Previous Page Next Page 
రాగవాహిని పేజి 10

    ఇన్ని వ్యాపారాలు.

    ఇవన్నీకాక ఓ రెసిడెన్షియల్ స్కూలు నడుపుతున్నారు. ఉచిత భోజనవసతి సౌకర్యాలున్నాయి. టీచర్సుకి మంచి జీతాలు, ఫ్రీ క్వార్టల్సు. దాని యాజమాన్యం అంతా ఆ కులపతిదే. దానికి ఫండ్స్ మాత్రం దేశం నలుమూలలనుంచీ డొనేషన్స్ రూపంగా వస్తూవుంటాయి.

    ఓ రోజు వెళదాం.

    ఆ విద్యాలయాలన్ని చూసి తీరాలి.

    అతని వాగ్దోరణి ఆపుతూ కాలింగ్ బెల్ మ్రోగింది.

    "కమిన్" అన్నాడు ఠీవిగా,

    ఓ వ్యక్తి గుమాస్తాతో రకరకాల చీరలు, లంగాలు, జాకెట్ పీసులు పట్టుకొచ్చేడు.

    వాళ్ళని చూడగానే సతీష్ గంభీరంగా మారిపోయాడు.

    "చూడండి మీకు కావలసిన చీరలు, ఆరు, వాటికి రవికెలు, లంగాలు ఎన్నుకోండి---" అన్నాడు బయటకు కదులుతూ.

    ఆ వచ్చినవాళ్ళవేపు చూసి "సెలక్షన్ అయ్యేక బిల్ వేయండి, చెక్ చేయిస్తాను" అన్నాడు.
    "చిత్తం" అన్నారు వాళ్ళు.

    ఆ తర్వాత మరేమీ అనేందుకు వీలులేక ఆరు చీరల సెట్టు ఎన్నిక చేసింది.

    వాళ్ళు చకచక బిల్ వేశారు.

    మొత్తంచూసి గుండె గుభేల్ మంది.

    రెండువేల నూటరెండు!

    "మైగాడ్!" అనుకుంది.

    అంతలో వచ్చేశాడు సతీష్.

    "బిల్ చూపండి" అని "గుడ్ ఇదిగో చెక్" అని చకచక చెక్ రాసిచ్చేడు.

    వాళ్ళు నమస్కారం చేసి వెళ్ళేరు.

    "బావున్నాయా?" అతనే ముందు పలకరించేడు.

    దిగులుగా ముఖం పెట్టింది సత్య.

    "అరరె! ఏమిటది!"

    "అంత ఖరీదు---" మాట పూర్తికాక ముందే మాట తొట్రుపడింది. కళ్ళలో నీళ్ళు తిరిగేయ్.

    "యూ సిల్లీ....ఏమిటది? మరేం ఫరవాలేదు. అన్ని చీరెలసెట్టు అంతేగా అంటారు అయ్యగారు, వాళ్ళు అన్నీ నైలాక్స్, జెర్నీ, గజీ చీరలే తెచ్చేరు. పట్టువి తేలేదు. ఆవైతే యింకా అయ్యేది" అన్నాడు నవ్వుతూ.

    "సతీష్!"

    "గుడ్! అలా పిలువు. మూడ్ మార్చుకో. కుషీగా వుండు."

    ఆమె ఏమీ అనలేకపోయింది.

    "మీ ఫ్రెండ్ పేరేమిటన్నావు?"

    "నేనేమి అనలేదు."

    పకపక నవ్వేడు "అరరె ఎంతకోపం! అవునూ నీ ముఖంలో భావాలెంత బాగా పలుకుతాయ్. యూ ఆర్ గుడ్ ఆర్టిస్ట్" అన్నాడు.

    "ఇంకేం మీ అయ్యగారికి యిన్ని బిజినెస్సులున్నాయ్. సినిమా రంగంలోకి దింపు నన్ను హీరోయిన్ చేసి పిక్చర్ తీయమను" కోపంతో, కసితో అంది.

    "మరి హీరో...." కొంటెగా నవ్వుతూ అడిగేడు.

    "పోనీ నువ్వే...." నోరు జారి నాలుక్కరుచుకుంది.

    విరగబడి నవ్వేడు.

    పడి పడి నవ్వేడు.

    కొన్ని నిమిషాల తర్వాత నివ్వెరపోయి తననే చూస్తున్న ఆమెని చూసి తనకై తానే సంబాళించుకున్నాడు.

    ఆ మాటకి ఏం పలకలేదు సత్య.

    "సారీ అన్నానా? అయినా నా తప్పేంవుంది? నువ్వు అప్రయత్నంగా నోరు జారితే నాకు నవ్వొచ్చింది. సహజమైన సన్నివేశంలో నవ్వకపోతే మనిషి మనిషికాడు తెలుసా?"

    దానికి పలకలేదు సత్య.

    "సత్యా!"

    ఉలిక్కిపడింది ఆ పిలుపుకి.

    "నేను రైసుమిల్లు అవీ చూసి రావాలి. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. నేను భోజనానికల్లా వచ్చేస్తాను. ప్రొద్దు పోవాలంటే పుస్తకాలు చూడు. అదిగో అదే లైబ్రరీ రూం. అందులో పుస్తకాలు! మేగజైన్స్ వుంటాయి.

    తలూపింది సత్య.

    కదలి వెళ్ళేడు సతీష్.

                             *        *        *

    సాయంకాలానికి తిరిగి వచ్చేరు పాలూ పెరుగూ అమ్ముకోవడానికి వెళ్లినవాళ్లు.

    పొలంనుండి తిరిగొచ్చి పాలు తీసి, సంధ్యాదీపం వెలిగించి పంచలోకి వచ్చింది.

    అటువేపుగా వెళుతోన్న లక్ష్మమ్మ "ఏమ్మో! శివకామమ్మా నీ మనవరాలు మాతోపాటే టౌనుకి వస్తానని ఎగేసిందేం? నిద్దర లేవలేకపోయిందా? ప్రయాణం మానుకుందా?" అంటూ పలకరించింది.

    "మీ వెంట బయలుదేరేందుకు కాస్త ఆలస్యమైంది. అయినా ఆ వెంటనే పరుగు పరుగున వచ్చిందే కలుసుకోలేదా?"

    "ఊహుఁ"

    "ఎవర్నీ కలుసుకోలేదా?"

 Previous Page Next Page