ఆమె సున్నితం సత్య చేతులందుకుంది.
ఆమెని సారసాక్షి పరిచయం చేసింది. ఈమె మీనాక్షి సోమసుందరం. ఆర్టీసీ డిపో మేనేజరుగారి భార్య. ఈమె పేర గ్రేప్ గార్డెన్స్ వున్నాయి. అందులో ఇక్కడున్న అందరికి షేర్స్ వున్నాయి."
మరో స్త్రీ ఆమె భర్తా లేచి నుంచున్నారు.
"ఆమె వాణి, అతను వాసుదేవ్. ఫిల్మిండస్ట్రితో బిజినెస్ మాగ్నెట్ ఈ జిల్లాకి డిస్ట్రిబూషన్ తీస్తూ వుంటాడు. జిల్లాలవారీ కొనుగోలు అతనే ప్రారంభించేడు. ఈ ప్రాంతంలో తక్కువ డబ్బుతో ఎక్కువ లాభాలు సంపాదిస్తాడు. ఈ వూళ్ళో గుంటూర్లో, వైజాగ్ లో, నెల్లూరులో అతనికి థియేటర్స్ వున్నాయి. తిరుపతిలో సినీ కాంప్లెక్స్ థియేటర్స్ ప్లాన్ చేస్తున్నాడు. అందరు షేర్స్ తీసుకుంటున్నాం. మీ వారిని మీ పేర షేర్ తీసుకోమని అడగాలని వచ్చాం.
మీ పేరు కూడా అందంగా వుంది. మీరేకాదు...." మృదువుగా నవ్వుతూ అంది వాణి. వ్యాపార రంగంలో దిగేక నవ్వుకి కూడా విలువ హెచ్చింది. ఎప్పుడనుకుంటే అప్పుడు సమయానికి తగ్గట్టుగా నవ్వటం అలవాటు చేసుకోవాలి కాబోలు!"
"వాణి! చూశావా భగవంతుడి జోక్ ఇద్దర్నీ కలపటమే కాదు. పేర్లన్నీ జత చేశాడు. ఏమండీ మీ పేరు సత్య అంటే సత్యవతా? సత్యవాణా! సత్యకుమారా"
"సత్యభామ!"
"ఓహ్! ఓహ్! వాటే మ్యాచ్! అందరూ కోరస్ గా అరిచేరు.
"సత్యభామ? సతీష్ కృష్ణ" మరోసారి ఇద్దరి పేర్లూ కలిపి పలికేడు వాసుదేవ్.
"ఎక్స్ క్యుజ్ మీ! అందరూ పరిచయం అయ్యేరు. నన్ను నేనే పరిచయం చేసుకోనీండి. నా పేరు మనోహర్! వయస్సు ఇరవై రెండు. పెళ్ళి కాలేదు ఇక్కడ డియస్పీగా పని చేస్తున్నాను. నాకు వ్యక్తులతో పరిచయం చేసుకోవడం చాలా ఇష్టం చూడండి. నేను మాటలు తూచి మాటాడతాను. ఏమన్నాను. నాకు వ్యక్తులతో పరిచయం చేసుకోవడం దట్సాల్ మామూలు ఆర్డినరీ ప్రజతో కాదు. మీరూ! మీ స్టయిల్ నన్నాకర్షించాయి."
చేతులు జోడించి అతను అంటూంటే వణికిపోయింది సత్య. పెదాలు వణికేయి. అప్రయత్నంగా నమస్కరించింది.
"జస్ట్ వన్ మినిట్! ఆవిడ డ్రెస్సింగ్ కి వెళుతోంది. అంతలోగా మనం కాఫీ తీసుకుందాం!" అన్నాడు సతీష్!
* * *
నేరుగా బాత్ రూంలో దూరి షవర్ తిప్పుకునేదాకా సత్య మనస్సు శాంతించలేదు. పైనుంచి ధారగా చన్నీళ్ళు పడుతూ వుంటే దిమ్మెక్కిన ఆమె తల మెల్లిగా మామూలు స్థితికి వచ్చింది.
ఇంతవరకూ ఆలోచనా రహితంగా వున్న ఆమె మనసు చైతన్యాన్నందుకుంది. ఒక్కసారిగా ఆలోచనలు కృష్ణపైకి మళ్ళేయి.
"ఎంత ఆట ఆడేడు. అతనేనా కృష్ణ. ఊహుఁ నమ్మటానికి బుద్ధి పుట్టడంలేదు. సతీష్ తో చనువుగా వున్నట్టు అతనే కృష్ణ అని తెలిశాక అదే చనువు చూపగలుగుతుందా తను?"
ఊహుఁ
కళ్ళెత్తి అతన్ని చూడాలంటేనే సిగ్గు....
వాళ్ళేమిటి అలా మాటాడేస్తున్నారు? పెళ్ళయిపోయినట్టుగా వాళ్ళంతా వాగుతూ వుంటే అతనే ఉలకడూ పలకడు.
అతనన్నది నిజమేనా? తనంటే అంతగా ఆరాధనాభావమా?
"ఒక్కసారి పెదాలనీ మునివేలితో సుతారంగా స్పృశించుకుంది. ఎంత తీయగా వుంది ఈ స్పర్శ."
ఆమె శరీరమంతా రోమాంచితమైంది.
మరో పది నిమిషాలకి పోలివోని యవ్వనంతో యవ్వనలక్ష్మిలా, సంస్కారంతో సంస్కారలక్ష్మిలా. ముఖవర్చస్సుతో సాక్షాత్ సరస్వతిలా, అభిమానంతో అపర సత్యభామలా డ్రాయింగ్ రూంలో అడుగుపెట్టింది సత్య.
"భామగారూ! మార్వెలస్" అంది వాణి.
"కూర్చోండి" అంది సారసాక్షి.
ఆ డ్రాయింగ్ రూంలో కుర్చీలన్నీ వాళ్ళకే సరిపోయాయి.
సోఫాలో సతీష్ కూర్చున్నాడు. ఊహుఁ కృష్ణ వున్నాడు.
మరో సోఫా దూరంగా వుంది.
వెళ్ళి కృష్ణ పక్కలో కొంచెం దూరంగా కూర్చుంది.
"ఎక్కడికయినా వెళుతున్నారా!" అడిగేడు వాసుదేవ్.
"అవునోయ్! టౌన్ హాల్లో హేమమాలిని డాన్స్ వుంది. వెళుతున్నాం" అన్నాడు కృష్ణ.
"వెరీగుడ్! వెళ్ళిరండి. మరి నా ప్రపోజల్ ఏం చేశావు?" అడిగాడు మళ్ళీ.
"ఏం చేయటమేమిటి ఆవిడ ఎప్పుడో ఓకే చేస్తే. ఆవిడ పేర షేర్ తీసుకుంటారు. కదండీ భామగారూ!" అంది వాణి. ఆ పిలుపుకి ఉలికిపడి "నన్ను సత్యా అనే పిలవండి! నాకలా పిలిపించుకోవడమే ఇష్టం" అంది సత్య.
"యస్! యస్! అలాగే పిలుద్దాం ఏం పోయింది. మరి చెప్పండి మీ షేర్ విషయం."
"కృష్ణా!"