"ఆఁ డబ్బు అక్కర్లేదు ముష్టివాళ్ళ లాగా బొటాబొటీగా ఖర్చు చేస్తూ బ్రతకాలి కాబోలు" అంది రాధ.
"నెలకు రెండువేలు సంపాదించి యిస్తుంటే అదంతా ఖర్చు చేస్తూ ముష్టి బ్రతుకంటున్నావా?" ఆశ్చర్యంగా అడిగాడు గోపీ.
"ఆఁ రెండువేలూ మీరే సంపాదిస్తున్నారు. నేను వుద్యోగం మానేస్తే మీకు తెలుస్తుంది."
"మీ రెందుకు మా మాట వింటారు" అన్నాడు ఫణి.
"చూస్తూ వుండండి నేనెప్పుడో ఒకరోజు రిజైన్ చేస్తాను."
"అయితే యింతకీ గోపీని ఎం చేయమంటారు?"
"నేనేమంటానండీ? సాటి మగవాడు రాత్రింబవళ్ళు అనుకోకుండా రెండు చేతులా సంపాదిస్తూ వుంటే ఆయన చేతులు ముడుచుకుని కూర్చుంటే నాకు ఎలా వుంటుంది?"
"కానీ ఎం చేయాలో చెప్పండి మీరే?"
"ఏం చేస్తే ఏమండి? డబ్బు సంపాదించాలి గాని"
"నేను ఓ మాట చెపుతాను వింటారా? ఒక ధియేటర్ వాళ్ళు ఆ ధియేటర్ ని ఒక సంవత్సరం లీజ్ కు యిస్తారట. తీసుకుందామంటారా?"
"తీసుకోండి. ఈ రోజుల్లో ప్రజలకి సినిమా పిచ్చి ఎక్కువగా వుంది. సినిమా చూడనివాళ్ళు అరుదు, కనీసం రెండు మూడుసార్లు చూసేవాళ్ళు సగం జనాభా వుంటారు."
"కానీ ముందుగా కనీసం యాభై వేలన్నా యివ్వాలి వాళ్ళకి."
మా భాగం పాతికవేలు యివ్వాలా? అమ్మబాబోయ్! ఈ రోజు పాలవాడు బదులడిగితే యివ్వటానికి పాతిక రూపాయలు లేకపోయాయి. ఎక్కడినుంచి తేవాలి?" అన్నాడు గోపీ.
"పాపం! డబ్బు పెట్టుబడి పెట్టకుండా, శ్రమ పడకుండా వూరకే ప్రవాహం లాగా డబ్బు ఎలా యింటిముందుకి పారుతూ వస్తుందను కున్నాడు కాబోలు, మొన్న పదివేలు యిచ్చి వచ్చారుగా, పైగా పైరు వచ్చి వుంటుంది వెళ్ళి పట్రండి" అంది రాధ.
గోపీ ముఖం మాడిపోయింది పదివేలు మాట వినగానే.
"అవునోయి గోపీ! వెళ్ళి పట్రా! అయినా ప్రతిసారీ మీరిలా వెళ్ళి డబ్బు యివ్వటం తేవటం ఏమీ బాగాలేదు. ఈ సారి తీసుకునిరా, వాటా అంతా నా పేరే పెట్టుకుంటాను. డబ్బు వచ్చింది వచ్చినట్లు రాధగారి పేర బ్యాంక్ లో వేస్తాను. పెట్టుబడిగా తిప్పుతూ వుంటే అదే పిల్లల్ని పెడుతుంది, మీరు వడ్డీ తినలేరు" అన్నాడు ఫణి.
"అవునండీ! అలా చేయండి. పైగా మనం ఉద్యోగస్తులం. మీ పేర ఎందుకుండాలి" అంది రాధ.
ఇబ్బందిగా ముఖం పెట్టాడు ఫణి.
"నిజమే కానీ రాధగారూ! అన్నీ నా పేర వుంటే యిన్ కంటాక్సు వాళ్ళు తినేస్తారు నన్ను. నూరు ఆదాయం వస్తే మనకి మిగిలేది అయిదురూపాయలే! మీరంతగ పట్టుబడితే రోజీ పేర తీసుకుంటాను"
"మీ యిష్టం. మాకు ఏ చిక్కులూ లేకుంటే సరి"
"అయితే మీకు బాధలూ బాధ్యతలూ లేకుండా యీజీగా డబ్బు రావాలన్నమాట" అన్నాడు నవ్వుతూ ఫణి.
"మీరెలా భావించినా సరే! మా ఉద్దేశం అది"
"సరే! అయితే వెళ్ళి డబ్బు పట్రమ్మనండి" అన్నాడు ఫణి.
"ఆలస్యం అమృతం విషం! ఆయన యీరోజే బయలుదేరతారు" అంది రాధ.
అడకత్తెర పోక చెక్కలా అయింది గోపీ పని. మ్రింగలేక కక్కలేక అంగీకరించాడు.
కానీ అన్నగారికి తనపై వుండే ప్రేమనీ, ఆయన అమాయకత్వాన్ని తను కేష్ చేసుకుంటున్నానేమో అనిపించిదతనికి.
అయితే కొడుకుతో సహా రైల్లో కూర్చున్న గోపీకి "ఎంతయినా ఆ ఆస్థి అంతా వీడిదే కదా!" అనిపించింది.
* * *
"రామా! రామా!"
పిల్లవాడిని చూడగానే రమణయ్య కళ్ళు జ్యోతులులాగా వెలిగాయి. ఆ పిల్లవాడిలో కొట్టవచ్చినట్లుగా బాబు పోలికలు కనిపిస్తున్నాయి.
రెండోయేడు వచ్చింది వాడికి మాటలు బాగా వస్తున్నాయ్ డిక్షనరీ తయారుచేసుకునేవాళ్లూ వాచకాలు తయారుచేసేవాళ్ళు కొనటం ప్రారంభిస్తే వాడు లక్షాధికారి అవుతాడు త్వరలో.
"నాన్నా! నాన్నా!"
"నాన్నని కాదురా తండ్రీ! పెదనాన్నని"
"నాన్నా! నాన్నా!" అని రమణయ్య బుగ్గలు లాగేడు వాడు.
"ఒరే ఒరే బుగ్గలు గిల్లుతావేంరా తండ్రీ!"
మీసాలు పట్టి గుంజేడు సమాధానంగా.
"అబ్బా!" అన్నాడు బాధగా రమణయ్య.
కిల కిల నవ్వేడు వాడు.
"రామూ! రామూ! నా బాధ నీకు నవ్వులాటగా వుందా? గోపీ వీడిని యిక్కడే వదిలేసి వెళ్ళరా! రోజూ పొలానికి తీసికెళ్ళి పని చేయిస్తే పొగరు అణుగుతుంది" అన్నాడు నవ్వుతూ రమణయ్య.
"ఉంటాను! ఉంటాను" అన్నాడు రాము.
"గోపీ! వీడిక్కడే వుండిపోతాడటరా"
గోపీకి చాలా ఆనందంగా వుంది. రామూపై ఆయనకెంత అభిమానం అనుకున్నాడు.
"నాన్నా! నాన్న!"
"ఏం బాబూ!"
"అన్నం? అన్నం!"
"అదేమిటి గోపీ! వీడు రెండుసార్లు పలుకుతాడు?"
"ఒకసారి నన్ను చూసి, మరోసారి వాళ్ళమ్మని చూసి అడుగుతాడు వాడు"
పక పక నవ్వేడు రమణయ్య.
"ఈ చిన్ని బుఱ్ఱలో ఎన్ని ఆలోచనలున్నాయిరా కన్నతండ్రీ!"
పిల్లవాడిని తీసుకుని వంటింట్లోకి వెళ్ళేడు రమణయ్య. అన్నగారి వెంట గోపీ కూడా నడిచాడు. ఏముంది అక్కడ?
ఓ వేపు అరుగుమీద రామ, కృష్ణుల పటాలున్నాయ్. అది దేవుడి అరుగు. ఆగ్నేయంగా ఒక చిన్న పొయ్యి, రెండు వంటపాత్రలూ వున్నాయ్. మరో మూల మజ్జిగ కవ్వమూ, కుండలూ వున్నాయ్, అంతే!
తన యింట్లో వంటింటికి యీ యింటిని పోల్చుకుని భారంగా నిట్టూర్చేడు గోపీ. ఈ తిండి తింటూ, యీ బ్రతుకు బ్రతుకుతూ యీయన పైసాకి పైస జతచేస్తూ వుంటే అక్కడ తాము వేలకి వేలు ఖర్చు చేస్తున్నారు. ఎక్కడుంది న్యాయం? పని చేసేవాడొకడు. ఫలితం అనుభవించే వాడొకడు అని కార్మిక న్యాయాన్ని గురించి వాదించే తమకి యీ విషయం గుర్తుకిరాదు.
కెవ్వుమన్నాడు రాము.
"ఏరా నాన్న? ఏమిటి?" గాబరాగా అడిగాడు రమణయ్య.
"కారం! కారం!" అన్నాడు వాడు.
రమణయ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగేయ్. "ఏడాది నిండిన యీకుర్ర వెధవకి తను తినే గొడ్డు కారం పెడితే తినగలడా? అనుకున్నాడు మంచినీళ్ళు త్రాగించాడు, పిల్ల వాడింకా బుసలు కొడుతూనే వున్నాడు.
ఆ అన్నం తీసివేసి, మళ్ళీ అన్నం వడ్డించి పెరుగూ మీగడా వేసి కలిపేడు రమణయ్య. కేరింతలు కొడుతూ తింటూన్న వాడిని చూసి రమణయ్య కళ్ళు చెమ్మగిల్లాయ్.
గోపీకి అంతా వింతగా ఆశ్చర్యంగా వుంది.
భోజనం ముగించి కబుర్లు చెపుతున్నాడు రాము.
* * *
గోపీ చెప్పిందంతా విన్నాడు రమణయ్య.
"ఏమో గోపీ నాకీ వ్యాపారాల్లో నమ్మకం తక్కువ. ఎప్పుడో ఒకప్పుడు పుట్టి ముంచుతాయ్. మనిషి అన్ని విధాలా నమ్మదగింది వ్యవసాయం. అలా అని అందర్నీ వ్యవసాయం చేయమనటం అవివేకమే అనుకో, అలాగే అందరూ వ్యాపారాలకి ఎగబడటం కూడా అవివేకమే అంటాను.
రామశేషు చూడు. సంపాదించినపుడు వేలకి వేలు సంపాదించాడు. భూములూ ఇళ్ళూ కొన్నాడు. ఆ ఒక్క వడ్లవ్యాపారంతో నిలిస్తే బావుండేది. రైస్ మిల్లు కట్టించాడు, ఫెర్టిలైజర్స్ వ్యాపారం ప్రారంభించాడు. ఒక్క చేత్తో యిన్ని చేసుకోవటం కష్టమైంది. స్వయంగా అజమాయిషీ తగ్గింది. గుమాస్తాలపై ఆధారపడ్డాడు. ఫలితంగా విపరీతంగా వచ్చే లాభాలన్నీ నష్టంగా మారిపోయాయి.
ఏమైంది?
ఆస్తంతా అమ్ముకుని, రైసుమిల్లు అమ్మేసి రావలసిన అప్పుల్ని వదిలేసి, యివ్వవలసిన అప్పులు కట్టేసి పూలమ్మిన చోట కట్టెలమ్మినట్లుగా బ్రతకలేక దేశం కాని దేశం వెళ్ళిపోయాడు.
ఎక్కడో బళ్ళారి ప్రాంతంలో తుంగభద్ర కాలవక్రింద భూములు చౌకగా దొరుకుతున్నాయని వెళ్ళి కొని వ్యవసాయం ప్రారంభించాలని పోయాడు. వాడి గురించి ఏమీ తెలియలేదు.
వ్యాపారం అలాంటిది.
రమణయ్య చెప్పిందంతా విన్నాడు గోపీ.
ఆయనతో వాదించాలనిపించలేదు గోపీకి.
"నీ యిష్టం అన్నయ్యా! కష్టపడక్కర్లేకుండా వ్యాపారంలో అంతో ఇంతో సంపాదిద్దామని, నిన్ను సుఖపెట్టి మేం సుఖపడాలనే ఆలోచించాం. నీ కిష్టం లేకపోతే మానేస్తాను" అన్నాడు.