Previous Page Next Page 
రాగవాహిని పేజి 33

    "ఊఁ"

    "పలకవేం."

    "ఓకే!" ఇదిగో చెక్ బుక్ ఆమె ఇష్టం. షేర్స్ ఆమె పేర్ననేగా వుండటం. ఆమె ఎన్నయినా తీసికోనీ" చెక్ బుక్ సత్యకీ తనకీ మధ్యన వుంచేసి అన్నాడతను.

    "ఆల్ రైట్! చెక్ బుక్ అందుకోండి సిస్టర్" అన్నాడు మనోహర్. అప్రయత్నంగా చెక్ బుక్ అందుకుని చూసింది.

    కృష్ణ సంతకంచేసే వుంచాడు. ఫిగర్ వేయటమే తరువాయి.

    ఒక్కక్షణం ఆమెలో కొంటెతనం మముపిల్లలా కదలాడింది. మరుక్షణంలో అతన్నో ఆట పట్టించాలనుకుంది.

    అతనందించిన పెన్ తీసుకుని చకచకా చెక్ రాసేసి చించి మనోహర్ చేతికి ఇచ్చేసింది.

    చూసుకున్నా మనోహర్ "మైగాడ్" అని అరిచాడు.

    "ఏమిటేమిటి" అని అడిగేరందరూ.

    "ఫైవులాక్స్" మెల్లిగా అన్నాడు మనోహరు.

    "అయితే లయన్ షేరు ఆవిడదేనన్నమాట."

    ఎమౌంటు విన్న కృష్ణ షాకవుతాడనుకున్న సత్య తనే షాక్ అయింది అతని చిరునవ్వు చూసి.

    "దట్సాల్ మేం వస్తాం" మీరు డాన్సు ప్రోగ్రాంకి వెళ్ళిరండి. థాంక్సు సిస్టర్. ఒక థియేటరుకి నీ పేరే పెట్టిస్తాను సత్య అని. మరో థియేటరుకి కృష్ణ అని పెడతాను. భార్యాభర్తలే కాదు థియేటర్స్ కూడా ప్రక్కప్రక్కనే వుండనీ. మార్వెలస్ గా వుంటుంది" అన్నాడు మనోహరు.

    "థాంక్సు" కృష్ణే అన్నాడు.

    "మెనీ థాంక్సు" అంది సత్య.

    వాళ్ళంతా వెళ్ళిపోయారు.

    తల వంచుకుని వున్న సత్యని చూసి మామూలుగా ఏమాత్రం భేదం కనిపించకుండా "మనం వెళదామా!" అని అడిగాడు కృష్ణ.

    "ఊఁ" అప్రయత్నంగా అంది సత్య. తర్వాత నాలిక్కరచుకుంది. ఆమెకి ఇప్పుడు లయన్స్ కి వెళ్ళాలనిలేదు. పైకి వెళ్ళిపోయి ఆరుబయల్లా కూర్చుని ఊయల వూగుతూ అతనితో తమాషాగా పోట్లాడాలని వుంది. కానీ ఆమె ప్రయత్నం లేకుండానే వూకొట్టింది.

    "పద" అని కదిలేడతను.

    ఆమె అనుసరించింది. మరో అయిదు నిమిషాలు తరువాత ఇంపాలా కారు గేటుదాటి దూసుకుని వెళ్ళింది.

                                                           *        *        *

    అద్భుతమైన ఆ భరతనాట్యాన్ని చూసి పరవశించిపోయింది సత్య. ఆ ఆనందంతో ఆమె తాత్కాలికంగా సతీష్ పై వచ్చిన కోపాన్ని మరచిపోయింది ఆమెకు. ఆ సంఘటన జరిగిన తర్వాత అతనిపై చెప్పరానంత కోపం వచ్చింది. తనని వొక రకంగా మభ్యపెట్టి మరో రకంగా మోసం చేసిన సతీష్ అంటే కొద్దిగా అసహ్యం కలిగింది.

    కానీ....కానీ....ఆ మనుషులు....ఆ మాటలు.... ఆ సన్నివేశం తననేమీ చేయలేని స్థితిలో వుంచేయి. నిస్సహాయురాలై పోయింది.

    అందుకే ఆ సినీ కాంప్లెక్సు నిర్మాణానికి అయిదు లక్షలు శేర్ ఇచ్చేసింది. అయినా అదే శిక్ష. కోపంతో కోడలుకంటే కొంపంతాపిల్లలు నిండే రన్నట్టుగా అదీ అతనికి లాభదాయకమే!

    హేమమాలిని నృత్యం చూసిన మనస్సుతో అతన్నేమీ అనలేక పోయింది. ఎంత అనుకున్నా అతనిపై కోపం తెచ్చుకోలేకపోయింది. ఎంత అద్భుతంగా వుంది ఆమె నృత్యం ఇన్ని లక్షలమంది మనుషుల్ని రంజింపచేస్తున్న ఆమె జన్మ ధన్యం. అలాంటి పుట్టుక భగవద్పృసాదం.

    "సత్యా!"

    ఉలిక్కిపడింది ఆ పిలుపుకి.

    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?" వెళదామా ఇకలేకపోతే ఏదయినా హోటల్ కి వెళ్ళి లైట్ గా రిఫ్రెన్ అయి వెళదామా?"

    "ఊహుఁ యింటికే వెళదాం!"

    ఒక్కక్షణం ఆమెవైపు చూసి "సరే" అన్నాడు స్టిరింగ్ ముందు కూర్చుంటూ. అతను డోర్ తీయగానే తనూ కారులో కూర్చుంది సత్య. అతని ప్రక్కనే.

    ప్రవాహంలాగా వస్తున్నారు జనం.

    కారు కదిలేందుకు వీలు పడటంలేదు.

    అందరూ నాట్యాన్ని గురించీ, హేమమాలిని గురించీ మాటాడుకుంటున్నారు. ఇళ్ళకి వెళ్ళాలని త్వరత్వరగా వెళుతున్నారు. హడావిడి. అంతా తొడతొక్కిడి.

    తెల్లని నియాన్ కార్ల వెలుతురులో మనుషులంతా పాల సముద్రంలో నడుస్తున్నట్లుగా, క్షీరాభిషేకం చేయబడ్డట్టుగా వున్నారు.

    అరగంటలో అంతా వెళ్ళిపోయారు.

    గేటు బయట నుంచున్నారిద్దరు.

    "చూశావా!"

    "వూఁ"

    "వాడే మా బాస్. మా యజమాని. నన్ను ఉద్యోగంనుంచి తీసివేసిన దుర్మార్గుడు. నేను పగబట్టిన వ్యక్తి! బ్రతికి వున్నందుకు అతనిపై పగ తీర్చుకుంటేనే నా బ్రతుక్కి ఫలితం."

    "ఫణి! నీ పగ నే తీర్చి పెడతాను. నీ యజమానిపై నీ కసి తీరుస్తాను. నా ప్రాణంపోయినా ఫర్వాలేదు. కానీ నీ పగ తీరుస్తాను"

 Previous Page Next Page