అతడి భావం అర్థంకాక అయోమయంగా చూశాను.
"ఇదంతా ఇంతకుముందే నాకు చూచాయగా తెలుసు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశానంతే!"
ఆశ్చర్యంగా "మరి తనను మందలించలేదా?" అనడిగాను.
"మందలిస్తే మానేసే స్వభావం కాదు తనది!"
"ఇదంతా తెలిస్తే వదిలేస్తావని భయం లేదా తనకి?"
"నాకు తెలియదు. బహుశా తనిదంతా ఆలోచించి వుండదు".
నిజమే ననిపించింది. మనమో పని చేస్తున్నప్పుడు ఆ ఉద్రేకంతో దాని తర్వాతి పరిణామాలు ఆలోచించం. అయితే నాకో విషయం అర్థం కాలేదు. ఇళా చూసీ చూడనట్టు ఊరుకుంటే అది తనను మరింత ప్రోత్సహిస్తున్నట్లేగా! పరిస్థితి మరింత విషమించాక అప్పుడనుకొని ఏమి లాభం? బావ వూరుకున్నాడంటే అది ప్రపంచానికి భయపడన్నా అయుండాలి. అందగత్తైన భార్యపట్ల అమితమైన ఇష్టమైనా అయుండాలి. ఇంతకీ ఇది బావ గొప్పతనమా? బలహీనతా?
రెండింటికీ తేడా ఎంత చిన్నది?
అక్కడనుంచి లేచి వచ్చేశాను.
ఆ మరుసటి రోజు పొద్దున్నే అక్క ఇంటికొచ్చింది. బావ రాత్రే క్యాంప్ నుంచి వచ్చేశాడని తెలిసినా పెద్దగా తొట్రుపాటు పడలేదు. అమ్మ వాళ్ళింట్లో అందరూ బాగున్నారనీ, నన్నొకసారి ఇంటికి రమ్మని నాన్న చెప్పమన్నాడనీ అతి మామూలుగా కూరగాయలు కొస్తూ చెప్తుంటే, బావా, నేనూ మొహాలు చూసుకున్నాం. మనుష్యులు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంత అందంగా అతికేటట్లు అబద్ధాలు చెప్పగలరని అదే మొదటిసారి నేను చూడడం! ఎంత మంది మగవాళ్ళు ఈ విధంగా మోసపోతున్నారో కదా అని ఆ క్షణం అనిపించింది.
మరో రెండు రోజులు గడిచాయి. నేను చదువుమీద ఏ మాత్రం ఏకాగ్రత చూపలేకపోతున్నాను. అది నాకు సంబంధించిన విషయం కాకపోయినా, బావకి లేని బాధ నాకెందుకనుకోలేకపోయాను. ఆఫీసులో పనిచేస్తున్నా, కాలేజీలో పాఠాలు వింటున్నా నేను చూసిన దృశ్యమే కళ్ళముందు కదలాడుతోంది. అక్క ఇప్పుడేం చేస్తూండి వుంటుందోనన్న ఆలోచన నన్ను నిరంతరం వేధించసాగింది. ఒకరోజు ఆపుకోలేక అడిగేశాను.
అక్క ఒక్కక్షణం బిత్తరపోయింది. కానీ వెంటనే సర్దుకుని- "ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? అక్కననే గౌరవం వుందా నీ కసలు? నాకెవరితోనో సంబంధం అంటగడుతున్నావా? నా సంసారాన్ని కూలదొయ్యడానికి వచ్చావా, నువ్వు?" అంటూ సన్నగా రాగం తీయడం మొదలుపెట్టింది. నేనామెవైపే ఓ క్షణం కన్నార్పకుండా చూసి, "నాలుగు రోజుల క్రితం బావ క్యాంప్ నుంచి తొందరగా వచ్చిన రోజు నువ్వు అమ్మా వాళ్ళింటికి వెళ్ళలేదు. ఆ రాత్రి నువ్వు సుప్రభాత్ హోటల్ లో వున్నావు!" అన్నాను.
తను సన్నగా వణకడం స్పష్టంగా కనపడింది. నోటమాట రానట్టు స్తబ్దంగా చూసింది. ఎలాగో నోరు పెగల్చుకుని, "ఎవరిని చూశావో ఏమిటో! అయినా స్వంత అక్కమీద ఇదేం అనుమానమే!" అంది.
నేనూ అదే స్వరంతో "కావాలంటే ఆ రాత్రి నువ్వు పుట్టింట్లో వున్నావో లేవో అమ్మ నడుగుదామా?" అన్నాను.
ఒక్కక్షణం నిశ్శబ్దంగా ఊరుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్టు "అవును వెళ్ళాను! అయితే ఏమిటట?" అంది.
ఈసారి బిత్తరపోవడం నా వంతైంది. తనంత తెగించి అడుగుతుందని నేను ఊహించలేదు.
"ఏం, ఏం చేస్తావిప్పుడు? వెళ్ళి మీ బావకి చెప్తావా?" అంది. ఇప్పుడు తన స్వరంలో పూర్వపు ఏడుపు లేదు.
"అది కాదక్కా! ఇలా చేస్తే నీ సంసారం విచ్చిన్నమైపోదా? నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా? సుఖంగా వున్న సంసారాన్ని..."
నా మాటింకా పూర్తి కాకుండానే, "సుఖంగా వున్న సంసారమా?" అంది గట్టిగా అరుస్తున్నట్లు. "ఇదో సంసారమా? మీ బావని కట్టుకుని నేనేం సుఖపడ్డాను? ఒక అచ్చటా, ముచ్చటా? చేసేది కలెక్టరాఫీసులో నౌకరుద్యోగం! ఓకే మంచి చీర లేదు, మెళ్ళోకి రవంత బంగారం కొనలేదు. ఇటువంటి సంసారం వుంటేనేం? విచ్చిన్నమై పోతేనేం?" అంటూ చప్పున ఆగింది. మళ్ళీ ఏమనుకుందో ఏమోగానీ, "అయినా ఇదంతా మగాళ్ళకెలా తెలుస్తుందే? ఆఫీసు కెళ్ళి ఆయనెప్పుడో సాయంత్రం వస్తారు?" అంది. అక్క ఇంత దిగజారిపోయి మాట్లాడుతుందని ఊహించని నేను విస్తుపోయాను. కోపం, అసహ్యం మిళితమైన స్వరంతో- "ఎందుకు తెలియదనుకున్నావు? బావకంతా తెలుసు!" అన్నాను.
అక్క మొహం వివర్ణమైంది? "ఎలా?" అనడిగింది. "నువ్వు చెప్పెశావా కొంపదీసి రాక్షసీ!" నిప్పులు కురిపిస్తున్నట్టు చూసింది.
"లేదు. ఆ రోజురాత్రి హోటల్ కి మీరు వెళ్తుండగా చూసినప్పుడు బావ నా పక్కనే వున్నాడు".
"అంత రాత్రప్పుడు వర్షంలో మీరిద్దరూ అక్కడేం చేస్తున్నారే?"
ఆ ప్రశ్నకి నా తల తిరిగిపోయింది. నేను చెప్పిందేమైనా తలకెక్కిందా అని అనుమానం వచ్చింది. నా భావాలేవీ పట్టించుకోకుండా తను చెప్పుకుపోతోంది.
"తెలియనీ! తెలిస్తే ఏం చేస్తాడు? వదిలేస్తాడంతేగా! మరీ మంచిది. ఈ ఝంఝాటం కూడా వుండదు. నువ్వు నాతోపాటు చూసిందెవరినో తెలుసా? రాజేష్ పటేల్ అనే గుజరాతీ! పెళ్లై పదేళ్ళయినా పిల్లల్లేరు. వచ్చేస్తే బంగళా, కారు ఇస్తానన్నాడు. వందేళ్ళు ఇతనితో కాపురం చేసినా అ సుఖం దొరుకుతుందంటావా? ఏదో అమ్మా నాన్నల కోసం ఇతనితో కలిసి వుంటున్నాను. అసలందుకే అతను నా మంచితనానికి ఋణపడివుండాలి. నన్నొదిలేస్తే మళ్ళీ నా అంత అందమైన మంచి భార్య దొరుకుతుందా? ఎప్పుడన్నా నోరు తెరిచి నా సరదాలు తీర్చమని అడిగానా? బంగారంకానీ, చీరలు కానీ కొనమని అడిగానా? ఇంటెడు చాకిరీ రెక్కలు ముక్కలు చేసుకుని ఒక్కదాన్నీ చేయడంలేదూ! అసలు నా మంచితనం ఎవరైనా గుర్తించారా? అడగనీ, ఏమడుగుతాడో చూస్తాను. అప్పుడే చెప్తాను నా సమాధానం!"
సమాధానం చెప్పనవసరం లేకపోయింది.
బావే చెప్పాడు- "అవును. నేను తనని వదిలెయ్యలేను".
అక్కని నేను ఇదంతా అడిగినట్లు తనకి చెప్పకుండా వుండలేకపోయాను. అలా అడగడం ద్వారా తను తన ప్రవర్తన మార్చుకుంటుందని నేను అభిప్రాయపడ్డాను. ఇలా ఎదురు తిరుగుతుందనుకోలేదు. ఇప్పుడిక దీని పరిష్కారాన్ని బావకే వదిలెయ్యాలనిపించింది. ఈ ముసుగులో గుద్దులాట వ్యవహారాన్ని తొందరగా ముగించడం కోసమే అక్కని నేను నిలదీసినట్టు బావకి చెప్పేశాను. అయితే బావ ఇలాంటి సమాధానం చెప్తాడనుకోలేదు.
బావ చెప్పే సమాధానం నా జీవిత పంథానీ, ఆలోచనా విధానాన్నీ అథఃపాతాళానికి తోసింది. ఉన్నత శిఖరాలకి చేర్చింది. ఒడిదుడుకులకి నాంది అయింది. బావ చెప్పిన సమాధానం ఇది :