Previous Page Next Page 
మధ్యతరగతి మనిషి పేజి 34


    "పాతిక వేలు యిస్తాడట."
    "అంతేనా?" నీరసంగా అందామె.
    "అక్కడికి నిలిస్తే గొప్ప"
    "అలాగయితే వెంటనే సెటిల్ చేయండి" అంది రాధ.
    "గోపీ ఏమంటాడో"
    "ఆయన ఏం అనగలరు దిగినందుకు వీలయినంత చేజిక్కించుకుంటే చాలు" అంది రాధ.
    "మీరు అలా నిరాశ పడకూడదు. ఇది సినిమా బిజినెస్. ఒకటి పోతే ఒకటి లాభిస్తుంది" అన్నాడు ఫణి.
    "మళ్ళీ సినిమానా?"
    "ఏం అంతగా జావకారి పోతున్నావు. ఈసారి డైరెక్ట్ పిక్చరే తీయాలి" అన్నాడు ఫణి.
    "దీని సంగతి తేలనివ్వండి ముందు" అంది రాధ.
    కానీ వారం రోజుల్లో దానిసంగతి తేల్చాడు ఫణి. బావమరిదికి సినిమా అమ్మేసి ఆ డబ్బుతెచ్చి రాధ పేర బ్యాంకులో వేశాడు. థియేటర్ లో వచ్చింది సినిమాలో పోయింది. కాదంటే రెండేళ్ళుగా మాద్రాసులో దర్జాగా జీవితం గడిపినా స్వంత డబ్బు పోలేదు, రెండు నెలలు జల్సాగా గడిపి వచ్చారు.
    "ఇక్కడికిది మేలు, చేతులు కాల్లేదు" అనుకుంది రాధ.
    పదిరోజులు గడవకముందే హడావిడిగా వచ్చాడు ఫణి.
    "నన్ను గాబరా పెట్టేశారు. నిలచిన చోట నిలవనీకుండా చేశారు. పెద్ద హీరో స్ట్రెయిట్ పిక్చర్ పోటీగా వుండటంతో మనది డబ్బా కొట్టుకుపోయింది, ఇప్పుడు చూడండి ఎలా పే చేస్తుందో."
    నిజంగా ఆ కలెక్షన్ రిపోర్ట్స్ చూస్తే కళ్ళు తిరిగిపోయాయి రాధకి, గోపీకి.
    "పోనీ మీరు ధైర్యం చెప్పారా!" అంది నిష్ఠూరంగా రాధ.
    "నన్ను నోరెత్తనిస్తేనా? మునిగిపోతామనే భయం పట్టుకుంది మిమ్మల్ని" అన్నాడు ఫణి.
    "పోతే పోయిందిలే! మన వాడేగా బాగుపడనీ" అన్నాడు గోపీ.
    "పోనీ ఆ తమిళ్ వెర్షన్ అయినా రిలీజ్ చేస్తేనో" అంది రాధ.
    "సారీ! మీతో చెప్పటం మరిచిపోయాను, అది కూడా యిస్తేకానీ అప్పుడు తెలుగుకాపీలు కొనటానికి ఇష్టపడలేదు అతను. నిజమే! అది బిజినెస్. మీకు పోటీగా తమిళ్ వదిలితే అతనికేం మిగులుతుంది అన్నారంతా, వదిలితే చాలన్న ధోరణిలో వున్న నేను సరే అనేశాను."
    రాధ అనుమానంగా చూసింది.
    "పోనీలే!" అన్నాడు గోపీ.
    రాధకి మాట్లాడటానికి అవకాశం చిక్కలేదు.
    అవీ ఇవీ మాట్లాడి వెళ్ళిపోయాడు ఫణి.
    "ఇందులో ఏదో గూడుపుఠాణి ఉందేమో అనిపిస్తోంది నాకు" అంది రాధ అతను వెళ్ళగానే.
    "ఛ! ఛ! అలా అనవద్దు. వాళ్ళిద్దరికీ మనమంటే ఎంతో అభిమానం" అన్నాడు గోపీ.
    "ఏం అభిమానమో గోతులు తీశాక ఏం చేయాలి అప్పుడు మునిగిపోవటం తప్ప మరో మార్గం వుండదు."
    "రాధా! మనిషిని మనిషి నమ్మకపోతే ఎలా? పోనీ మోసం చేశాడో అనుకో, మన సొమ్మేం పోలేదుగా, వచ్చే లాభాలు పోయాయి. అంతే! మనం ఊరినుంచి తెచ్చింది అలాగే వుందిగా?"
    "ఏమో! రేపు అన్నీ లెక్కలు చూసుకోండి" అంది రాధ లైటార్పేస్తూ వెలుగులో ఆమె కళ్ళకి భూతాల్లాగా కనిపించసాగాయి అంకెలు. కళ్ళు మూసుకోవాలని శతవిధాలా యత్నించినా నిద్రపోలేక పోయింది రాధ.


                               *    *    *


    విపరీతంగా లాభాలు సంపాదించిన ధర్మారావు తన బావకీ, అక్కకీ, రాధకూ, గోపీకీ వెట్ పార్టి అరేంజి చేశాడు. ఆ పార్టీకై అతను ఖర్చుచేసిన డబ్బు చూసి అసూయపడింది రాధ.
    మరి కొన్నాళ్ళు ఓర్పు వహించి వుంటే ఆ డబ్బల్లా తనకొచ్చేదే కదా అనుకుంది. ముందుగా సినిమా నిర్మాణం అంటే భయపడినా తర్వాత తర్వాత రుచి మరిగిన రాధ ఎలాగయినా స్ట్రెయిట్ తెలుగు పిక్చర్ తీయాలని పట్టుపట్టింది.
    ప్రతిరోజూ రాధ పోరుతూ ఉంటే భరించలేని గోపీ ఓరోజు ధియేటర్ కి ఫోన్ చేసి ఫణి అక్కడున్నాడని తెలుసుకుని వెళ్ళి రాధ కోర్కె చెప్పాడు.
    "నో! నో! మళ్ళీ రిస్క్ లో దిగటం నాకిష్టంలేదు. నా మటుక్కి నాకు లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఫరవాలేదు. ఒక దాన్లో కాకపోతే మరో దాన్లో వస్తుందనే ధైర్యం ఉంది. మీ విషయం అలా కాదు."
    "నథింగ్ డూయింగ్, ఈసారి రాధవల్ల ఏం కాంప్లికేషన్సూ రావు, ఐ ప్రామిస్" అన్నాడు గోపీ.
    "ఏమో రాధని నేను పర్సనల్ గా కాంటాక్టు చేస్తే తప్ప ఈసారి వెంచర్ చేయలేను."
    "అలాగే! బాగా డిసకస్ చేసి, నిర్ణయాలు తీసుకునే వ్యవహారంలో దిగుదాం" అన్నాడు గోపీ.
    ఆ రోజు రాత్రే వచ్చాడు ఫణి.
    అతని వెంట ధర్మారావు కూడా వచ్చాడు.
    "ఈసారి ఇతను కూడా భాగస్తుడిగా ఉంటానంటే తీసుకొచ్చాను మీరు అంగీకరిస్తే చేర్చుకుందాం."    
    "మంచిదే! ఒకరికి ఇద్దరుంటేనే మంచిది" అన్నాడు గోపీ.
    డిస్కషన్స్ సాగాయి.
    తను చదివిన ఓ తెలుగునవల చాలా బావుందని, అది సినిమా తీస్తే బాగా పోతుందని, కొత్త రైటర్ కాబట్టి అట్టే డిమాండ్ ఉండదని రోజీ చెప్పింది.
    ఆ నవల రాధ కూడా చదివింది. సినిమాకి మంచి సబ్జెక్టు, మంచి డైరెక్టర్ని కుదుర్చుకుంటే సరి అనుకుంది, ఓకే చేసింది.
    ధర్మారావు ఓ కొత్త ప్రపోజల్ పెట్టాడు.
    "రైటర్ని, యితర టెక్నిషియన్స్ నీ, డైరెక్టర్నీ, మ్యూజిక్ డైరెక్టర్నీ అందర్నీ అనుభవం పడినవాళ్ళని బాగా పేరున్నవాళ్ళని బుక్ చేద్దాం.
    అయితే నటీనటుల్ని అందర్నీ కొత్తవారిని బుక్ చేద్దాం. వాళ్ళూ కొంత భాగం పెడతారు. అంతా అవుట్ డోర్ లో తీద్దాం. కలర్ లో రిలీజ్ చేద్దాం. కనకవర్షం కురుస్తుంది" అన్నాడు.
    ఫణికి ఆ సలహా నచ్చింది. బాగోగులు వివరించాడు.
    ఐతే ఎంతవుతుందో ఎస్టిమేట్ చేద్దాం" అన్నారు.
    తమకున్న అనుభవంతో లెక్కలు వేశారు. "సగం పిక్చరు తీశాక డిస్ట్రిబ్యూటరే పెడతాడు. అంతవరకూ మనం పెడితేచాలు" అన్నాడు ఫణి.
    వాటికి "లక్ష పెట్టాలి" అన్నారు.
    భయపడింది రాధ ...
    ఆలోచించుకుని కార్యంలోకిదిగే ఉద్దేశ్యంతో డిస్కషన్స్ వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు అంతా.


                                     16


    తమ్ముడూ, మరదలూ రావటం చూసి ఆశ్చర్యపోయాడు రమణయ్య. ప్రతిసారీ రామూని వెంటతీసుకుని వచ్చేవాడు గోపీ, ఈ పర్యాయం రామూ రాకుండా భార్యాభర్తలు రావటం చూసిన రమణయ్య మనస్సు ఏదో శంకించింది.
    "రామూ ఏడి?" అని అడిగాడు మామూలు మాటలు అన్నీ అయ్యాక. వాడి విషయంలో ఆయనకి చాలా ఆత్రుతగా వుంది.
    "వాడిని కాన్వెంటులో విడిచాం" అంది రాధ.
    "నిండా మూడేళ్ళు నిండని పసివెధవకి అప్పుడే చదువులా, అలా అయ్యే దేశం యిలా వుంది. శారీరకంగా తగిన ధృడత్వం రానిదే పిల్లల్ని చదువులో వేస్తే వాళ్ళు మానసికంగా ఎదగరు, శారీరకంగానూ ఎదగరు.
    నవ్వింది రాధ.
    "లేదు బావగారూ! చిన్నప్పటినుంచే మంచి వాతావరణంలో పెరిగితే పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు, అక్కడ పిల్లలకి మంచి అలవాట్లు నేర్పుతారు" అంది ఆమె.
    నిట్టూర్చాడు రమణయ్య, అతనేమీ అనలేదు.
    ఆరోజు వంట రాధే చేసింది.
    బావగారికీ భర్తకీ తనే వడ్డించింది.
    "మీ విషయం మీరు తెలుసుకోవటంలేదు బావగారూ! అక్కయ్య పోగానే మీరు సన్యాసిలా అయిపోయారు. గొడ్డుకారంతో తిని కాలం గడుపుతున్నారు. ఇదేమీ బాగాలేదు, మీరు గుంటూరు వచెయాల్సిందే" అంది పచ్చడిలో నెయ్యి వేసి తను పక్కన కూర్చుని వాళ్ళిద్దరికీ విసురుతూ.
    "ఎవరన్నారమ్మా నేను సన్యాసినని? ఇంత వ్యాసంగం వుంది. తమ్ముడూ, తమ్ముడి కుటుంబం ఉంది. నేను ఎలా సన్యాసినవుతాను" నవ్వుతూ అన్నాడు రమణయ్య.
    "అది కాదన్నయ్యా, మనకేం తక్కువైందని మీరిలా కష్టపడాలి. అక్కడ నేను ఉద్యోగం చేస్తున్నాను. వ్యాపారంలో బాగా కలిసివస్తోంది. రాధ చేత ఉద్యోగం మాన్పించేయాలని ప్రయత్నం చేస్తున్నాను. నెలకు వేయి రూపాయలు సంపాదిస్తోంది రాధ. ఆమెనే ఉద్యోగం మాన్పిస్తూ వుంటే నీవిక్కడ రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించవలసిన అగత్యం ఏముంది?"  

 Previous Page Next Page