"థాంక్స్ థాంక్సె ఏలాట్!" శేషఫణి కృతజ్ఞతగా అన్నాడు అతని ముఖంలో పిశాచాలు తారట్లాడుతున్నాయి.
"ఫణీ!"
"వూఁ"
"నువ్వా అమ్మాయిని చూశావా?"
"చూశాను."
"ఎవరో తెలుసా?"
"వూహుఁ"
"అతని కేమవుతుంది?"
"ఏమో తెలీదు"
"భార్యా?"
"ఊహుఁ సతీష్ కృష్ణకి ఇంకా పెళ్ళే కాలేదు. అతనికి దగ్గర బంధువులంటూ ఎవరూ లేరు. అలా అని ఇతర్ల అమ్మాయిల్ని వెంటేసుకుని తిరిగే మనిషికూడా కాదు. అయినా ఏం చెప్పగలంలే! ఈ డబ్బున్న మనుషులు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేం."
"ఫణీ"
"ఏమిటి గురూ!"
"ఆ అమ్మాయిని నేను గుర్తుపట్టేను. అమీదా దళనుంచి సీతాకోకచిలుక తయారవుతుందంటారు చూడు, అలా వుంది స్థితి...."
"ఏమిటి నువ్వనేది?"
"ఏముంది? నన్ను తలపై కొట్టిపోయిన ఆ అమ్మాయే ఈ అమ్మాయి! పళ్ళు కొరికేడు."
ఆశ్చర్యపోయాడు ఫణి.
"హౌ వండర్! మన ఇద్దరి పగకి గోల్ వొక్కటే! ఎవరికోసం యిన్నాళ్ళుగా ఎదురుచూస్తూ వున్నామో ఆ ఇద్దరూ వొకటే అయ్యారు. ఇప్పుడు మన పగకీ అర్ధం వుంది. అవకాశం వుంది. మన ఇద్దరి పగకి ధ్యేయం వొక్కటే! మనం కలిసి సాధిద్దాం! మన కలయికకి వొక పూర్ణత వచ్చింది" ఆనందంగా వాగేడు ఫణి.
అతను మాత్రం నోరెత్తలేదు?
కసిగా సిగరెట్ కాలుస్తున్నాడు.
ఆ తగలడుతోన్న సిగరెట్ లాగే వాళ్ళ అంతరంగాలు కూడా జ్వలించి పోతున్నాయి.
* * *
నాట్య ప్రదర్శన చూసి ఇంటికి వచ్చేక ఆయా వడ్డిస్తూవుంటే భోజనం ముగిందనిపించి వారిద్దరూ
ఒక్కమాటకూడా మాటాడుకోలేదు. ఇద్దరి మనసుల్లోనూ ఏవేవో ఆలోచనలు ఎందుకో ముఖమాటం మాటలు పెగల్లేదు.
ఆకలిగా లేదని కొద్దిగా చారూ పెరుగూ పోసుకుని తింది సత్య. పాలూ అన్నంమాత్రం తిన్నాడు సతీష్.
భోజనం చేశాక వేడివేడి పాలలో బామమి కలుపుకుని వచ్చాడు నాయర్! సత్య కొద్దిగా త్రాగింది. అక్కరలేక పోయినా అలవాటుగా తాగేశాడు సతీష్.
"గుడ్ నైట్!"
"గుడ్ నైట్!"
వెళ్ళి పడుకున్నా ఆలోచనలు వదలలేదు సత్యని. సాయంకాలం నుంచీ పని వత్తిడి వల్లా! అన్యమనస్కతవల్లా దూరంగా వెళ్ళిన ఆలోచనలు కదిలిస్తే రేగిన చీకటీగల గుంపుల్లా ముసురుకున్నాయి.
"ఏమిటిది? తన ఆలోచనలు-భావనలు ఒక పద్ధతిలో నడుస్తూ వుంటే పరిస్థితులు తనని మరోమార్గం పట్టిస్తున్నాయి. తనకి ఐశ్వర్యం అంటే అంతగా గిట్టదు. ఈ దేశం సంపద ఎంత? ఈ దేశం జనాభా ఎంత? అందులో సుఖంగా శాంతిగా జీవిస్తున్న వాళ్ళు ఎందరు? అవసరానికి మించిన ఐశ్వర్యంతో సుఖలోలులై బ్రతికేవాళ్ళేందరు? వందమంది మేడలో నివసించాలంటే లక్షమంది పూరిగుడిసెల్లో బ్రతకాల్సిందే! వందమందిలో చేరడం తనకిష్టంలేదు. అలా అని లక్షమందిలోనూ కలవలేదు. తనది మధ్యతరగతి మనస్తత్వం.... అలా అని ఆశలు లేవు తనకి. ప్రతివారికీ కూడూ గుడ్డా, నీడా వుండాలనే సమసమాజం సిద్ధాంతం నమ్మేదితను. ఇప్పుడిప్పుడే ఉత్తములు ఆశించే ఆ స్వర్గరాజ్యం రాదని తనకు తెలుసు.
అయినా తనతోడి మానవులలో కొందరు చింకి పాతలు కట్టుకుని, కడుపునిండా తినలేక, తలదాచుకునే చోటుకూడా లేక బాధపడుతూ వుంటే తను ఇలా మేడల్లో, మిద్దెల్లో నివసిస్తుందా?
ఆపదకి తలదాచుకోవటం వేరు.... శాశ్వతంగా వుండటంవేరు.
శాశ్వతంగా.... ....
ఉలిక్కిపడింది సత్య....
ఆ ఆలోచనరాగానే ఆమె వెన్నుముకగుండా ఏదో భావం జరజరా ప్రాకింది. మనస్సుతోపాటు శరీరంకూడా జల్లుమంది.
ఊహే యిలా వుందే అనుభవం.... .....?
అయినా తను సతీష్ ని ప్రేమించింది.... ప్రేమించిందో లేక మనస్పూర్తిగా అభిమానిస్తుందో కాని కృష్ణతో సర్దుకుని పోగలదా ఎంత గమ్మత్తుగా వుంది యీ సంఘటన!
కృష్ణ ఎవరో కాదు సతీష్! అయినా తను ఆ భావన తాకిడికి తట్టుకోలేక పోతోంది. తను సతీష్ ని చూసినట్టు అతన్ని కృష్ణగా చూడలేకపోతోంది. కృష్ణ సతీష్ ఒకరేనని తెలియక పూర్వం కృష్ణ అంటే ఎంతో గొప్ప భావం వుండేది. సతీష్ అంటే ఆరాధన వుండేది. కాని ఇప్పుడు ఆ భావాలు రెండూ ఒక మనస్సులో ఇమళ్ళేక పోతున్నాయి.