"సినిమా వాళ్ళని చూడాలని వుందా?" అని అడిగాడు ఫణి.
"మనం చిన్నపిల్లలమా? పల్లెటూరి బైతులమా?" అన్నాడు గోపీ.
"కానీ నేను సినిమా నటీమణుల్ని చూడాలి. నా అభిమాన నటి వాణిశ్రీ. ఆమె కృష్ణవేణి చూశాక తప్పక చూడాలనిపిస్తోంది. వీలయితే యింకా జమునని చూడాలి" అంది రోజీ.
నేను హీరోలను చూడాలి అంది రాధ.
"ఎందుకు"
"ఎందుకేమిటి చూడాలనిపిస్తోంది. అంతే!"
"పిచ్చి! రోజూ స్క్రీన్ పై చూడటంలా! మనకీ వాళ్ళకీ ఏదయినా పరిచయం వుంటే వెళ్ళి చూడొచ్చు. మాటాడొచ్చు అంతేకాని వెళ్ళి వాళ్ళను చూడాలనుకోవటం - వెళ్ళటం - ఏదో ముఖస్తుతిగా నాలుగు మాటలు మాట్లాడటం కాలాన్ని వ్యర్ధం చేయటం - నాకు నచ్చదు"
"నేను రాజబాబుని చూడాలి"
"ఓహో! ఎందుకో"
"అతనెంత బాగా ఏక్ట్ చేస్తాడు!"
"అయితే మాత్రం"
వెళ్ళి మాట్లాడి అభినందించాలి"
నవ్వేడు ఫణి పక పకా.
"ఇవన్నీ కుదరవు షూటింగ్ రోజు హాజరయిన వాళ్ళని చూస్తే చాలు. కానీ సినిమా షూటింగ్ చూడాలంటే చూచే ఏర్పాటు చేస్తాను" అన్నాడతను.
ఆ మాటలకి గోపీ నవ్వేడు.
"సానివాళ్ళని పగలు చూసినా, హోటళ్ళలో కిచెన్ ని చూసినా సినిమా షూటింగ్ చూసినా టేస్టు చచ్చిపోతుంది. షూటింగ్ చూడక్కర్లేదు."
"మరి అందరూ చూడాలనుకుంటారేం?"
"తెలియక ఒకటి. ఆ సాకుతో సినిమా ఏక్టర్స్ ని చూడొచ్చని రెండు"
అన్నిటికీ అన్నీ చెప్పారు. పోనీ రాజేశ్వరరావుగారినీ, మహదేవన్ గారినీ చూద్దాం" అంది రాధ.
ఫక్కున నవ్వాడు ఫణి.
"ఎంత గొప్ప సంగీత వినిపించారు అని మాట్లాడతారా? సంగీతాన్ని గురించి వాళ్ళేదయినా మాట్లాడితే వెఱ్ఱిముఖాలు వేయాలి మనం... ఇవన్నీ పిచ్చి పిచ్చి ఊహలు కానీ హాయిగా రేపు షూటింగ్ కి హాజరై తర్వాత మహాబలిపురం వెళదాం" అన్నాడు గోపీ.
ఆడవాళ్ళిద్దరూ ముభావంగా వుండిపోయారు.
చివరికి తొలి షూటింగ్ కి వెళ్ళేరు, అందరి కోరికలు తీరాయి. కోరుకున్న నటీనటులే కాక చాలామంది వచ్చారు. నటించే వాళ్ళు కొందరు, అభినందించే నటన చేసేవాళ్ళు కొందరు వచ్చేరు.
డైరెక్టర్స్ నీ, టెక్నీషియన్స్ నీ పలుకరింపుగా పరిచయం చేశాడు ఫణి.
ఫంక్షన్ ముగిశాక షూటింగ్ కూడా చూసి వెళ్ళేరు.
మహాబలిపురం వెళ్లేదారిలో తిరిగి సినిమా విషయాలు చర్చకు వచ్చాయి.
"పూర్వం రాజులకు ఉండేది ఆ ఆకర్షణ. ఈ రోజు సినిమా వాళ్ళు అనుభవిస్తున్నారు" అంది రోజీ.
"నిజంగా పుణ్యం చేసుకుంటే సినిమా నటినై పుట్టాలి వచ్చే జన్మలో"
పక పక నవ్వాడు గోపీ.
"ఎంత అందమైన గులాబీకైనా ముళ్లుంటాయి. మన మింతగా భ్రమిస్తున్న ఆ సినిమా జీవితాల్లో ఎన్నో ఒడుదుడుకులుంటాయి. సినిమా స్టార్సుగా స్టారున్ననాలుగేళ్ళో అయిదేళ్ళో ఓ వెలుగు వెలుగుతారు. తర్వాత అందులో కొందరి బ్రతుకెంత అధ్వాన్నంగా గడిచిపోతుందో భగవంతుడికి తెలుసు. కొంతమంది నటీనటులు చచ్చాక దహనానికి చందాలేసుకున్నారని వింటాం ప్రముఖ నటులుగా వెలిగిపోయిన వాళ్ళగతే అలా వుంటే మామూలు వాళ్ళ మాటేమిటి?"
గోపీ మాటలు అందర్నీ ఆలోచనల్లో ముంచాయి.
"నీవన్నది నిజమేకానీ యిప్పుడు మన హీరోలు బాగా తెలుసుకుని అన్నిటా జాగ్రత్త పడ్డారు.అనుభవం నేర్పిన పాఠం మరి".
"ఏ రంగంలో నయినా అంతే, చెడిపోతున్నవాళ్ళు వుండనే వుండి తీరతారు. వాళ్ళ పతనాలకి కారణాలు తెలుసుకుని జాగ్రత్త పడ్డ వాళ్ళు సుఖపడతారు. ఆఁ మాకేంలే అనుకున్నవాళ్ళు సర్వనాశనమవుతారు"
"కానీ సినిమా తీస్తే చాలా లాభాలొస్తాయనుకుంటాను" అంది రాధ.
"లాభాలు! లాభాలు!! నీకు డబ్బు పిచ్చిపట్టుకుంది రాధా" అన్నాడు గోపీ.
"ఆఁ అక్కడికి మీకు చేదయినట్టు! వచ్చిన ఆదాయం నేను తిని పోతున్నానా. పుట్లకొద్ది వున్నా పుట్టింటికి పంపుతున్నానా?" రుస రుస లాడింది.
"ఎవరు తిన్నా తినకపోయినా డబ్బుంటేనే సుఖం. దాన్ని ఏ మార్గాన సంపాదించినా ఫరవాలేదు" అన్నాడు ఫణి.
"అలా చెప్పండి మీరయినా!" అంది రాధ.
"ఏం విశేషంగా ఎందుకు చెప్పాలి? అతనికి తెలియదా? ఈ రోజు ఇలా కార్లో దర్జాగా సుఖంగా తిరుగుతున్నామంటే డబ్బు మహిమ కదూ? ఎయిర్ కండిషన్డ్ రూములూ, స్వప్న భోజనాలూ అందరికీ లభ్యమవుతాయా? కేవలం పదిహేను రోజులు మద్రాసులో తిరగటానికి పదివేలు ఖర్చుపెడుతున్నామంటే అది ఎలా వచ్చింది? బుఱ్ఱ బద్దలు చేసుకుని ఎన్నెన్నో కొత్త కొత్త పద్ధతులతో వ్యాపారాలు ప్రారంభించి చేస్తేనే కదా వచ్చింది. ఆ ఆలోచన - ఆ ఊహ వుంటే యింకా సంపాదిస్తాడు, సుఖపడతాడు. నిన్ను సుఖపెడతాడు అతని పిల్లలూ సుఖ జీవితం గడుపుతారు. షోగ్గా సిగరెట తాగుతూ, అలవోకగా కారు నడుపుతూ ఉపన్యాసం దంచాడు ఫణి.
"అబ్బబ్బ! చోటా రాజకీయ నాయకుడులా చెప్పావు ఉపన్యాసం" అన్నాడు గోపీ.
"గుడ్ న్యూస్ గోపీ! ఎం.ఎల్.సీ.గా పోటీ చేయపోతున్నారాయన" అంది రోజీ.
కంగ్రాట్స్ ఫణీ! స్టెప్ బై స్టెప్ అభివృద్ధిలో కొస్తున్నావ్"
"ఒస్తున్నావ్ కాదు ఒస్తున్నాం అను, నా వెంట నిన్నూ లాక్కెళుతున్నాగా!"
"ఇంతకీ మనకి అన్నీ లాభాలేనా? ఇలాగయితే అందరూ ఎందుకు చేయరు? అడిగింది రాధ.
15
డబ్బింగ్ జరిగినన్ని రోజులూ నలుగురూ మద్రాసులోనే వున్నారు. అరవ సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు నలుగురూ. డబ్బింగ్ రైట్స్ తోపాటు అరవం సినిమాని తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం సెంటర్స్ లొ డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకున్నారు.
శివాజీకి జగ్గయ్యతో డబ్ చేయించారు. రోజీ గొంతువిన్న రికార్డిస్టు జయలలితకి కొన్ని డైలాగ్స్ చెప్పించాడు రోజీచేత. ఆమె స్వీట్ వాయిస్ విన్న మిగతా సినిమా వ్యక్తులు అంతా ఆమె చేతే చెప్పించారు. రాధ కూడా కొన్ని డైలాగ్స్ చెప్పింది. మొత్తానికి ఎలాగయితేనేం సినిమా పని ముగిసేసరికి రెండు నెలలు పట్టింది.
గోపీ ఓ సినిమా పాట కూడా వ్రాశాడు. నిజానికి గోపీ మాటలు కొన్ని కూర్చితే ఆ సినిమా కవిగారు వీటికి పాట రూపాన్ని ఇచ్చారు. చివరికి రికార్డింగ్ వేళకి ఆ పాటలో మొత్తం డజన్ పదాలైనా లేవు గోపీకి. అయినా రచయితగా గోపీ పేరే వేశారు.
చివరికి ఆగస్టు పదిహేనున స్వతంత్రదినోత్సవ కానుకగా రాధా మూవీస్ వారి సినిమా రిలీజైంది, పది సెంటర్లకి విడిచారు చిత్రాన్ని.
కాని ఫణి ఎస్టిమేషన్ పూర్తిగా తప్పిపోయింది. మొదటిరోజు తప్ప మరుసటిరోజే బుకింగ్స్ లేవు. వారం తిరిగేసరికల్లా డబ్బాలు తిరిగొచ్చాయి.
గుంటూరులో వాళ్ళు అద్దెకు తీసుకొన్న ధియేటర్ లోనే సినిమా ఎత్తివేయవలసి వచ్చింది. పైగా మరో పదిరోజులలో సంవత్సరం కాంట్రాక్టు ముగుస్తుందనీ. మళ్ళీ ఇవ్వమని తామే మేనేజ్ చేసుకుంటామని ధర్మారావుని మరో రెండొందలు ఎక్కువిచ్చి మేనేజరుగా వేసుకుంటామనీ అన్నారు వాళ్ళు.
కలెక్షన్స్ రిపోర్టుచూసిన రాధ గుండెలు దడదడలాడాయి. మొత్తం పెట్టుబడి అలా వుంచి తాము రెండునెలలు మద్రాసులో గడిపిన ఖర్చులు కూడా వచ్చేటట్టు లేవు అనుకుంది.
కళ్ళ నీళ్ళ పర్యంతమైంది రాధకు ఫణిని చూడగానే.
"టేకిట్ స్పోర్టివ్ రాధా! ఇంకా బి క్లాస్ సెంటర్స్ ఉన్నాయి. మరికొన్ని ఏ క్లాస్ సెంటర్స్ వున్నాయి. మన డబ్బు మునిగిపోదు" అన్నాడు ఫణి.
"నాకేం నమ్మకం దొరకటం లేదు."
"ఐతే ఓ పని చేద్దామా? మొత్తం డిస్ట్రిబ్యూషన్ మా ధర్మారావు తీసుకుంటాడట. యిచ్చేద్దామా?"
"ఏమిస్తాడు?" ఎలాగయినా ఒదిలించుకుందామనే ఉద్దేశ్యంలో అడిగింది రాధ.