"అంతేనంటావా?"
"ఆఁ"
"అయితే తీసుకుని రా!"
"ఒక్కక్షణం" అని పరిగెత్తి పూల పూల నీలి లుంగీ, రోజ్ కలర్ షర్టు, కట్ డ్రాయర్, బనీన్ తెచ్చి అందించింది.
డ్రాయరు వేసుకుని, బనీను తొడుక్కుని, లుంగీ కట్టుకొని షర్టు వేసుకుని అద్దం ముందు నుంచుంది సత్య.
"అమ్మాయ్ గారూ!"
జానకమ్మ పిలుపుకి తిరిగి చూసిన సత్య కొద్దిగా సిగ్గుపడింది. తొలిసారి పైట వేసుకున్న కన్నె పడుచులా, తొలిసారిగా తలిదండ్రులు చూడకుండా మీసం కత్తిరించుకున్న యువకుడిలా సిగ్గుపడింది.
నవ్వింది జానకమ్మ కళ్ళింతలు చేసుకుని చూసింది.
"జానకమ్మా!" మంద్రస్వరంలో పిలిచింది.
"బాగున్నావమ్మా! చాలా బాగున్నావ్. పదహారు పద్దెనిమిదేళ్ళ యువకుడిలా వున్నావ్. అందుకే అంటారు మగాడు ఆడవేషం వేసినా ఆడది మగవేషం వేసినా అందంగా వుంటుందని."
తొలిసారి సిగరెట్ దొంగతనంగా కాలుస్తూ మేష్టారికి దొరికిపోయిన కొంటె కుర్రాడిలా ముఖం దించుకుంది సత్య.
"టిఫిన్ తీసుకొందువుగాని రామ్మా బాబు మీ కోసం కాచుకుని వున్నారు" అంది.
"ఆయన-యీ యింటి యజమాని వచ్చేశారా?"
"ఉహూఁ బాబు అంటే సతీష్. కారు డ్రయివర్"
"ఎందుకులే! నేనక్కడే తీసుకుంటాను."
ఉహూఁ దానికి అతనొప్పుకోడు. అయ్యగారికి తెలిస్తే అతనికి మాటొస్తుంది. ఏది ఏమైనా అతిధి మర్యాదల్లో లోటు రాకూడదు."
"పద"
తొలిసారిగా అత్తారింటికి తల్లి వెనక నడిచే నవవధువులా నడిచింది. లుంగీతో నడవటం అదోలా వుంది. పైట లేకుండా లూజ్ షర్టు వేసుకోవటం ఎబ్బెట్టుగా ఫీలయింది. కండువా తీసుకొని పైటలాగా వేసుకుందామా అనుకుంది.
అంతలో డైనింగ్ హాల్లో పవేశించారు.
కళ్ళింతలు చేసుకుని చూశాడు సతీష్.
అతనికామె అందం అబ్బురంగా కనిపించింది.
"రండి!" అన్నాడు గౌరవంగా.
కుర్చీలో కూర్చుంది.
ఏదో ఎబ్బెరికం, ఏదో సిగ్గు.
"తీసుకోండి" ప్లేట్ ముందుకు జరిపేడు.
తల ఎత్తలేక పోతోంది. సూటిగా చూసి మాటాళ్ళేక పోతోంది. గొంతులో ఏదో తడబాటు.
"టిఫిన్ కానిస్తే, మనం అలా తోటలో తిరుగుదాం. ఇప్పుడింకా ఎనిమిదన్నా కాలేదు. తొమ్మిదయితే షాపులు తెరుస్తారు. మనం వెళ్ళొచ్చు లేదా ఫోన్ చేస్తే తెస్తాడు."
"ఏమిటి? ఎందుకు? కంగారు అడిగింది."
"మీకు కట్టుకోవటానికి చీరలు-రవికలు--లంగాలు బ్రా...."
ఏం వద్దు- ఓ గంటలో నా చీర అవీ ఆరతాయి, అవిచాలు" గబగబా అనేసింది.
"మళ్ళీ రేపు?"
"ఈరోజులాగే"
"అదేం బావుండదు. నువ్వేం అనొద్దు.... మా అయ్యగారు చాలా మంచివారు. చూశావుగా ఈ ఇల్లు- యీ ఆస్థి - యీ వైభవం ఉండేది ఆయనొక్కడు. తినటానికెవ్వరూ లేరు...."
"ఏది ఏమైనాసరే---వద్దులే!"
"అదిగో నువ్వు నా మాట వినాలి. నువ్వు అదంతా మరిచిపోయి హాయిగా గడిపేయ్ నాలుగు రోజులు. తర్వాత నీ ఇష్టం."
సత్య జవాబివ్వలేదు.
ఫలహారం ముగించింది.
"ఈ ఇంటి వెనకే నారింజతోట వుంది. వెళ్ళి చూద్దామా?"
"ఊఁ"
చేయి కడుక్కుని లేచాడతాను.
ఏదో సైగగా చూసేడు జానకమ్మవైపు.
ఆమె తలూపింది మౌనంగా.
వంటిల్లు దాటి పెరటి గుమ్మం దాటేరు. కాంపౌండులో రకరకాల పూలమొక్కలు, జాజులు, మల్లెలు, రోజాలు, కనకాంబరాలు.... .... ఎన్నెన్నో....
అవి చూడగానే పరవశించిపోయింది సత్య మనస్సు.
"ఎన్ని పూలచెట్లో...." అప్రయత్నంగా అంది.
నవ్వేడు సతీష్.
"మీ అయ్యగారు టేస్టున్నవాడే...."
"ఏమనుకున్నావు?" దర్పంగా చూసేడు.
ఆ కాంపౌండ్ దాటగానే తోట.
నారింజతోట పూతతో వుంది. మందమందంగా ఆ చెట్లమీదినుంచి వచ్చే సుమధుర పరిమళాలు మల్లెల తావిని, సంపెంగ పరిమళాన్ని వెదజల్లుతున్నాయ్.
సువాసనల మీదుగా నడిచి ఆ తోట దాటేరు. తర్వాతున్నది మామిడితోట. దాన్నానుకుని గున్న నిమ్మతోట, జామతోట, సపోటతోట ఆ తర్వాత వున్నాయి.