చూచిన తొలిచూపులోనే ఈ అమ్మాయి నా మనస్సు నాకట్టుకుంది. అచ్చ తెలుగు సుడికారంలాగా నాగరికతా వాసన వీచిన తెలుగు పడుచు. యీ అమ్మాయి.
"ఈ అమ్మాయి నా సొంతమైతే...." అనుకున్నాడు.
"స్నానం చేస్తావా అమ్మాయ్"
"నేను వేకువనే స్నానం చేసేనండీ."
"అయినా, మరోసారి స్నానంచేస్తే...." అర్ధోక్తిలో ఆగిపోయింది జానకమ్మ.
"పద"
ఆ యింట్లో నడుస్తూ వుంటే-ఆమెకి ఆ యిల్లు దేవేంద్రభవనంలా కనిపిస్తోంది. ఇంటినిండా అందంగా పరిచిన కార్పెట్లు, ఇంటికి వేసిన డిస్టెంపర్ రంగులు, వాకిళ్ళకు కిటికీలకు అందంగా వేలాడదీసిన కర్టెన్స్ కదిలితే సంగీతంలా ధ్వనించే చిరుమువ్వలు, గోడలకి అక్కడక్కడా తగిలించిన చిత్రపటాలూ ఆ యింటి సౌభాగ్యాన్నీ ఆ యింటి యజమాని అభిరుచినీ వ్యక్తపరుస్తున్నాయ్.
బాత్ రూం ముందాగి "లోపలికి వెళ్ళమ్మా!" అంది జానకమ్మ.
స్ప్రింగ్ డోర్ ని నెట్టింది సత్య.
కర్టన్ కదిలి, మువ్వలు నినదించి మధురంగా మ్రోగేయ్.
లోపల అడుగుపెట్టిన సత్య అది బాత్ రూం అంటే నమ్మలేకపోయింది.
మొజాయికి ఫ్లోరింగ్, పాదాలు మోపితే మాసిపోతుందా అన్నంత అందంగా శుభ్రంగా వుంది. హాండిల్ బార్స్ పై ఇస్త్రీ టవల్స్ వేలాడుతున్నాయ్. వేడినీళ్ళు చన్నీళ్ళు పచ్చె కుళాయిలున్నాయ్. లిరిల్, మైసూర్ శాండిల్ సోపులు, షాంపూ ఉన్నాయ్.
షవర్ తిప్పింది అప్రయత్నంగా, జల్లున పన్నీరులాగా కురిసింది నీరు. మళ్ళి తిప్పేసరికి ధార ఎక్కువై తప్పగా తడిసిపోయింది....
తనని తాను మరచిపోయి గంటసేపు స్నానం చేసింది సత్య.
కారు గేరేజ్ లో పెట్టి, స్నానం చేసి, టిఫిన్ కోసం డైనింగ్ హాల్లోకి వచ్చిన సతీష్ జానకమ్మవేపు ప్రశ్నార్ధకంగా చూసేడు.
"ఇంకా స్నానం చెయ్యలేదండి బాబుగారో."
"జానకమ్మా!"
"బాబుగారూ!"
"ఆ అమ్మాయి మా మేనత్త కూతురు" ఓ అబద్ధం ఆడేడు.
"అలాగాండీ!"
"ఆఁ అయితే ఆ అమ్మాయికి యీ విషయం తెలీదు. మా అమ్మావాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళకి మొదటినుంచీ సరిపోక మా మధ్య రాకపోకలు లేవు.
అనుకోకుండా యీ రోజు కలుసుకున్నాం.
నేనెవరో ఆమెకి నే చెప్పలేదు.
కారణమేమిటంటే, ఆమెకి ఐశ్వర్యమన్నా, ధనవంతులన్నా అసహ్యం. ఉన్నదాంట్లో తృప్తిగా క్లుప్తంగా బ్రతకటమే వాళ్ళకి తెలుసు. ఈ ఆడంబరాలూ అవీ వాళ్ళకి గిట్టవు.
నే నీ యింటి యజమాని కారు డ్రైవరునని చెప్పేను. ఆమె నమ్మింది.
ఆమె నమ్మింది.
నా వెంట వచ్చింది....
రామయ్యతో కూడా చెప్పేను రహీంతో చెప్పేను.
మీరు ముగ్గురు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆమె ఎదురుగా నన్ను "సతీష్" అనే పిలవండి.
"బాబుగారూ!" కంగారు పడిపోయింది.
"కంగారుపడొద్దు. పేరుతో పిలవకపోతే బాబూ అను ఫర్లేదు."
బదులు పలకలేదు.
"అమ్మాయ్ గారిని స్నానం ముగించమను" అని అంతలో ఏదో గుర్తుకువచ్చి కంగారుగా "జానకమ్మా! ఆమె స్నానంచేసి డ్రస్ చేంజ్ చేసుకోవడానికి వస్తే ఏముంది? ఎలా ఆమెకి చీర-రవిక...." అన్నాడు.
జానకమ్మ కూడా కంగారు పడిపోయింది.
"ఓ పనిచెయ్" అంతలో తనలో తను సర్దుకుని అన్నాడు.
"ఏమిటి బాబూ?"
"నా పూల లుంగీ, ఫుల్ షర్టు యివ్వు.... ఎలాగో టిఫిన్ ముగించేసి వెళితే తర్వాత ఆమె చీర, రవిక ఆరేసుకుంటుంది, మధ్యాహ్నానికి ఫోన్ చేసి చీరలు, రవికలు, లంగాలు, బ్రాసరీలు తెప్పిస్తాను. అలాగే టైలర్ కి కబురంపుతాను."
"అలాగే!"
అంతలోనే "జానకమ్మ పిన్నీ!" అని కేకేసింది సత్య.
కేకవెంట పరిగెత్తింది ఆమె.
గది ముందు నుంచుని "ఏమ్మా?" అంది.
"నా చీరా, రవికె అన్నీ తడిసిపోయాయ్. మార్చుకుందుకి ఏం లేదు. నీ చీర యిస్తావా?"
కంగారు పడిపోయింది జానకమ్మ.
"నా కుండేది రెండేనమ్మా. ఒకటి కట్టుకున్నా, మరోటి తడపేశాను. ఎలా?"
"మరేం చెయ్యను?" గాభరాగా అంది సత్య.
"పోనీ..."
"ఏం చెయ్యమంటావ్? ఇలాగే బాత్ రూంలో వుండి పొమ్మంటావా?"
"ఉహూఁ సతీష్ బాబు లుంగీ, ఫుల్ షర్టు వేసుకో"
"ఛ!"
"ఫర్లేదమ్మా, ఈ రోజుల్లో అది ఫేషనైపోయింది. తప్పేంలేదు"