Previous Page Next Page 
మధ్యతరగతి మనిషి పేజి 29


    ఫణి ముఖంలో మబ్బులు తారట్లాడాయి.
    "సరే మీ యిష్టం నే వెళతాను" అని లేచి వెళ్ళాడు.
    అతను వెళ్ళాక "నిజమే! మీ అన్నగారివద్ద ఎంత వుందో వెళ్ళి ఒక్కసారి అడిగి రారాదూ? అంది రాధ.
    "రాధా! మా అన్నయ్య దేవుడు ఆయనతో నిష్కర్షగా డబ్బు అడగాలంటే నా మనస్సు అంగీకరించదు, మొన్ననే ఆయన నేను అడక్కుండానే డబ్బిచ్చారు"
    "ఊరికే ఇచ్చారా మనకూ భాగం వుంది, కదా అందులో"
    "రాధా!"
    నోరు జారినందుకు నొచ్చుకుంది రాధ." అదికాదండీ! ఎన్నటికయినా మనదంటూ ఉండాలి కదా! ఆ వ్యవసాయం విషయాలే తెలియవు. చివరి కేమవుతుందో" అంది.
    గోపీ ముఖం ఎర్రబడింది" రాధా! మా అన్నయ్య విషయంలో ఆ భయం అక్కర్లేదు. ఆయనకు నేనంటే వల్ల మాలిన ప్రేమ, రామూ అంటే ప్రాణం. ఆయన మనని అన్యాయం చేస్తాడా? ఎలాగయినా అదంతా మనదేగదా?"
    "ఏమో! ఎవరుచెప్పొచ్చారు? ఆయనేం ముసలాడా ముతక వాడా మళ్ళీ పెళ్ళి చేసుకుంటే మనం అడ్డుకోగలమా? లేక ఎవరికయినా దోచి పెడితే మనం తెలుసుకోగలమా?
    "రాధా! మా అన్నయ్య అక్కడెలా జీవిస్తున్నాడో నీకు తెలియదు. పచ్చడి మెతుకులు తిమ్డూ పడరాని పాట్లు పడి మనకోసం దాచుతున్నాడు. మొన్న ఆయనకి జరిగింది తలుచుకుంటే నాకు ఎంతో బాధగా ఉంది.
    "నాకూ బాధగానే ఉంది. అలా కలిసొచ్చింది ఏం చేయాలి? ఆయనకూడా అలా వెళ్ళిపోవటమే నాకూ భయంగా ఉంది.
    "అదేమీలేదు. అంతమందిలో ఆయన యిమడలేక పోయారు. పైగా పాలేరు అనుకుంటున్న వాళ్ళతో చెప్పుకుని నిలవలేక వెళ్ళిపోయారు" అన్నాడు గోపీ.
    "అయినా మీరొకసారి వెళ్లిరండి"
    "తప్పకుండా సెలవులలో వెళతాను"
    "సెలవుల వరకూ ఎందుకు. మరో పదిహేనురోజుల్లో దసరా శెలవులు వస్తాయిగదా వెళ్ళిరండి" అంది రాధ.
    గోపీ అంగీకరించాడు.


                              *    *    *


    కాలేజీ నుంచి వస్తూ "మాయింటికి వెళ్ళి కాఫీ తీసుకుని వెళుదురు గాని రండి అంది రోజీ.
    వాళ్ళయిల్లు గోపీ వాళ్ళింటికి పదిళ్ళదూరంలో వుంది వీధి మొదట్లో ఫణి ఇల్లు ఉంది. వీధి చివరికి కాస్త యివతలగా గోపీ యిల్లు.
    "నాలుగడుగులు వెళితే మా ఇంట్లోనే తాగొచ్చుగా"
    మూతి విరిచింది రోజీ.
    "మీ యింట్లో లేదని కాదు, మా యింట్లో బావుంటుందనీ కాదు జస్టు తాగివెళితే కంపెనీగా ఉంటుందని"
    "ఫణి లేడా?"
    "మొన్ననే పొలాలు బేరం చేయటానికి వెళ్ళారు - ఇంకో పదిహేను రోజుల్లో నాట్లయిపోతాయిగా. రైతులకి ఖర్చులకి ముందుగానే యిచ్చి రేటు నిర్ణయించు కుంటారు. అదంతా టోకుగా కంపెనీవాళ్ళకి అమ్ముతారు."
    "ఇంతకీ కష్టపడకుండా డబ్బు పండిస్తారాయన"
    "మీకు అది చేదవుతోందిగా" అని ఇలా గేట్లో నుంచుని మాటాడతారు కానీ లోపలికి రమ్మంటే సాకులు చెపుతారు" అంది రోజీ.
    నవ్వి ఇంట్లోకి దారి తీశాడు గోపీ.
    అయిదు నిమిషాల తర్వాత డ్రాయింగ్ రూమ్ లోకి వంటమనిషి తెచ్చి ఇచ్చిన కాఫీ అందించింది గోపీకి.
    "ఒట్టి కాఫీయేనా?" నవ్వుతూ అడిగేడు గోపీ.
    "ఇంకేం కావాలి"
    "ఏం ఇవ్వగలవు"
    అతనివేపు అదోలా చూసి "ఏమడిగినా ఇస్తాను" అంది రోజీ.
    నవ్వి పెదాలు తుడుపుకుని ఆమె వేపు తీయగా చూసి "థాంక్స్ రోజీ" అని కాఫీ తాగేడు.
    అతని చేతిలోని కప్పు అందుకుని, టేబిల్ పై పెట్టింది.
    ఆమె చేతివేళ్ళ స్పర్శ అతన్ని కదిలించింది.
    సిగరెట్ వెలిగించింది రోజీ...
    "నీవు సిగరెట్ కాలుస్తావా?" ఆశ్చర్యంగా అడిగేడు గోపీ.
    "ఆఁ అప్పుడప్పుడూ..." తమాషాగా పొగ అతనిముఖాన ఊదుతూ అంది. ఉక్కిరి బిక్కిరయ్యేడు గోపీ.
    సిగరెట్ ఆష్ ట్రే పై పెట్టి ఫాన్ వేసి అతని వేపుగా తిప్పింది.
    "అబ్బ! వాసన" అన్నాడు తేరుకున్న గోపీ.
    ఆష్ ట్రే పై సిగరెట్ తగలడుతోంది.
    "అది కాలిపోతోంది"
    "కాలనీ ఏం చేస్తాం. కొన్ని అంతే! ఉపయోగించినా ఉపయోగించకున్నా అలా తగలబడిపోతూనే ఉంటాయి. కొందరికి ఆ విషయం అర్ధం కాదు"
    ఆమె మాటల్లోని చురక అతనికి అర్ధం కాలేదు.
    "వెళతాను" అని లేచాడు గోపీ.
    అతని భుజాలపై చేతులు వేసి నొక్కి "అబ్బ! రాధ ఏం పారిపోదులే యింతలో, జస్టు కంపెనీ యిచ్చి వెళ్ళరాదా?" అంది రోజీ.
    "రోజీ"
    "ఇప్పటికర్ధమైందన్నమాట దొరగారికి. ఇంకా ఎన్నేళ్ళు వేచి వుండాలో అనుకుని చచ్చి పోయాననుకో.
    ఆమె ముఖంలోని ఆనందాన్ని చూసి అతనికి ఆశ్చర్యం వేసింది.
    డ్రాయింగ్ రూమ్ తలుపులు చేరవేసింది రోజీ.


                                      13


    దసరాకి వెళ్ళిన గోపీకి రమణయ్య మామూలుగా వ్యవహరించటం చూసి ఆశ్చర్యంగా ఉంది.
    "గోపీ! రామూ బావున్నాడా. వాళ్ళనీ తీసుకుని రాకపోయావా? ఈ పదిరోజులూ ఉండి వెళ్ళేవారుగా" అన్నాడు రమణయ్య.
    "రాధకి కాస్త నలతగా ఉంది అన్నయ్యా" అన్నాడు గోపీ.
    "అరరే! ఎప్పటినుంచి? ఎలా వుంది మరి నీవు వచ్చేశావేం?"
    "అబ్బే! పెద్దగా గాబరా పడవలసిందేం లేదు; ఇప్పుడు బావుంది. మళ్ళీ ప్రయాణాలు చేస్తే అలసటగా వుంటుందని రాలేదు" అన్నాడు.
    రమణయ్య ఇంకేం అన్లేదు.
    తను తెచ్చిన బేగ్ లోంచి రాము ఫోటో తీసి యిచ్చేడు గోపీ. బొద్దుగా ముద్దులు మూట కడుతూ వున్న రాముని చూడగానే రమణయ్య ఒళ్ళు పులకరించింది.
    "వీడిని చూడాలని ఉందిరా గోపీ! కాస్త వెసలుబాటు కాగానే వస్తాను" అన్నాడు రమణయ్య.
    ఆ మాటలు వినగానే "అన్నయ్యా! నన్ను మన్నించు. ఆరోజు అందరిలో ఆ వ్యక్తి అలా అంటూ ఉంటే నేనేమీ అనలేకపోయాను. అది నా బలహీనత, మీ మరదలు కూడా చాలా విచారపడింది. మిమ్మల్ని మనసులో పెట్టుకోవద్దని పదేపదే చెప్పింది" అని చెప్పాలనిపించింది. కానీ ఏదో గొంతులో అడ్డుబడ్డట్టయి నోరు పెగల్లేదు.
    కొద్దిసేపయ్యాక "ఓ అయిదువేలు చేబదులు తీర్చాలన్నయ్యా" అన్నాడు గోపీ.
    "అలాగే వెళ్ళేప్పుడు తీసికెళ్ళు" అన్నాడు రమణయ్య.
    "ఈ సంవత్సరం ఓ చిన్న బిజినెస్ ప్రారంభించానన్నయ్యా! ఫణిగారితో కలసి పొగాకు వ్యాపారంలో వాటా కలిశాను, పదివేలు యివ్వాలి!
    "గోపీ! హాయిగా పాఠాలు చెప్పుకుంటూ వుండక ఎందుకు యీ గొడవలన్నీ. వ్యాపారమంటే తలనొప్పి"
    "అదేం లేదన్నయ్యా! మనం మన భాగం డబ్బిస్తేసరి అంతా ఆయనే చూసుకుంటారు."
    "అంతా ఆయనే కష్టపడి నీకు లాభం పంచి ఇస్తాడా?" నవ్వాడు రమణయ్య.
    "అలా అని కాదన్నయ్యా, అందులో పెద్ద కష్టం లేదు. రైతుల వద్ద కొని కంపెనీలో అమ్మేయటం అంతే!"
    "ఏమో గోపీ! నా కవన్నీ తెలీవు. కావాలంటే డబ్బు తీసికెళ్ళు నాదేమి ఉంది? అంతా నీదే! సుఖమయినా కష్టమయినా మీరే అనుభవిస్తారు. కాని ఇప్పుడు డబ్బుకావాలంటే ఎక్కడయినా తేవాలి."
    "శేషు మామయ్యని అడుగు"
    "ఆయన వడ్లకి అడ్వాన్సుగా ఇస్తాడు, పోనీ అలాగే తెస్తాను" అని వెళ్ళిపోయాడు రమణయ్య.
    పని సవరించుకున్న గోపీ పదిహేనువేల డబ్బుతో ఆ రాత్రే రైలెక్కాడు. "పదేపదే జాబులు వ్రాస్తూ ఉండు" అన్న రమణయ్య మాటలు గాలిలో కలిసిపోయాయి.


                             *    *    *


    నే చెప్పలా? మీ అన్నయ్య బంగారు పిచ్చుక.
    "అబ్బే! ఆయనవద్దకూడా సమయానికి లేక మా అన్నయ్య బావగారివద్ద వడ్లకి బయానాగా తెచ్చాడు."
    నవ్వాడు ఫణి.

 Previous Page Next Page