మొత్తం తోట కంతకీ ఒకే కాంపౌండ్.
ఆ కంచె చుట్టూ పైకి చొచ్చుకపోయేట్టు ఎత్తుగా వున్న కొబ్బరిచెట్లు ఎంతో అందాన్నిస్తున్నాయి.
తోట అంతా తిరిగేరు.
ఆ తోటకి నీరు సరఫరా చేసేందుకు మూడు బావులున్నాయి. ప్రతి బావికి ఒక షెడ్ నిర్మించి కరెంట్ మోటార్ బిగించేరు.
ప్రతి బావికి చుట్టూ కొంత బయలు వదిలేరు.
ఆ బయల్లో అరటి నాటారు.
బావి గట్టు వెంట మునగచెట్లు పెంచేరు.
ఇవి కాక రకరకాల కూరగాయల పాదులు పొట్ల, వంగ, దొండ, ఆనప....
"ఓహ్" అనుకుంది సత్య.
టవునులో వుంటోన్నా పల్లెటూరి ఆసామిలాగా అన్నీ ఆర్డర్ గా పెంచిన అతని శక్తి మెచ్చుకుంది. మనసారా.
"ఇక వెళదామా"
తృప్తిగా ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూచి నవ్వుకుంటూ అడిగేడు సతీష్.
"ఊఁ" తనూ మెల్లిగా నవ్వి అంది.
తిరిగి హాలులోకి వచ్చేసరికి తొమ్మిదయింది.
"అలా కూర్చో!"
సోఫా కుర్చీలో కూర్చుంది. అందులో దిగబడిపోతుందా అన్నంత మెత్తగా వున్నాయి ఆ కుషన్లు.
"అదిగో!"
రింగ్ చేయబోతున్న వదల్లేదు ఆగి "ఏంటి" అన్నట్టు చూసేడు. ముసి ముసి నవ్వులు నవ్వుతూ.
"చూడు! మీ అయ్యగారి పేరేమిటన్నావ్?"
"కృష్ణ...."
"కృష్ణ.... అందమైన పేరే. అభిరుచి అందంగా వుంది. పెంచుకున్న తోటలు. కట్టుకున్న యిల్లుకూడా చాలా అందంగా వున్నాయ్.... మరి .... మరి.... మనిషి అందంగా వుంటాడా?"
గలగల నవ్వి అన్నాడు సతీష్.
"పర్వాలేదు. నీలోనూ టేస్ట్ వుంది."
"ఏం?" బుంగ మూతితో అడిగింది.
"ఇంత అందంగా యిల్లుని, తోటని వుంచుకున్న మనిషి అందంగా వుంటాడా అని అడగటం టేస్ట్ కాదా మా అయ్యగారి శరీరమే కాదు. మనస్సూ అందమైందే....
అంతెందుకు- నన్ను చూడు- డ్రైవర్ని నన్నూ అందమైనవాడినే ఎన్నుకున్నాడు."
"ఏం నేను అందంగా లేనా?"
తన మాటలకి నవ్వుతున్న సత్యని చూసి ప్రశ్నించేడు.
"నువ్వు అందంగా ఉన్నావో లేదో నీ ఎదురుగావున్న అద్దాన్నడుగు."
"అద్దాలకేం అందమైన అబద్ధాలు చెపుతాయ్ ఎప్పుడూ. మనస్సు ఆనందంగా వున్నప్పుడు అందంగా కనిపిస్తాం. చిరాగ్గా వుంటే ఏదో లోపం వున్నట్టుగా అనిపిస్తుంది. మనకే....
అయినా అందానికి గీటురాయి ఆడవాళ్ళ మాట"
"భలేవాడివే! నువ్వే అన్నావుగా అందమైన డ్రైవర్ని సెలక్ట్ చేసుకున్నాడు మా అయ్యగారని.... ఆఁ సతీష్! ఇంతకి
మీ అయ్యగారి ఫోటో ఒకటైనా కనిపించదేం యిక్కడ...."
"ఆయనకి తన ఫోటో వేలాడుదీసుకోవటం యిష్టం లేదు.... ఉండు నన్ను ఫోన్ చెయ్యనీ" అని రింగ్ చేశాడు.
అవతల రింగయ్యాక రకరకాల టేస్టులు ఫేషన్ శారీస్ అరడజన్ పంపమన్నాడు. వాటికి మేచింగ్ లంగాలు, జాకెట్ పీస్ పంపమన్నాడు.
అతనలా ఆర్డరిస్తువుంటే నివ్వెరపోయి చూడసాగింది సత్య.
ఫోన్ పెట్టేశాడు సతీష్.
ఇటు తిరిగేడు.
"హలో! ఏమిటలా అయిపోయేవ్? నా మాటంటే ఏంటనుకున్నావ్. అయ్యగారిమాటే- ఆయన వూళ్ళోవుంటే ఆర్డర్స్ నా ద్వారా వెళతాయి. అవుటాఫ్ స్టేషనయితే ఆర్డర్స్ నా ద్వారా వెళతాయి. అవుటాఫ్ స్టేషనయితే ఆర్డర్స్ నేనే వేస్తాను. నేనేం చేసినా ఆయన అడ్డుపెట్టరు....
"మంచిమనిషే!"
"ఊఁహు బంగారు మనిషి."
"ఫరవాలేదు.... ఇంతకీ మీ అయ్యగారేం చేస్తారు?"
"ఏం చెయ్యరు."
"ఆశ్చర్యంగా అడిగింది."
'ఊహుఁ చేయిస్తారు. ఈ తోట చూట్టానికి నలుగురు మనుషులున్నారు. వాళ్ళక్కావలసిన ఫెర్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్ యివ్వటానికి ఆ లెక్కా అదీ చూట్టానికి ఓ క్లార్క్ వున్నాడు. అయివేజు ఇచ్చే రోజు తప్ప అతనేం చేస్తున్నదీ అడగరు.
అలాగని గుడ్డిగా వుంటారనుకోకు. అన్నీ క్షుణ్నంగా గమనిస్తూ వుంటారు.
ఓ రైసుమిల్లుంది, దానికో మేనేజరు- ఇద్దరు క్లార్క్స్ వున్నారు, టెక్నీషియన్స్ కాక.
రెండు ఆయిల్ మిల్స్ వున్నాయి. వాటి మేనేజ్ మెంట్ ఓ వ్యక్తిది. అతనికి నలుగురు ఎసిస్టెంట్స్ టెక్నీషియన్స్ కాక-
ఇదికాక ఒక థియేటర్ వుంది.