Read more!
Next Page 
రుద్రనేత్ర పేజి 1

                                 

 

                         రుద్రనేత్ర

                                            - యండమూరి వీరేంద్రనాథ్


    "సార్.... అన్నదామె బెరుగ్గా.

 

    సర్పభూషణరావు కళ్ళు విప్పాడు. కిటికీ తెరల మధ్య నుంచి పడే ఎండకి అతడి బుగ్గమీద లిప్ స్టిక్ చార మెరిసింది.

 

    "....టైమైంది" అన్నదామె.

 

    అది చిన్న గది - కంపార్ట్ మెంట్ లా వుంది.

 

    కానీ అందులో ప్రతి వస్తువుకి ఒక స్పెషాలిటీ వుంది. మధ్యలో గుండ్రటి మంచం మీదవున్న నీలం కాశ్మీరు దుప్పటి, క్రింద వేసిన జపనీస్ తీవాచీకి 'మ్యాచ్' అయింది.

 

    మంచం పక్కనే వున్న ప్లవర్ వేజ్ లో ఆ రోజే స్విట్జర్లాండ్ లో పూసిన స్నో ప్లవర్స్ వున్నాయి.

 

    ఆ పువ్వులు జ్యూరిచ్ లో మార్చబడ్డాయి.

 

    సర్పభూషణరావు లేచి ఫ్రిజ్ లోంచి నీళ్ళు తీసుకుని, రెండు గుక్కలు తాగాడు. ఆ రూంకి అనుకునే బాత్  రూం వుంది. బాత్ టబ్ లోకి వెళ్ళబోయేముందు సెక్రటరీ వచ్చి అతడి టర్కీ గౌన్ తీసింది.

 

    అతడు భారీ  మనిషి. అరడుగుల ఎత్తుంటాడు. చెవుల దగ్గర జుట్టు కాస్త తెల్లబడిందంతే. వయసు యాభై సంవత్సరాలు. అటు తిరిగి వున్నాడతను. వీపు విశాలంగా కనపడుతుంది.

 

    "షల్ ఐ బేత్ యూ సర్....?" నమ్రతగా అడిగింది.

 

    "నో థాంక్యూ....." అంటూ అతడు బాత్ టబ్ లోకిదిగాడు. గోరువెచ్చటి నీటిలో కలిసివున్న 'ప్యారిస్ లవ్' పరిమళాన్ని ఆస్వాదిస్తూ రెండు నిమిషాల్లో స్నానం ముగించాడు.

 

    అతడి సెక్రటరీ  సూట్  తీసి రెడీగా వుంచింది. అతడు దాన్ని ధరించి వెళ్ళి కూర్చీలో కూర్చున్నాడు. కిటికీ పక్కనున్న తెర తొలగించి బయటకు చూసాడు. అక్కడక్కడ మేఘాలు దూరంగా కనపడుతున్నాయి. వేగంగా వెనక్కి కదుల్తున్నాయి.

 

    "జిన్  సర్......?" అతడికి సాయంత్రం జిన్ తాగడం అలవాటు. కానీ, ఈసారి  "వద్దు...... టీ....." అన్నాడు.

 

    ఆమె కాస్త తటపటాయించి "ఇండియన్....?" అని అడిగింది.

 

    "కాదు చైనీస్ టీ"  అతడి అలవాట్లు ఎలా వుంటాయో అతడికే తెలీదు. ఆమె పక్కనున్న వరండాలోకి వెళ్ళింది. వెనుకే తలుపు మూసుకుంది.

 

    న్యూయార్క్ కేసు తాలూకు కోర్టు కాగితాలు చదవడం ప్రారంభించాడు. అందులో ప్రాముఖ్యత ఏమీలేదు. గెలుపు తాలూకు ఉత్సాహం అది. కొంచెం సేపు చదివి ఆ కాగితాలు పక్కన పడేసి ఎదుటి సీటు మీద కాళ్ళు పెట్టి సిగార్ వెలిగించాడు.

 

    నలుగురు కూర్చోవడానికి వీలుగా సీట్లున్నాయి. మధ్యలో టేబిల్ మీద ఆ రోజు తాలూకు విదేశీ పేపర్లున్నాయి. న్యూయార్క్ టైమ్స్' లండన్ హెరాల్డ్ వగైరా పత్రికలు. న్యూయార్క్ టైమ్స్  మొదటి  పేజీలో ఎడమ వైపు వున్న వార్తమీద అతడి దృష్టి పడింది.

 

    సన్నగా నవ్వుకున్నాడు అతడు.


                                                          *    *    *    


    విమానాశ్రయం తాలూకు గ్రౌండ్ కంట్రోలర్ కి పైలెట్ నుంచి అనుమతి కోసం వైర్ లెస్ వచ్చింది. "వాతావరణ క్లియర్ గా  వుంది. మీరు దిగవచ్చు" అన్నాడు అనుమతిస్తూ.

 

    కాలక్షేపం కోసం వచ్చి పక్కన కూర్చున్న ఆఫ్ డ్యూటీ ఆఫీసర్ అడిగాడు "ఇప్పుడే విమానం  వుంది...?"

 

    "ఎయిర్  ఇండియా కాదు. ఛార్టర్ ప్లేన్"

 

    "ఛార్టర్ ప్లేనా.....?" ఆశ్చర్యంగా అడిగాడు. "స్వంత విమానం భరించగలవా రెవరబ్బా.....?"

 

    "సర్పభూషణరావనీ..... ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీయలిస్ట్."

 

    ఆకాశంలో దూరంగా మినుక్కుమంటూ విమానం చిన్న చుక్కలా వస్తూ కనిపించింది.

 


                                      *    *    *

 

    ఆమె టీ తీసుకొచ్చి అతడికిచ్చింది.

 

    "ఇంకా ఎంతసేపు.....?" అని అడిగాడు.

 

    "ఇంకో అయిదు నిమిషాలు సర్" అంది. అతడు కిటికీ తెర తొలగించిమళ్ళీ చూసాడు. మేఘాల మధ్య నుంచి విమానం నెమ్మదిగా దిగుతూంది. క్రింద నగరం కనపడుతూంది.

 

    నగరపు ఉత్తర భాగాన వున్న ఇండస్ట్రీయల్ ఎస్టేట్ పై నుంచి దిగుతూంది విమానం, ఆ ఎస్టేట్ లో నాలుగోవంతు ఫ్యాక్టరీలు అతడివే. ఎత్తయిన ఫ్యాక్టరీ గొట్టపు పొగలు నల్లగా గాలిలో కలుస్తున్నాయి. పొగాకు పురుగుల్ని చంపే ఇంటాజిన్ -5 మందు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ అది.

 

    అతడు కిటికీ తెర మూసేసి పేపరు చేతిలోకి తీసుకున్నాడు.

 

    సెక్రెటరీ వచ్చి  అతడు ఖాళీ చేసిన  కప్పు తీసుకెళ్ళిపోయింది. పైలెట్  కంఠం మైకులో నమ్రతగా వినిపించింది. "సర్.... మరో  రెండు నిమిషాల్లో మనం దిగబోతున్నాం."

 

    అతడు లేచి మంచం దగ్గరికి వెళ్ళాడు. ఆ గదికి, పైలట్ కాబిన్ కి మధ్య ఒక చిన్న రూము వుంది. అందులో అతడి పి.ఏ. ఎయిడీ కూర్చుని వున్నారు. వెనుక వైపు వాష్ బేసిన్ దగ్గర అతడి సెక్రెటరీ అద్దంలో చూసుకుంటూ లిప స్టిక్  సరిచేసుకుంటూంది. ఎర్రటి స్కర్ట్ లో ఆమె తెల్లటి శరీరం మెరుస్తూంది.

Next Page