Previous Page Next Page 
మధ్యతరగతి మనిషి పేజి 28


    విందు ముగిసింది.
    ఒక్కరొక్కరే సెలవు తీసుకుని వెళ్ళిపోసాగారు.
    రమణయ్య పిల్ల వాడెక్కడ ఉన్నాడు కనుక్కుని వాడివద్దకి వెళ్ళాడు. తొట్లో పడుకుని హాయిగా నిద్రపోతున్న రామూని చూసి ప్రేమగా వాడి చెక్కిలి నిమిరాడు. మెల్లిగా జేబులో దాచి తెచ్చిన డబ్బు తీసి వాడి పక్కకింద పెట్టాడు.
    మెల్లిగా తను స్నానం చేసినచోటుకి వెళ్ళి తను విడిచిన గుడ్డల కోసం వెతికాడు. అవి కనిపించలేదు. తన సంచీ వెదుక్కుని అందులోని చాకింటి బట్టలు తీసుకుని తను కట్టుకున్నవి విడిచి, అవి కట్టుకున్నాడు. తను విడిచినవి జాగ్రత్తగా కొయ్యకి తగిలించాడు.
    తను వచ్చిన పెరటి గుమ్మంగుండానే బయటికి వచ్చి ముందుకి సాగేడు. తమ్ముడో, మరదలో కనిపిస్తారేమోనని క్షణంసేపు జంకేడు. అదృష్టవశాత్తు ఎవరూ రాలేదు.
    అంతలో తనని పలకరించిన ఆ మొదటి ప్యూన్ కనిపించేడు.
    "ఏం పెద్దయ్యా! వెళ్ళిపోతున్నావా?" అని చిరునవ్వుతో అడిగేడు వాడు.
    "అవున్నాయనా! వెళుతున్నాను, మీ చిన్నయ్యగారితో చెప్పు"
    "చిన్నయ్యగారా?"
    తన తప్పు తెలుసుకున్న రమణయ్య తడబడ్డాడు.
    "అదేలే! మే మలాగే పిలుస్తాం." అని "వస్తా బాబూ!" అన్నాడు రమణయ్య గేటువేపు నడుస్తూ.
    వాడు తల గోక్కుని రమణయ్యవేపు అదోలా చూసి చేయి చాచేడు. వాడి సైగ అర్ధంకాలేదు రమణయ్యకి.
    "ఏదైనా బహుమతి"
    జేబులోంచి అయిదు రూపాయలు తీసి యిచ్చేడు రమణయ్య. రిక్షా వాడికి రూపాయిన్నర యివ్వలేని రమణయ్య.
    వాడు వంగి వంగి సలాములు చేశాడు.
    తల పంకించి కదిలాడు రమణయ్య. ఆయన్ని గేటుదాకా సాగనంపి వచ్చిన గోవిందు "ఈ పల్లెటూరి ముండాకొడుకు చూడటానికి అసహ్యంగా ఎడ్డిదిడ్డంగా ఉన్నా వాళ్ళవద్దే డబ్బు మూలుగుతూ ఉంటుంది. ఎవరికిచ్చినా భారీగా ఇస్తారు వాళ్ళే" అనుకున్నాడు.
    స్టేషనుకు వెళ్ళి రమణయ్య రెడీగా ఉన్న రైలుకి టిక్కెట్టుకొని ఎక్కగానే కదిలింది.


                             *    *    *


    గోవిందూ! గోవిందూ!"
    రాధ కేక వేసింది అతనికోసం.
    వచ్చిన అతిధులందర్నీ పంపించి వేసి, పని మనుషులకీ జవాన్లకీ పనులు పురమాయించి "అబ్బ! ఇప్పుడు క్షణం విశ్రాంతి దొరికింది. అనుకున్న రాధకి బావగారు గుర్తుకొచ్చారు.
    ఉదయం కలెక్టరుగారిని ఆహ్వానించే హడావిడిలో తను ఆయన్ని పలకరించే అవకాశం లేకపోయింది, తర్వాత కూడా ఆయన అజాపజా కనుక్కునే వీలులేకపోయింది. అందుకే ఆయన విషయాలు అన్ని గోవిందుకి అప్పగించింది. వాడు హనుమంతుని లాంటివాడు. ఆయన్ని బాగానే చూస్తూ ఉంటాడు అనుకున్న రాధ గోవిందుని కేకేసింది బావగారిని గూర్చి కనుక్కునేందుకు.
    "ఏమిటి గోవిందూ అంటున్నావు" అడిగాడు అప్పుడే వచ్చిన గోపీ.
    "పిలిచారా అమ్మగారూ!"
    "ఆ! ఆయన ఏరీ?
    "ఎవరు? మీ పాలేరుగారా అమ్మగారూ, భోజనాలు చేశాక వెళ్ళిపోయారు" అన్నాడు. అయిదు రూపాయలు అతన్లో మార్పు తెచ్చాయి.
    "వెళ్ళిపోయారా?" నిర్ఘాంతపోయింది.
    "అవునమ్మగారూ! మీ చిన్నయ్యగారితో చెప్పు అని వెళ్ళాడు. చిన్నయ్యగారెవరని నేను నవ్వుతూ అడిగాను. ఆయన దానికి మేమలాగే పిలుస్తాం అన్నారు."
    వాళ్ళిద్దరికీ నోటమాట రాలేదు.
    అతనిముందు బయటపడటం ఇష్టంలేక ఇంట్లోకి వెళ్ళి బెడ్ రూమ్ లోకి నడిచారు.
    "చాలా ఘోరం జరిగిపోయింది. ఆయనెంతగా బాధపడ్డారో"
    "వచ్చేవారు ముందుగా వస్తే ఎంతబావుండేది, ఆయనా ఆ వేషంలో వస్తే ఈటౌన్ మనుషులు ఏమనుకుంటారు?" అంది రాధ.
    "రాధా!
    ఆ కేకకి ఉయ్యాలలో వున్న బాబు లేచాడు. కొడుకు వద్దకి వెళ్ళిన రాధ వాడు లేవటంతో ఎత్తుకుంది, అప్పుడు చూసింది ఆ డబ్బుని.
    "ఏమండీ! డబ్బు" అంది గాబరాగా.
    ఆ నోట్లు, ఆ కట్ట కట్టినతీరు, ఆ ప్లాస్టిక్ పేపరు కవరు చూసి అది తన అన్నయ్య ఇచ్చిన డబ్బుగా గ్రహించాడు గోపీ.
    "చూశావా రాధా మనం వేలకి వేలు తగలేసి విందు ఇచ్చాం, వచ్చిన మనుషులకి దేవేంద్ర వైభవంగా సత్కారాలు చేశాం. కానీ ఎవరయితే ఈ యిల్లు కొనటానికీ, ఈ దర్జాకీ కారణమైన డబ్బు సంపాదించి ఇచ్చాడో ఆ పుణ్య పురుషుడిని మనసారా కూడా పలకరించలేకపోయాం. అయినా ఆయన - మనమంటే అభిమానం, బాబంటే ప్రాణం పెట్టే మనిషి - యీ ఖర్చులకి డబ్బు అవసరం అవుతుందేమోనానుకుని తెచ్చి, మనం పలుకరించకపోయినా - పాలేరని అందరూ అనుకున్నా_ అనుకున్నట్టుగా డబ్బు అందజేసే వెళ్ళాడు"
    గోపీ గొంతులో వేదన సుళ్ళు తిరుగుతోంది.
    రాధ ఏమీ మాట్లాడలేకపోయింది.
    ఇద్దరి మధ్యా మౌనం రాజ్యం చేసింది.


                                                *    *    *


    "అబ్బ! అబ్బ! నీ పేరు మారుమోగుతోంది టౌన్లో, గృహ ప్రవేశానికి పది పండెండు వేలు ఖర్చుచేసినవాళ్ళీ మధ్య లేరు! ఆ అరంజ్ మెంట్స్ అన్నీ అందర్నీ ముగ్దులని చేశాయ్"
    ఫణి మాటలు విని గర్వంగా నవ్వింది రాధ.
    "కానీ కింగ్ మేకర్ వి నువ్వు. అవసరానికి డబ్బు ఆదుకోకపోయినా, అరేంజ్ మెంట్స్ చేయకపోయినా ఏమయ్యేది"
    "గోపీ! అదంతా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఎవరికీ తెలిసేది కాదు. లైమ్ వైబ్ లోకి వచ్చేరా మీరు"    
    "థాంక్స్ ఎలాట్." అని లేచి వెళ్ళి బీరువా తెరిచి అయిదువేలు తెచ్చి ఇచ్చాడు గోపీ.
    అది అందుకుని "ఎక్కడిది?" అని అడిగేడు ఫణి.
    "మా అన్నయ్య పంపాడు"
    "అన్నట్టు మీ అన్నగారు ఫంక్షన్ కి రాలేదని చెప్పారు. ఎందుకు ఎవరో పాలేరు వచ్చాడట కదా? ఆయనతో పంపాడా?"
    గోపీ ముఖం మాడిపోయింది, రాధ ముఖంలోకి చూసి "అవునవును" అన్నాడు.
    రాధ మాట్లాడలేదు.
    ఫణి లేచాడు.
    "పల్లెకు వెళ్ళి టొబాకో బేరం చేసిరావాలి" అన్నాడు.
    "ఎన్ని వ్యాపారాలండీ మీకు?" నవ్వుతూ అడిగింది రాధ.
    "రాధగారూ! ఎన్ని చేసినా మనస్సుకి తృప్తిలేదు. సుఖాలకి చాలిన డబ్బు లేదు. కడుపు నింపుకోవటానికి ఎన్నో మార్గాలు "అని" అన్నట్టు మీరూ ఏదైనా బిజినెస్ లో భాగం కలపరాదూ?" అని అడిగాడు ఫణి.
    "బోర్! డబ్బంటే చేదు కాదు కానీ ఆ వ్యవహారాలంటేనే తలనొప్పి" అంది రాధ.
    "డబ్బొస్తూ ఉంటె అన్నీ బాగానే ఉంటాయి. పదివేలు మీవి కావనుకుని ఇలా పడెయ్యండి, ఏడాది తిరిగే సరికి మీ డబ్బు మీరు తీసుకోండి. మళ్ళీ ఏడాదేడాది అలాగే తీసుకుంటూ ఉండండి"
    "అయినా ఇప్పుడు డబ్బెక్కడుందిలెండి"
    "మీకేం తెలుసండీ ఎంత వుందో? పంటలు ఎలా పండుతున్నాయ్ ఎంత ధరలున్నాయ్.
    రైతులు బాగా దాచుకో మరిగారు. మీ అన్నగారి విషయమే చూడండి. మిమ్మల్ని చదివించాడు, ఇల్లు కట్టాడు, క్షణాలపై ఇల్లు కొనటానికి డబ్బు యిచ్చారు. గృహప్రవేశానికి డబ్బు పంపేరు. ఇంకెంత ఉందో ఆయన వద్ద. ఈ పల్లెవాళ్ళ వద్ద డబ్బు మూలుగుతూ వుంటుంది. వాళ్ళు బ్యాంకుల్లో వేయరు. వడ్డీలకివ్వరు? అంతా దాస్తారు, మీరు ఎన్నెన్ని కధలు విన్లేదు. ముసలాళ్ళు చూస్తూ దేవుడి గదిలో బండల క్రిందా, పెరట్లో చెట్టు మొదట్లో దాచిన డబ్బు బయటపెట్టి చస్తారు. ఒకవేళ అకస్మాత్తుగా హరీమన్నాడో ఆ రూపాయలూ, ఆ బంగారు బిళ్ళలూ మళ్ళీ ఎన్నేళ్ళకో ప్రాప్తమున్న వాడికి దొరుకుతుంటవి."
    నవ్వాడు గోపీ "కధలు బాగా చెపుతారే మీరు" అన్నాడు.
    "కధలు కాదు. మీ అన్నయ్యని డబ్బడుగు, యివ్వకుంటే పందెం నీకు గ్రాండ్ పార్టీ యిస్తాను వేట్ తో.
    "నాకు నాటు వద్దు వేటు వద్దు కానీ పంటలు యింకారాలేదు. రానీ తెచ్చిఇస్తాను"
    "ఆ మాట అన్నావంటే ఓ ఉపాం చెబుతాను. రాబోయే వడ్లకి బయానాగా డబ్బు ఇస్తారు. ఇక్కడ రైస్ మిల్లు వాళ్ళు పండిన ధాన్యం అంతా తోలాలి వాళ్ళకి. దాని ధర దాందే ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా మినహాయించుకుని ఇస్తారు మనకి"
    "ఫణిగారూ! ఆ గొడవలన్నీ పడలేను లెండి, పంటరానివ్వండి తప్పక భాగం కలుస్తాను" అన్నాడు గోపీ. 

 Previous Page Next Page