కాలేజీ వరండాలో నిలబడి వుండగా ఒక కారు వచ్చి వరండా ముందు ఆగింది. డ్రైవర్ పక్క సీట్లోంచి బావ బయటికి తలపెట్టి "వున్నావా? ఈ వర్షంలో తడుస్తూ ఎలా వెళ్ళావాని కంగారుపడుతూ వచ్చాను. రా! రా! తొందరగా!" అన్నాడు. తలకి కొంగు అడ్డు పెట్టుకుని పరుగెత్తుకుంటూ వెళ్ళి కారు వెనుక సీట్లో కూర్చున్నాను.
"కలెక్టర్ గారు ఇంటి దగ్గర దిగిపోయి, వర్షం వస్తోంది కదాని నన్నింటి దగ్గర దింపేసి వెళ్ళమని డ్రైవర్ తో చెప్పారు. నువ్విక్కడుంటావేమోనని అనుమానం వచ్చింది. ఎటూ వెళ్ళేదారి కదాని ఆగాను" చెప్తున్నాడు బావ.
చలికి ముడుచుకుని కూర్చున్నాను.
"పాపం కలెక్టర్ గారు చాలా మంచివారు కదరా!" డ్రైవర్ తో అంటున్నాడు. మంచితనానికి 'పాపం' అనే జాలిని సూచించే విశ్లేషణాన్ని ఎందుకు చేరుస్తారో అర్థంకాలేదు. నాలో నేను ఆ ఆలోచన వచ్చి సన్నగా నవ్వుకున్నాను.
మంచి తనానికి ముందు 'పాపం' అన్న విశ్లేషణాన్ని ఎందుకు చేరుస్తారో ఆ రాత్రి నా కర్థంకాలేదు.
వర్షం ఎక్కువైంది. రోడ్డుమీద మోకాలిలోతు నీళ్ళు ప్రవహిస్తున్నాయి. అంబాసిడర్ కారు ఆ నీళ్ళలో కదలనని మొరాయించింది. రోడ్డు మధ్యలో ఆగిపోయింది.
"డెల్కోలోకి నీళ్ళు వెళ్ళి వుంటాయి" అన్నాడు డ్రైవరు. "రేప్పొద్దున వచ్చి చూసుకోవాల్సిందే!"
బావ కారు దిగుతూ "ఇల్లు దగ్గర కొచ్చిందిగా! మేమెలాగో వెళ్తాంలే! నువ్వు జాగ్రత్తగా వెళ్ళు!" అన్నాడు. కారు దిగిన రెండు నిమిషాల్లో మేమిద్దరం తడిసి ముద్దయిపోయాం. వర్షం చినుకులు సూదుల్లా ఒంటిని గుచ్చుతున్నాయి. అడుగు ముందుకు వేయడం అసాధ్యమనిపించింది.
"కొంచెం ఆగి వర్షం తగ్గాక వెళ్దాం!" అన్నాడు బావ. ఇద్దరం పక్కనే వున్న గేట్లో నుంచి లోపలికి ప్రవేశించాం. అదో పెద్ద హోటలు. గేటు పక్కన కారు పార్కింగ్ రేకుల షెడ్ వుంది. నా చీర ఒంటికి అతుక్కుపోయింది. పార్క్ చేసి వున్నకారులో ఇద్దరు డ్రైవర్లు ఇటువైపే చూడడంతో మరింత ముడుచుకుపోయి ఒక మూల ఇబ్బందిగా నిలబడ్డాను.
వర్షం కొద్దిగా తగ్గడం ప్రారంభించింది.
"ఇల్లంతా కురుస్తుందో ఏమో!" అన్నాడు బావ. నేను మాట్లాడలేదు. "పాపం! తనొక్కతే వుండి వుంటుంది?" స్వగతంగా అన్నాడు.
"అక్క ఇంట్లో లేదు. అమ్మ వాళ్ళింటికి వెళ్ళింది. నువ్వు ఈ రోజు వస్తావనుకోలేదు!" వివరిస్తున్నట్లుగా అన్నాను.
"పోన్లే పాపం! అదే మంచిది. ఇంతరాత్రి ఈ వర్షంలో ఒంటరిగా వుండి వుంటే భయపడేది!" అని, ఓ క్షణం ఆగి- "అక్కడ మరీ కష్టం కదా! ఈ వర్షంలో ఆ పాకలో అంతమంది ఎలా సర్దుకుంటారు?" చూరునుంచి పడుతున్న వర్షపు ధారలకేసి చూస్తూ అన్నాడు.
నాకెందుకో చాలా ముచ్చటగా అనిపించింది- వర్షంలో చలికి వణుకుతూ అక్కడి భార్యగురించి ఆలోచిస్తున్నాడు బావ. వాళ్ళకి పెళ్లై మూడు సంవత్సరాలు కావస్తోంది. పదింటికి వెళ్ళి క్రమం తప్పకుండా అయిదింటికి వచ్చేస్తాడు. భార్యతో కబుర్లు చెప్తాడు. కొద్దిగా డబ్బులుంటే సినిమాకి తీసుకెళ్తాడు. ఒంట్లో కాస్త నలతగా వుంటే వంట పని ముత్తుకోనివ్వకుండా తనే చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే పెళ్ళి చేసుకోకూడదన్న నా నిర్ణయం బావని చూసిన తర్వాత చాలా వరకు సడలిపోయింది.
"వర్షం తగ్గినట్టుంది, బయల్దేరదామా?" - బావ మాటలతో ఆలోచన్లలోనుంచి తేరుకుని అడుగు ముందుకు వేశాను. ఒక కారు మామీద నీళ్ళు జల్లుకుంటూ ముందు కెళ్ళి హోటల్ పోర్టికోలో ఆగింది. బావ ఆ డ్రైవర్ ని సన్నగా తిడుతూ బట్టలమీద పడిన బురదను తుడుచుకుంటున్నాడు. అటు చూసిన నేను అడుగు ముందుకు పడనట్టు ఆగిపోయాను. భూమి రెండుగా చీలిపోతున్నట్లనిపించింది. ఆకాశంలో మెరిసిన మెరుపు నా కళ్ళని బైర్లుకమ్మేలా చేసింది. ఆ అంధకారం మెరుపువల్ల కాదు, నేను చూసిన దృశ్యం వల్ల! చప్పున తలతిప్పి బావవైపు చూశాను. బావ కూడా అటే చూస్తున్నాడు.
హోటల్ పోర్టికోలో ఆగిన కారు వెనుక సీట్లోనుంచి దిగిన సూటు వ్యక్తి మరోవైపు నుంచి దిగిన స్త్రీ భుజాల చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకెళ్తున్నాడు.
ఆ వర్షపు ధారల మధ్య పోర్టికోలైట్ల మసక వెలుతురులో కూడా ఆమెను నేను గుర్తుపట్టాను. బావ కూడా గుర్తుపట్టాడని వివర్ణమైన అతని మొహం చెప్తోంది.
* * *
బావ ఏడుస్తున్నాడేమోనని అనుమానం వచ్చింది. కానీ లోపలి గదిలోకి ఎలా వెళ్ళను? వెళ్ళి ఏమని ఓదార్చను? గట్టిగా కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాను. కానీ నిద్ర రాలేదు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇది!
అక్కడ ఆ దృశ్యాన్ని చూసి మేమిద్దరం ఇంటికెలా చేరుకున్నామో మాకే తెలియదు. వర్షపు చినుకుల శబ్దం మా నిశ్శబ్దానికి నేపథ్య సంగీతమైంది. ఇంటితాళం తీసి అతడు తన గదిలోకి మౌనంగా వెళ్ళిపోయాడు. తన గది, నా గది అని వేర్వేరు గదులున్నా పెద్ద భవంతేమీ కాదు అ ఇల్లు. లోపలి గదిలో వాళ్ళు పడుకుంటే బయట వరండాలో నేను పక్కేసుకుంటాను. అందుకే లోపల అతడి కదలిక నాకు స్పష్టంగా తెలుస్తోంది.
నా ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి. బావ, నేను ఆఫీసుల కెళ్ళిపోయేవాళ్ళం. కాలేజీ లేనప్పుడు నేను తొందరగా ఇంటికొచ్చేస్తే గుమ్మానికి తాళం వేసుండేది. కారణం ఇప్పుడర్థమవుతోంది. అంతేకాదు, కాస్మటిక్స్ ఎలా వాడగలుగుతోందో, అంత ఖరీదైన చీరలు ఎలా కట్టగలుగుతోందో కూడా అర్థమైంది.
మరి బావకి అనుమానం రాలేదా?
వచ్చుండదు. ప్రత్యక్షంగా చూసేవరకూ నాకే ఈ అనుమానం రాలేదుకదా! నాకెందుకో చాలా కసిగా, అసహ్యంగా అనిపించింది. అక్కకేం తక్కువైందని? బావలాంటి మొగుడు దొరకడం ఎంత అదృష్టం? అలాంటి మొగుడి కోసమేగా పెళ్ళికాని ఆడపిల్లలు నోములూ, వ్రతాలూ చేసేదీ! మగాళ్ళు ఇలా వుండాలనేగా ఆడాళ్ళు గోల పెట్టేదీ!
లోపల మళ్ళీ కదిలిన శబ్దం వినిపించింది. ఇక ఆగలేక లోపలికెళ్ళాను. గోడ కానుకుని మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని కూర్చుని వున్నాడు. నా అడుగుల శబ్దానికి తలెత్తి చూశాడు. వెళ్ళి మంచంమీద మరో అంచున కూర్చున్నాను. ఇద్దరి మధ్యా కొద్దిసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది.
"నువ్వు....నువ్వు..."
ఆ తర్వాతేం మాట్లాడాలో తోచలేదు. బావ నా మాటలు వింటున్నాడో, లేదో కూడా తెలియదు. అభావంగా అలా కూర్చునే వున్నాడు.
"....అక్కనేమీ చేయకు, బావా..!" కష్టపడి వాక్యం పూర్తిచేశాను. వేడుకోలు, మొహమాటం, అభ్యర్థన అన్నీ నా కంఠంలో ప్రతిధ్వనించాయి. అప్పుడు బావ నెమ్మదిగా నావైపు తిరిగి అదే అభావపు చూపుతో- "ఏం చేస్తాను?" అన్నాడు.