Previous Page Next Page 
అనైతికం పేజి 36


    "తనని వదిలెయ్యవచ్చు. అదేమీ పెద్ద విషయం కాదు. మన కులంలో అయిదారువేలు భరణం ఇస్తే పెద్దలే ఈ విషయాన్ని సెటిల్ చేస్తారు. తర్వాత ఏమవుతుంది? నేనింకో అమ్మాయిని చేసుకోవాలా? ఆవిడెలాంటి దవుతుందో! సరే, అ సంగ్తలా వుంచు. మీ అక్క ఏమవుతుంది? ఇంకో పెళ్ళి చేసుకుంటుందా? ఆవిడన్నట్టు ఏ డబ్బున్నవాడికో ఉంపుడుకత్తెగా వుండిపోతుందా? వయసులో వున్నంతకాలం బాగా డబ్బిస్తే యివ్వచ్చు. తెలివితేటలు లేనిదైతే ఆ డబ్బు మిగుల్చుకోదు. ఎంతకాలం వుంటుంది వయసు? అందం? ఈలోగా ఇంకో తెలివైనవాడి వలలో పడిందంటే ఏ రెడ్ లైట్ ఏరియాలోనో తేల్తుంది. నేను ఆలోచిస్తున్నది నా గురించి కాదు, తన గురించి! పెళ్ళంటే ఇంతేనా! మంగళసూత్రం కట్టడం, నచ్చకపోతే విడిపోవడం. భార్యభర్తలన్నాక ఎన్నో గొడవలొస్తూవుంటాయి. ప్రతిదానికీ విడిపోవడమే పరిష్కారమా? తన కళ్ళముందు ఇప్పుడేవో మత్తుపొరలున్నాయి. కొంతకాలానికి అవి పోతాయి. ఎప్పటికైనా మొగుడి విలువ గుర్తిస్తుంది. నేను తనని మార్చుకోగలనని నమ్మకం నాకుంది. పెళ్లైనప్పుడు అందంగా వున్న పెళ్ళాం తర్వాత ఏ మశూచోపోసి వికృతమైందనుకో! ఇంకో అందమైన అమ్మాయి కోసం మొగుడు పెళ్ళాన్నొదిలేయడు కదా! ఇదీ అంతే! ఇప్పుడు దాని మనసుకి మశూచి పోసింది. తొందరలోనే అది పోతుందని ఆశిద్దాం!"

 

    దాదాపు నలభై సంవత్సరాల క్రితం మాట ఇది! ప్రస్తుతం వాళ్ళ కిద్దరు పిల్లలు. పెద్దాడుద్యోగం చేస్తున్నాడు. అక్కయ్య మారింది. అయితే ఆ మార్పు మానసికమైనది కాదు. శారీరకంగా ఆకర్షణ కోల్పోవడం వల్ల వచ్చిన మార్పు.

 

    సంసారంలో కేవలం పురుషులు మాత్రమే భార్యల్ని శారీరకంగా, మానసికంగా బాధపెడతారు అనుకోకూడదని చెప్పడానికి అక్కయ్యే మంచి ఉదాహరణ! సంసారం అనే సామ్రాజ్యంలో ఎవరు బలవంతులైతే వాళ్ళు బలహీనులని అణగదొక్కెయ్యడానికి ప్రయత్నిస్తారు. సాధారణంగా 'డబ్బు సంపాదన' అనే బ్రహ్మాస్త్రం పురుషుడి దగ్గర వుంటుంది. కాబట్టి ఈ పోరాటంలో అతడిది పైచేయి అవుతుంది. అందం, నోరు, మాటకారితనం, పుట్టింటి తరఫు నుంచి అంగబలం, అర్థబలం వున్నదైతే పెత్తనం స్త్రీ దవుతుంది.

 

                                                                   3

 

    తన విషయం నాకు తెలిసిపోయిందని తనకి తెలిసిన తర్వాత నా పట్ల అక్కయ్య ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. బావ మంచితనాన్ని చాతకానితనంగా అపార్థం చేసుకుని మరింత విశృంఖలంగా ప్రవర్తించసాగింది. ఒకరోజు మా ఆఫీసుకే సరాసరి ఆ పటేల్ ని తీసుకువచ్చింది.

 

    "రావే! హోటల్ కెళ్ళి కాఫీ తాగొద్దాం. ఆయన చాలా మంచివారు! నీకు పరిచయం చేస్తాను!" నేను నిర్ద్వంద్వంగా తిరస్కరించాను.

 

    "నీకు బుద్ధి లేదే!" అంది ఆ రాత్రి ఇంట్లో. "పెళ్ళి చేసుకుని కాపురం చేద్దామనుకుంటున్నావా చెయ్యవే! ఎవడు కాదన్నాడు? కానీ ఎవడొస్తాడు? ఓ గుమాస్తా దొరుకుతాడు. నీ జీవితం అలాగే గడిచిపోతుంది".

 

    "నాకా జీవితం చాలు!" అన్నాను ముభావంగా.

 

    "ఏదో చెల్లెలివని నీ బాగుకోరి చెప్తున్నాను. ఇదంతా నేను చెప్పడం నీకు ఆశ్చర్యంగా వుండొచ్చు. ఇదే ఏ మగవాడో చెప్తే మీరంతా చెవులప్పగించి వింటారు. మా రాజేష్ పటేల్ ఎప్పుడూ అదే చెప్తూంటాడు. పెళ్ళైనప్పుడు అతడు స్టోర్స్ లో గుమాస్తా. ఎంతో కష్టపడి పైకొచ్చాడు. పెళ్ళాం దగ్గర సుఖంలేదు. అందుకే నాలో సుఖాన్ని వెతుక్కున్నాడు. నాకు నా సంసారంలో సుఖం లేదు. పటేల్ కి డబ్బుంటే నాకు అందం వుంది!" అని ఓ క్షణం ఆగింది.

 

    "...పెళ్ళాం దగ్గర సుఖంలేని మగాడు సెకండ్ సెటప్ పెడితే ఊరుకునే ఈ సంఘం అదే పని నేను చేస్తే ఎందుకు ముక్కున వేలేసుకుంటుంది? డబ్బుతో మగాడు సుఖం కొనుక్కుంటే నేను నా అందంతో కొనుక్కుంటున్నాను. నా మొగుడికి దేవుడు డబ్బు, అందం ఇవ్వలేదు కాబట్టి వాడలా చూస్తూ వుండాల్సిందే! మొగుడికి ఇంకో ఆడదానితో సంబంధం వుందని తెలిసినా ఎంతమంది భార్యలు కుక్కిన పేనల్లే పడి వుండటం లేదూ! అలాగే నా మొగుడూ పడుంటాడు!" అంటూ చప్పున లేచి, ట్రంక్ పెట్టెలోనుంచి బాటిల్ తీసింది. అందులో కొద్దిగా ఫారిన్ విస్కీ వుంది. దాంట్లోనే నీళ్లు కలుపుకుని కొద్దిగా తాగింది. తను ముందు మాట్లాడిన మాటల్ని బట్టి నాకు కొద్దిగా అనుమానం వచ్చినా, ఇప్పుడది పూర్తిగా స్థిరపడింది. మరో గుటక వేసి చెప్పింది- "ఇదే ఆడవాళ్ళ సమస్యకి పరిష్కారం. నేను చెప్పింది ఒప్పుకుంటే అడదానికింకే సమస్యా వుండదు. వాడు బలవంతుడు కాబట్టి బయట చేస్తాడు. వాడితో కలిసుండాలంటే మనం రహస్యంగా చెయ్యాలి. నీకు పెళ్ళవలేదు కాబట్టి మొగుడి గురించీ, సంసారం గురించీ ఏదో గొప్పగా వూహించుకుంటున్నట్టున్నావ్. సంసారంలోకి దిగితే అదెంత నరకమో తెలుస్తుంది. అంతవరకూ ఎందుకూ? నువ్వు ఎంతో మంచివాడనుకుంటున్న నీ బావనే నువ్వు చేసుకునుంటే ఆరునెలలు తిరిగేసరికల్లా నేను చెప్పినదంతా నిజమేనని నువ్వే ఒప్పుకునే దానివి!"

 

    నాకు భయం వేసింది. తాగుతున్న అక్కనిచూసి కాదు. అక్క భావాల్లోని వైపరీత్యాన్ని చూసి! స్త్రీలో పెరుగుతున్న అసహనానికి అక్క ఆర్గ్యుమెంట్ పరిష్కారం కాకూడదని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించాను. బావలాంటివాడే భర్తగావస్తే నేనీ విధంగా ఆలోచించను. ఉన్నంతలో సంతృప్తిగా స్వంతం చేసుకుంటాను.

 

    నా ప్రార్థనని దేవుడు ఎంతవరకు విన్నాడో, తెలియదుకానీ సురేష్ ని నాకు పరిచయం చేశాడు.

 

                                      *    *    *

 

    "మిమ్మల్ని బ్రాంచ్ మేనేజర్ గారు రమ్మంటున్నారు!" అన్నాడు ప్యూన్ వచ్చి.

 

    ఒక్కక్షణం నా గుండె ఆగినట్టనిపించింది. సాధారణంగా మేనేజర్ తో డైరెక్ట్ సంబంధం మాకు వుండదు. రిసెప్షన్ లో ఏదైనా పొరపాటు చేశానేమోనని భయం వేసింది. తడబడుతున్న అడుగులతో మేనేజర్ రూమ్ లోకి ప్రవేశించాను. "మిమ్మల్ని మన మేనేజింగ్ డైరెక్టర్ గారు ఓసారి రమ్మన్నారు!" అన్నాడు బ్రాంచ్ మేనేజర్.

 

    నేనతనివైపు అయోమయంగా చూశాను. మా మేనేజింగ్ డైరెక్టర్ అంటే దాదాపు యాభై కోట్లకి అధిపతి. ఈ ఊళ్ళోనే ఆయనకీ పది పన్నెండు కంపెనీలు వున్నాయి. నేను పనిచేస్తున్నది ఆయన కంపెనీల్లో అతి చిన్నది.

 

    మా ఆఫీసులో ఎం.డి. గురించి చాలా చెప్పుకుంటారు. మంద్రాసులో బ్రేక్ ఫాస్ట్ చేస్తే బొంబాయిలో లంచ్ చేస్తాడట. మ బ్రాంచ్ మేనేజర్ లాంటివాడే ఆయన్ని కలుసుకోవాలంటే వారం రోజుల ముందు అప్పాయింట్ మెంట్ తీసుకోవాలి. అలాంటి వ్యక్తి నన్నెందుకు కలుసుకోమన్నాడో అర్థంకాలేదు. ఎందుకో తెలియదు. కానీ ఇంటర్వ్యూలో నాకు ఉద్యోగం నిరాకరించిన అప్పటి నామాల మేనేజింగ్ డైరెక్టర్ గుర్తొచ్చాడు.

 

    మరుసటి రోజు పొద్దున్న పదింటికి ఆయన ఆఫీసుకి వెళ్ళాను. దాదాపు పన్నెండు అంతస్తుల భవంతి అది. అన్నీ ఆయన ఆఫీసులే! ఆయన చాంబర్ పన్నెండో అంతస్తులో వుంది. లిఫ్ట్ ఎక్కి అక్కడికి వెళ్ళాను. విశాలమైన హాలు. అద్దాలవతలి నుంచి పూలమొక్కలు కనపడుతున్నాయి. చుట్టూ సోఫాలువేసి వున్నాయి. నలుగురైదుగురు విజిటర్స్ అక్కడ కూర్చుని వున్నారు. అందులో ఒకాయాన్ని నేను గుర్తు పట్టాను. తరచు పేపర్లో ఫోటో పడుతూంటుంది. అతడో పెద్ద పారిశ్రామికవేత్త. రాజ్యసభ మెంబరు.

 Previous Page Next Page