Previous Page Next Page 
పాదాభివందనం పేజి 23

"అపంది కన్నట్లు కన్నావ్?" మరీ కసిగా అన్నాడు.

"అవును. పందికి కన్నట్లు కన్నాను!"

"ఏందే కుస్తున్నావ్! నేను పందినా? నువు పందివి. నీ పిల్లలు పందులు! నీ కిట్టిగాడు పంది. నంజదానా! నన్ను పందంటావా?" రేగి పోతున్న కోపంతో బాదాడు గబగబా!

"పందివే కాదు. దున్నపోతువు.....గాడ్డేవు!" దెబ్బలు తింటూ అరిచింది నర్సమ్మ.

"దున్నపోతును, గాడ్డెను. పందిని. నేను పశువును నయితే నా యేంబడోచ్చిన దానివి నువు మడిసివా? నువు అంతే చావు నంజా! చావు" బాధనంతా పళ్ళ బిగువున అణుచుకుంది నర్సమ్మ.

బాదిబాది విసుగొచ్చి బయటికి వెళ్ళిపోయాడు యాదయ్య. తాటాకు వాకిలి విసురుగా వేసి వెళ్ళిపోయాడు. వాడి కాళ్ళు అలవాటుగా సారా దుకాణం వైపు, దీనంగా చూస్తూ ఉండిపోయింది.

అర్ధరాత్రి హటాత్తుగా మెలుకువైంది నర్సమ్మకు. శరీరం బరువూ, తన శరీరం పై తొలగిపోయిన చీర వెంట వెంటనే తెలిశాయి. చెప్పరాని అసహ్యం కలిగింది.

"చీ!" అని విదిలించుకోబోయింది.

"నర్సి!" దీనంగా అన్నాడు యాదయ్య.

"బర్రెగోడ్లతో ఏం పని? బజార్లో  ఎవరు దొరకలేదా?"

నన్ను క్షమించే! కోపంతో కొట్టినానే! తప్పయిందే!"

"ఎవరయినా అంతే! కోపం లేకుండా ఎందుకు కొడతారు. లే!లే! అసహ్యంగా పది మందని చంపు. నన్ను చంపు మళ్ళా పదకొండో వాడ్ని చంపడం చావడం ఎందుకు?"

"తిట్టకే! నేను యాసీరి కొచ్చి అట్టంట గానీ- నాకు నీ మీద పిల్లల మీదా ప్రేమ లెదూ?"

"నా మిదెందుకు కుండదు? ఇదిగో! యిట్లాంటపుడే బలే ప్రేమ పుడ్తది కనిపించడంలా! ఆర్గురు!"

యాదయ్య నోరెత్తలేదు. నర్సమ్మ రెట్టించలేదు. ఆమె మనస్సుపై శరీరం తిరగబడింది.

ఆమె మాట విన్లేదది!

ఉదయం లేస్తూనే పరగడుపుతోనే యాదయ్య పన్లోకి వెళ్ళాడు. తలతిప్పుతున్నట్టుగా ఉంటె కొంచెం ఉప్పు నీళ్ళు తాగి వెళ్ళింది నర్సమ్మ.

పిల్లలంతా లేచి ఆకలాకలాకలంటుంటే చూళ్ళేక బయటికి వెళ్ళాడు రాయుడు. వాడికి లోకం తెలుస్తుంది. తల్లి తెలుస్తుంది. మారు తండ్రి తెలుస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆకలి తెలుస్తుంది.

అందుకనే తమ్ముడు లచ్చన్నకు చిన్నపిల్లల భాద్యత అప్పగించి బయటికి వెళ్ళాడు. ఎట్లాగయినా తిండి, డబ్బు తీసుకుని రావాలన్నది వాడి ఆశ!

పనిచేస్తున్న నర్శమ్మ దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చాడు రెండో వాడు లచ్చి! వాడొచ్చిన నిమిషన్నరకి మిగతా ఎనిమిది మంది అష్టగ్రహకూటమిలా లబో దిబో మంటూ వచ్చారు.

ఆకలి కేకలు! ఆకలి మంటలు! అనుకున్న నర్సమ్మ "ఏం రా! ఏమైంది? ఎవరు చచ్చారని అట్టేడుస్తున్నారు? నేను బాగానే ఉన్నాన్లే! ఇంకా చావలా, తిండి పెట్టినారు! పదండి! పదండి!

తలోమెతుకు తిందురు గానీ! మీ అదృష్టమా అని రాత్రి ఎవరూ సరిగా భోజనం చెయ్యక తపిలెదన్నం మిగిలిపోయిందని అమ్మగారు అన్నం పెట్టారు! అంది విసుగ్గా.

"అది కాదమ్మా! అన్న టాక్సీ కింద పడి చచ్చిపోయినాడంట! ఇదిగో యీ మనిషి వచ్చి చెప్పినాడు!" అన్నాడు బెక్కుతో లచ్చన్న.

కాళ్ళ కింద మట్టి కదలిపోయింది. కళ్ళకి మసకలు కమ్మినాయ్! నీరు తెరలు తెరలుగా పొరలు పొరలుగా కళ్ళలో నిలిచింది ఘనిభవించిన శోకం, దుఖాగ్ని కి ద్రవిభుతమైనట్టుగా తెరలు తెరలుగా చెక్కిళ్ళ పై ప్రవాహించసాగింది.

ఆరడుగుల మనిషి మూడడుగులైనట్టు అంతదాకా పక్కనున్న మనిషి బెతుకు బెతుగ్గా ముందు కొచ్చాడు. అతను టాక్సీ వోనరు కాదు. డ్రైవరూ కాదు. క్లినరంతకన్నా కాదు బ్రోకరు. అతన్ని పిల్లను చంపిన పులిని చంపడానికి దూకాబోయే లేడిలా చూసింది నర్సమ్మ.

ఆ చూపుల కా క్షణంలోనే మసి అయినట్టుగా "అమ్మా! మా తప్పు లేదు. మీ తప్పు లేదు. పిల్లవాడు అజాగ్రత్తగా ఉన్నాడు. హరన్ విని అటూ ఇటూ పరిగెత్తి టైర్ కింద పడ్డాడు. వెంటనే ప్రాణం పోయింది.

అందరూ పారిపోయారు. పోలిసొళ్ళ భయానికి, పిల్లావాడిని మీ ఇంటి వద్దకి తెచ్చాను. పోలిసొళ్ళకి తెలిస్తే అది వాళ్ళకే లాభం! మాకు నష్టం మీకేమో పైసా రాదు.

ఇదిగో యీ డబ్బుతో పిల్లవాణ్ణి తొందరగా బుడ్పించు!" ఆమె చేతిలో వందనోట్లు రెండు పెట్టి గబగబా వెళ్ళిపోయాడు. నోరు తెరిచి కేకేసే శక్తి కూడా లేకపోయింది నర్శమ్మకి. పనిలోంచి పరుగు పరుగున వచ్చాడు యాదయ్య. వాడు ఇంటికి వచ్చేసరికి నర్సమ్మ కోసుకుని ఒడిలో పెట్టుకుని గోడు గోడున ఎడుస్తుంది. పక్కనే ఉన్న యాదయ్య తల్లి- గుడ్డిది - బస్సుల్ని, లారిల్ని, టాక్సీలను అంతెందుకు- మోటారు ఇంజన్ ని కనిపెట్టిన వాడిని తల్లితో సహా బూతులు తిడుతోంది. ఏడుస్తుంది.

చుట్టూ జనము గుమిగూడి తలో కూత కూస్తున్నారు.

నర్సమ్మ వాడిని చూడగానే - చూడ్రా చూడు. రాత్రి విషం పెడతానన్నావు. తెల్లారేసరికి నీకు కష్టం లేకుండా వాడే చచ్చాడు. రా రా వాళ్ళ నాయన లారీ కింద పడి చచ్చాడు. వీడు టాక్సీ కింద పడి చచ్చాడు. మిగతా వాళ్ళని బస్సు క్రింద ఎయ్. నేను రైలు క్రింద పడతా. నువు నీ పిల్లలూ నీ తల్లీ చెర్లో దూకండి " అంది దుఃఖంతో ఆరాటంతో ఆవేశంతో.

అంతలో- యాదయ్య నోరు విప్పెంతలో పొలిసులోచ్చారు వాసనా పట్టినట్టుగా , హెడ్డు కానిస్టేబుల్ అందరూ కట్టగట్టుకుని వచ్చారు. చుట్టూ ఉన్న మనుషులు చెల్లా చెదరయ్యారు.

కేసు మాఫీ చేద్దామనుకున్నావా నంజి కొడకా! పద! బొక్కలో తోసేస్తా! ఏడాది పాటు ఐదు కడ్డిలు లెక్కబెడితే తెలివి వస్తుంది! " అన్నాడు హెడ్డు వస్తూనే తిట్లకి లంకించుకుంటూ.

యాదయ్య భయపడ్డాడు. వాడి ముఖంలో భయాన్ని ఆ , ఆలు చదవగల్గినంత తేలిగ్గా చదివేసిన కానిస్టేబుల్ వాడిని పక్కకి లాక్కెళ్ళి జైలుకి బేరం పెట్టేడు. తిక్కముఖం వేశాడు యాదయ్య.

"చూడే నర్సి! రెండొందలిమ్మంటే బిక్కముఖం పెడుతున్నాడు నంజికొడుకు. అయితే మొగుడ్ని జైలుకి పంపుతావా?"

"ఏందయ్యా! కొడుకు చచ్చి మేం ఏడుస్తుంటే, చంపింన్నాకొడుకుల్ని పట్టుకోక, చచ్చిన్నా కొడుకుల కోసం నక్కల్లాగా వచ్చినారు!"

 Previous Page Next Page