని ఆశ్చర్యపోయి చూశాడు.
సుధాకర్ "అలా పార్కుదాకా వస్తారా! రండి" అని దారితీశాడు. పది గజాల్లో కనిపిస్తున్న పార్కుకి అతని వెంటే వెళ్ళాడు.
సుధాకర్ చివరగా ఎవరూలేని చోటుకి దారి తీశాడతను. అతను కూర్చోగానే తన కర్చీప్ పరుచుకుని సుధాకర్ కూడా కూర్చున్నాడు.
ఓ క్షణం ఆగి జేబులోంచి ఓ కవర్ తీసి ఇచ్చాడతను. ఆశ్చర్యంగా చూసి అందుకున్నాడు కవర్ సుధాకర్,
"చూడు"
తెరిచాడు.
ఫోటోలు!
చూశాడు. ఆశ్చర్యం! భయం! ఆవేశం! కోపం!
"ఫరవాలేదు. సినిమాలకి పనికి వస్తావ్! అభినయిస్తావ్ బాగా"
ఫర్! ఫర్! మని చించసాగాడు.
నవ్వేడతను.
"సుధాకర్! ప్రింట్ కి ఒక్కోదానికి నలభయ్యేసి పైసలు ఖర్చుచేశారు వాళ్ళు. నీవు చించితే మళ్ళీ ప్రింట్ చేసుకోవాలి. నెగిటీవ్ లుండగా ఇలా చేస్తే ఫలితం ఏముంది"
నీరసపడి పోయాడతను.
"గుప్తజ్ఞాన్ కి పనికొస్తుంది కదూ ఆ బొమ్మ"
జవాబు లేదు.
"దాని క్రిందికి ప్రేమ్ శాస్త్రికి అక్కరకొస్తుంది"
పలకలేదు.
"కామశాస్త్రికి ఆ క్రిందికి-... అలా అలా చూస్తూ వెళితే న్యూస్ సినిమా స్టిల్స్ గుర్తుకొస్తాయి. బ్లూ ఫిల్మ్ కి పనికి వస్తాయన్న- ఫోటోగ్రఫీ పుస్తకాల క్రింద అచ్చేసి అమ్ముకున్నా చచ్చు సంభావనా- పాతిక వేలు అవునా?"
వంచిన తల ఎత్తలేదు సుధాకర్.
"ష్! పాపం! ఆ అమ్మాయి ఎవరో! ఇవి బయటపడితే విషం తప్ప గత్యంతరం లేదు. చూస్తే కాలేజీ అమ్మాయిలా వుంది. క్లాస్ మేటా?"
పళ్ళు కొరుకుతున్నాడు సుధాకర్.
"ఇదిగో మిస్టర్! అందర్నీ పురాణాలు చెప్పొద్దంటావటగా నీవు--- ిప్పుడు చెప్పు. దేవాలయంపై బూతు బొమ్మలకి మోడల్స్ గా ఇచ్చెయ్యనా ఇవి"
"ఏమండీ!"
"అద్గదీ! అలా రావాలి మాట మెత్తగా! తప్పు తెలిసి రావాలి. గుండె గొంతుకలోకి రావాలి. భయం ప్రాణాన్ని కుదిపెయ్యాలి. మానంపై అభిమానం విలువ తెలియాలి"
"ఎందుకివన్నీ చేశారు? ఎలా చేశారు?"
"అదంతా ట్రేడ్ సీక్రెట్! చేపను పట్టాలంటే ఎరని సంపాదించాలి"
"మీకేం కావాలి"
"ఎస్! అదిగో ఆ కంఠధ్వనిలో ఆ పట్టుదల వుండాలి. ఏమడిగినా దేనికయినా తెగించి తెచ్చి ఇచ్చే ధైర్యం వుండాలి."