Previous Page Next Page 
మధుకీల పేజి 22

    "చెప్పండి"
    "నీ కూతురికి ఎక్కడా సంబంధం ఖాయమవలేదు కదూ!"
    నిట్టూర్చాడు సుందర్రవ్!
    "లేదు శాస్త్రిగారూ! అనుకున్న దొకటి అయింది యింకొకటి. కూతురి సుఖాన్ని నే చూస్తే తన సుఖాన్ని తనే చూసుకున్నాడు కొడుకు. కన్న కొడుకుని ఆజ్ఞాపించలేని వాడిని యితరులని ఏమని అభ్యర్ధించగలను? ఏమో! దాని తలరాత ఎలా వుందో? ఎప్పుడవుతుందో పెళ్ళి"
    "అంత నిస్పృహ చెందకయ్యా బాబూ! ఇప్పుడు నేనా ప్రయత్నం మీదే వచ్చాను"
    వింటున్న యిద్దరి ముఖాలూ వికసించాయ్.
    అన్నపూర్ణ బయటికి వచ్చి శాస్త్రిగారికి నమస్కరించింది.
    "స్వామీ కాస్త దాహం పుచ్చుకుంటారా?" అని అడిగింది.
    "ఆవశ్యం తల్లీ!" అన్నాడాయన.
    శాస్త్రిగారిది భారీ కాయం. ఆయన చొక్కా వేసుకోడు. పైన పండిత శాలవా వేసుకుంటాడు. దానితో ముఖం తుడుచుకుని అన్నపూర్ణమ్మ అందించిన మజ్జిగ గ్లాసు అందుకుని గట గటా తాగేశాడు.
    "మజ్జిగకి దోషంలేదు అన్నపూర్ణమ్మ తల్లీ! అది అమృతం" అని "ఆ సుందర్రావ్? నీవే మాత్రం యిచ్చుకోగలవయ్యా" అన్నాడు.
    "చాలు చాల్లేవయ్యా! బాగా చెప్పావ్. పెళ్ళయిన యింట్లో ఆరు నెలలు కరువన్నారు. మామూలుగా. ఉద్యోగం లేక మరో ఉపాధిలేక ముగ్గురెలా బతుకుతారు. ఉన్నది ఖాళీ అయ్యాక యిక తర్వాత అన్నిటికీ కష్టమే! నా మాట విని కట్నం అనీ అదనీ యిదనీ అంటారు-అన్నిటికీ నాలుగు వేలను పెళ్ళి దర్జాగా పదిహేను వందలో రెండు వేలో పెట్టి చెయ్యి మిగిలింది నీ సంసారానికి వుంచుకో"
    "శాస్త్రిగారూ!"
    "అవును సుందర్రావ్! బ్రతకటం తెలియాలి మనిషికి. జీవితాంతం పై చూపులేనా? కాస్త ముందూ వెనకా చూసుకో"
    "హుఁ మీ యిష్టం అన్నిటికీ మీదే భారం."
    "ఆఁ అలాగన్నావ్ బాగుంది. ఇప్పుడు విను"
    "చెప్పండి"
    "కుర్రాడు బి.ఏ. అయ్యాడు. ఆరడుగుల ఎత్తు. ఎర్రగా వుంటాడు. కను ముక్కు తీరు బావుంది."
    "సరే!"
    "అమ్మాయికి అబ్బాయీ, అబ్బాయికి అమ్మాయి తప్పకుండా నచ్చుతారు- అయినా అదింకా దాపరికం ఎందుకు? అబ్బాయికి అమ్మాయి నచ్చింది. ఎక్కడో బజారులో చూశాడట."
    "సంతోషం"
    "రేపో మాపో మంచిరోజూ చూసి వస్తాడట"
    "అలాగే మీ ఇష్టం"
    "ఇప్పుడు---" అని ఆగి నశ్యం దట్టించి "అబ్బాయి ఓ ప్రయివేట్ కంపెనీలో గుమాస్తాగా వుంటున్నాడు. నెలకి రెండొందల చిల్లర ఇస్తున్నారట. అబ్బాయ్ బ్యాంక్ కి పరీక్ష రాశాడట. పాసయ్యాడట. కానీ లంచం- అమ్మో అంత మాటెందుకు పై ఆఫీసరుగారికి చదివింపులు కావాలిట. ఆ ఉద్యోగం ఇచ్చేటతని కూతురి పెళ్ళి మరో పది రోజుల్లో వుందట. లక్షరూపాయల కట్నం ఇవ్వాలిట. అందుకని ఉద్యోగాల్ని పబ్లిగ్గా అమ్మేస్తున్నాడు. అన్నిటా సరిపోయిన వాడికి నాలుగువేలు, అవసరమైనవాడికి ఆరునుంచి పది వేలు, ముడుపు చెల్లిస్తేనే ఆర్డరు పుడుతోందిట. లేదా శ్రీమద్రమారమణ గోవిందో హరి."
    నిట్టూర్చాడు సుందర్రావు.
    "అధికారం, హోదా ఎంత దిగజారిపోయాయ్ శాస్త్రిగారూ! ఆశ్రితులకీ అందించినవారికి ఇస్తూ అన్నిటా యోగ్యమైన వాళ్ళని దూరంగా నెట్టేస్తున్నారు ఈ సంఘం."
    "ఇదిగో సుందర్రావు! సంఘమంటే ఎవరయ్యా? నువ్వూ నేనూ కాదూ! అంతా మనమే! ఇచ్చేదెవరు పుచ్చుకునే దెవరు అంతా నేనే అని భగవద్గితాకారుడన్నట్టు సమానుకూలంగా సర్దుకునిపోవాలి! తెలివితేటలకి కాంపిటేషన్ పెడుతున్నారా లేదా? ఇదీ అలాగే. పలుకుబడికీ, ధనానికీ పోటీ పెడుతున్నారు అది తప్పైయిది ఒప్పౌతుందా?"
    సుందర్రావ్ జవాబివ్వలేదు. తమ చిన్ననాటి బంగారు కాలాన్ని మనసుకి తెచ్చుకుంటున్నాడు.
    "అబ్బాయికి ముందూ వెనకా ఎవరూ లేరు. తల్లీ తండ్రి లేరు. ఎక్కడో మేనమామగారున్నారు. వున్నా దూరంగా వున్నట్టే వున్నారు. నీ కూతురు సుఖపడుతుంది. చీకూ చింతా లేని సంసారం. ఇద్దరుంటే హాయి. ముగ్గురైతే మురితెందాటితే తలనొప్పి. అందిట ఓ పెళ్ళి కూతురు నీ కూతురు నోచిన నోముల పంటేమో చల్ మోహనరంగా అనేట్టుగా బ్రతకొచ్చు. మంచి అవకాశం - ఆలోచించు"

 Previous Page Next Page