"అది అంతేనోయ్ గోపీ! ఈ ఆర్నెల్లు మొత్తం ఎంతిచ్చాడు మీ అన్నయ్య? దాదాపు యాభైవేలు యిచ్చాడు? అంతడబ్బు యిచ్చాక మళ్ళా మళ్ళా అడుగుతున్నావ్ కాబట్టి మళ్ళీ ఓ నెల రోజుల తర్వాత వెళ్ళి అడుగుతావేమో అనే వుద్దేశ్యంతో ముందుచూపుతో అలా చేసి వుంటాడు. మీ శేషుబావ వ్యాపారస్తుడన్నావ్ కదా? వ్యాపారస్తు డెవ్వడూ అలా వేలకి వేలు యింట్లో దాచుకుని మీ అన్నలాంటి వాళ్ళు అడగ్గానే ఇచ్చేద్దామని ఉండరు."
గోపీ మాట్లాడలేదు.
డబ్బుతీసుకుని వెళ్ళిపోయాడు ఫణి.
"రోజీ మిమ్మల్ని వ్యాపారంలో భాగం కలవమని అడిగిందా?"
రాధ వేసిన ప్రశ్నకి గాబరాపడ్డాడు గోపీ.
"ఏం?"
"ఏం లేదు, మీకు రోజీ ఎవరో పేరేమిటో తెలుసా?
"ఉహుః అంతా రోజీ అంటే రోజీ అనుకుంటున్నాను."
"దానిపేరు రోజారమణి. మన హిందువులే! క్రిష్టియన్ కాదు. అది బుద్ధికి జారమణి. కాస్త జాగ్రత్తగా వుండండి, అసలే మీరు అమాయకులు. టోపీలో వేసేస్తుంది."
"నీకు ఇవన్నీ ఎవరుచెప్పారు" అన్నాడు గోపీ.
"అలాంటివి మా ఆడవాళ్ళకికి సులభంగా తెలుస్తాయి. మీ గండు తుమ్మెదలకి పూలమల్లే అలంకరించుకొని షోగ్గా ఫ్రీగా తిరిగే ఆడదాన్ని చూస్తే మతిపోతుంది. రంభో ఊర్వశో అనుకుని ప్రదక్షిణలు ప్రారంభిస్తారు, శ్లేష్మంలో పడ్డ ఈగల్లే కొట్టుకుని చస్తారు"
"రాధా!"
"నేను సీరియస్ గానే చెపుతున్నాను. జాగ్రత్తగా వుండండి"
"అనుమానానికయినా హద్దుండాలి. నేనేం కుర్రాడినా?"
నవ్వింది రాధ.
"కుర్రాళ్ళయితే చిక్కేలేదు. వాళ్ళగురించి భయం అక్కర్లేదు" అని రామూ ఏడ్వటంతో వాడి నెత్తుకోవటానికి వెళ్ళిపోయింది రాధ.
గోపీ ఆలోచనలో పడ్డాడు.
* * *
"రోజీ! నిన్ను చూస్తే లెక్చరర్ లాగా కనిపించవు. ఇంకా టీనేజ్ లోవున్న కాలేజీ అమ్మాయిలా వుంటావు"
గోపీ మాటలకు నవ్వింది రోజీ.
"కానీ ఖర్చులేకుండా వచ్చే అందాన్ని, ఆనందాన్ని పొగడటానికి మీ మగవాళ్ళు ఫస్టు"
"ఇది పొగడటం కాదు రోజీ, యదార్ధం"
"పోనీలే గోపీ నీ కంటికి అందంగా కనిపించటమే నా ధ్యేయం." అని విస్కీ సీసా తీసి గ్లాసునిండా పోసి ఐస్ వేసి యిచ్చింది.
దాన్ని అందుకుని తాగుతూ "రోజీ అసలు నీవే బ్రహ్మాండమైన మత్తు కలిగిస్తూ వున్నావు. యింకా నిషాకి యిదెందుకు?" అన్నాడు.
"అలా మాటలు విసరటానికి"
గ్లాసు ముగించి మరోగ్లాసు వంచుకుంటూ "ఈ విషయం రాధకి తెలిస్తే విషం తాగి చస్తుంది" అన్నాడు.
"ఫణికి తెలిస్తే నన్ను చంపేస్తాడు" అంది రోజీ.
"మనిద్దరికీ అడ్డంగా బావున్నారు యిద్దరూ" అని హైద్రాబాద్ వెళ్ళిన నీ భర్త తిరిగి ఎప్పుడొస్తాడు?" అని అడిగాడు గోపీ.
"వారం రోజులదాకా రారు"
"ఈ వారంరోజులూ యీ బెజవాడలోనే గడిపేస్తే బాగానే వుంటుంది. కానీ మా ఊరికి వెళ్ళి నేనెప్పుడూ యిన్నిరోజులుండలేదు."
"నువ్వు వట్టి పిరికివాడివి. అన్నీ ఆడదాని బుద్ధులు."
నవ్వేడు గోపీ.
"గోపీ! ఆ డబ్బు మీ అన్నయ్యకి యిచ్చిరావాలని బయల్దేరావే, అదంతా యిక్కడే ఖర్చు చేస్తే ఎలా?"
"మా అన్నయ్య మళ్ళీ డబ్బు అడగొచ్చాడా? లెక్కలు అడగొచ్చాడా? రాధ కిదేమీ తెలియదు. అయినా యీ పదివేలూ ఆదాయం కదా! ఊరికే వచ్చింది వూరికే ఖర్చు చేస్తేమాత్రం ఏమి? మీ ఆయన తెచ్చి యిచ్చిన డబ్బు నీకు ఖర్చు పెడుతున్నాను."
"కానీ యిలా తాగుతూ, హోటళ్ళలో గడపటానికి ఎంతవుతుంది. పదివేలు ఖర్చు కావాలంటే కనీసం పదిసార్లయినా యిలా రావాలి. అంతవరకూ డబ్బు ఎలా దాస్తావు?"
"నా వద్దే వుండాలని రూలేముంది. నీవు దాచుకో."
"థాంక్స్. ఆ మాత్రం నమ్మకం వున్నందుకు"
"రోజీ! అలా అనొద్దు__"
అతనింకేదో అనబోతూ ఉండగా మెడచుట్టూ రుద్దుకుని "అబ్బ మెడంతా నొప్పిగా ఉంది" అంది రోజీ.
"అతనికేదో స్పురించింది హఠాత్తుగా అన్నాడు" రోజా ఓ మాట చెపుతా విను- ఆ డబ్బు పెట్టి మంచి డైమండ్ నెక్లెస్ కొందాం. మన ప్రేమకి శాశ్వతమైన గుర్తుగా ఉండనీ"
పకపక నవ్వింది రోజీ.
"గోపీ! ఈ నెక్లెసులూ, హారాలూ ప్రేమకి గుర్తులవుతాయా? మన ప్రేమ బంధం నా కడుపులో పెరగాలి. వాడిని చూసుకుంటూ నిన్ను చూసిన ఆనందం పొందాలి" అంది రోజీ.
పరవశించిపోయాడు గోపీ.
"రోజీ! రోజీ! ఎంత తీయనిమాట చెప్పావు. నిజంగా మీ ఆడవాళ్లు మనస్పూర్తిగా ప్రేమిస్తారు. మా ప్రేమలో సెక్స్ కలిసి కల్తీ అవుతుంది. రోజీ! నీ ముఖం చూస్తూ యిలాగే గంటలు గంటలు గడిపెయ్యాలని వుంది-అందమైన నీ ముఖాన్ని చూస్తూ వుంటే నాలో ఆనందతరంగాలు అలలు అలలుగా పుట్టుకొస్తున్నాయ్. చాలు రోజీ! చాలు! జీవితంలో నీవంటి స్త్రీతో ఒక్కరోజు హాయిగా గడిపినా చాలు. జీవితం ధన్యమవుతుంది."
అతని మాటలకు ముగ్ధురాలై బలంగా కౌగలించుకుంది రోజీ.
మూడు రోజులు విజయవాడలో జల్సాగా గడిపి రోజీకి డైమండ్ నెక్లెస్ ప్రజంట్ చేసి, పొగాకు వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టిన డబ్బుని అంతకు అంత ఆదాయం వచ్చిందని ఫణి యిచ్చిన పదివేలూ ఖర్చు చేసుకుని తిరిగి వచ్చారిద్దరూ.
* * *
గోపీ కుటుంబానికి, ఫణి కుటుంబానికీ మధ్య ఆత్మీయత దినదినాభివృద్ధి చెందుతూ వుంది. వాళ్ళింట్లో వారానికోసారి పార్టీ యిస్తే, వీళ్ళూ వారానికో పార్టీ యిస్తున్నారు. సుష్టుగా రకరకాల భోజనం చేయటం, తృప్తిగా తాగటం అలవాటైంది అందరికి, రాధకి కూడా బీర్ బాగా అలవాటు చేసింది రోజీ.
ఆ సంవత్సరం గోపీ, రాధ, రోజీ పని చేస్తున్న కాలేజీమెంబర్లలో ఒకతను హఠాత్తుగా చనిపోవటంతో ఫణి చక్రవర్తి కమిటి మెంబరయ్యాడు, రోజీ ఉద్యోగానికి రాజీనామా యిచ్చింది.
ఆ రోజు రాధ చాలా వాదించింది.
"మీ మగాళ్ళు వట్టి స్వార్ధపరులు. ఆడవాళ్ళకి స్వాతంత్ర్యం వచ్చింది. అన్నిటా పురోభివృద్ధి చెందుతున్నారు, సమాన హక్కులు ఇచ్చాం. ఉద్యోగాలు యిస్తున్నాం అంటారేకానీ, మీదంతా కుళ్ళు మోతుతనం, మీ కుటుంబానికి ఆమడదూరంగా వుండే నీతులు చెపుతారు. మీరు కమిటి మెంబరు కాగానే రోజీ ఎందుకు రాజీనామా యివ్వాలి?"
పకపక నవ్వాడు ఫణి.
"రాధగారూ! మీరు చిత్రంగా మాట్లాడతారు. రోజీ ఎం.ఏ. చదివింది. బి.ఏ. తప్పిన నన్ను పెళ్ళిచేసుకుంది-నేను వ్యాపారం చేస్తున్నాను. అంతో యింతో గడిస్తున్నాను, ఎం.ఏ. చదివినందుకు కొన్నాళ్ళు ఉద్యోగం చేసింది చాలు. ఎవరైనా డబ్బుకోసమే కదా ఉద్యోగం చేసేది? అది అక్కర్లేనప్పుడు ఉద్యోగం ఎందుకు? రోజీ రిజైన్ చేస్తే ఆ ఖాళీలో యింకెవరికైనా ఉద్యోగం వస్తుంది కదా?"
"నిజమే! రాధ కూడా రిజైన్ చేస్తే బావుంటుంది" అంది రోజీ.
"నో! నో! నేను లెక్చరర్ గా పనిచేయాలనే ఎం.ఏ. చదివింది. మొదటినుంచీ నాకు టీచింగ్ ప్రొపెషన్ పై వున్న మమకారమే నన్ను ఉద్యోగానికి పురికొల్పింది."
"రాధా! నీవు ఉద్యోగం చెయ్యి. ఎవరొద్దొన్నారు?" అన్నాడు గోపీ.
అంతటితో సంభాషణ ముగిసింది.
మరో నెలరోజుల తర్వాత ఓ రోజు పార్టీ యిచ్చాడు ఫణి. అతను పార్ట్ నర్ గా వుంటున్న ఓ ప్రయివేట్ కంపెనీకి ఆ సంవత్సరం విపరీతంగా లాభాలు వచ్చాయట. అతనివాటాకి పాతికవేలు వచ్చాయట, ఇంతకీ అతని ప్రారంభపు పెట్టుబడి ముష్టి పదివేలు.
"ఎంతయినా బిజినెస్ బిజినెస్సే! ఈ రోజుల్లో డబ్బు కళ్ళ చూడాలంటే రాజకీయ నాయకుడైనా కావాలి. వ్యాపారస్తుడయినా కావాలి ఉద్యోగస్తులకేముంది అంది రాధ.
"మీరూ వ్యాపారం చేయొచ్చుగా" అంది రోజీ.
"ఎన్ని చేస్తాం? టొబాకో అన్నారు, భాగం కలిశాం."
"దీపముండగానే యిల్లు చక్కబెట్టుకోవాలి. సంపాదించే రోజుల్లోనే సంపాదించాలి, ఖర్చు చేయాలి. ఎన్ని అవకాశాలుంటే అన్ని విధాలా సంపాదించాలి" అన్నాడు ఫణి.
"బాబూ! మా ఆవిడకి డబ్బు యావ ఎక్కువైంది. బాగా మాప్పారిద్దరూ డబ్బు! డబ్బు! అంటూ వుంటుంది. మాకు వ్యాపారాలొద్దు ఆ ఆదాయం వద్దు" అన్నాడు గోపీ.