Previous Page Next Page 
రాగవాహిని పేజి 16

    ఆమె ఎంతగా ఆతృతని అణచుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

    "డియస్పీగారమ్మా!" అంది క్లుప్తంగా జానకమ్మ.

    సత్య చేతిలోని కప్పు సాసరూ కదిలేయి. శబ్దం చేస్తూ వణుకుతున్న చేతుల్లో నిలవలేక మరో రెండు సెకండ్లకి క్రింద పడ్డాయవి.

    వణుకుతోన్న ఆమె పెదాల్నీ, కళ తప్పిన ఆమె ముఖాన్నీ, అదురుతోన్న ఆమె గుండెల్నీ గమనించిన జానకమ్మ కూడా ఆందోళన పడింది.

    "ఏమైంది అమ్మయిగారూ? ఏమైంది?" అని అడిగింది.

    కానీ సత్య సమాధానం చెప్పకుండా ఎటో చూడసాగింది. ఆమె మనసంతా ఎప్పుడెప్పుడు బయటికి పారిపోదామా అని ఆలోచిస్తూ వుంది. ఆమె ఆలోచనల్ని, ఆందోళననీ గమనించలేని జానకమ్మ భయపడిపోయి సతీష్ కోసం పరిగెత్తింది.

    ఆమె డ్రాయింగ్ రూం ముందే నుంచుంది.

    మరో అయిదు నిమిషాలకి డియస్పీని బయటికి పంపించి వేయటానికి వచ్చి జానకమ్మని చూసిన సతీష్ ఆమె ఏదో చెప్పాలని వచ్చిందని గ్రహించుకున్నాడు.

    డియస్పీని కొద్ది దూరం పంపేసి "సెలవు" అంటూ తిరిగి వచ్చేడు.

    "బాబూ" అంది జానకమ్మ ఆందోళన నిండిన స్వరంతో.

    "ఏమిటమ్మా?"

    ఏ భావము ప్రకటించని స్వరంలో పలికేడతను.

    "అమ్మాయిగారదోలా వున్నారు!"

    "నేను వెళ్ళి చూస్తాను ఫరవాలేదు నువ్వెళ్ళు."

    జానకమ్మ వెళ్ళేక ఇటు కదిలేడు సతీష్.

    తలుపు తోసుకుని లోపలికి వచ్చేడు. స్ప్రింగ్ డోర్స్ మూసుకున్నాయి అతని వెనుకే.

    "సత్యా!"

    ఆ ఒక్క పిలుపుతోనే ఆర్తులకి అభయం ఇచ్చినట్టుగా పిలిచేడు సతీష్?

    తెరిచిన కిటికి ముందు నుంచుని బయటి గార్డెన్ నీ ఆ తర్వాత ఎత్తుగా వున్న కాంపౌండ్ వాల్ నీ ఆలోచనా పూర్వకంగా చూస్తున్న సత్య ఉలిక్కిపడింది.

    చప్పున యిటు తిరిగి చూసింది ఆ పిలుపుకి.

    "సతీష్! సతీష్! అతనెవరు? అతను వెళ్ళిపోయాడా" అని గాబరాగా అడిగింది.

    "ఏమిటంత ఆతృత?"

    "ముందు అతనెవరో చెప్పు" ఆందోళనని అణచుకోలేని స్వరంతో అదే గాబరాతో మళ్ళీ ప్రశ్నించింది.

    "సరే! అతను డి.యస్.పి."

    "ఆఁ"

    "ఏమిటి సత్య! ఏమిటి?" అతను ఆమె దగ్గరిగా వెళ్ళే లోపుగానే ఫెయింట్ అయిపోయింది.

    చప్పున ఆమె దగ్గరికి వెళ్ళి పట్టుకున్నాడు.

    ఒక్క క్షణం ఆలస్యం అయివుంటే క్రిందపడబోయే సత్య అతని చేతుల్లో వాలిపోయింది.

    మల్లెపూల దండనీ అలవోకగా చేతికి తీసుకునే ఏనుగులాగా ఆమెని అతి సున్నితంగా చేతుల్లో ఎత్తుకుని తెచ్చి సోఫాలో పడుకోబెట్టి టేబిల్ ఫేన్ ఆన్ చేసి, ఫ్రిజ్ తెరచి అందులోని సీసా తీసుకుని వచ్చి చల్లని నీళ్ళు సున్నితంగా ఆమె ముఖాన చిలకరించేడు.

    తల విదిలించుకుంది సత్య.

    మళ్ళి కొద్దిగా చిలకరించేడు.

    ఆమె కళ్ళు విప్పింది.

    ఎదురుగా సతీష్.

    ఆమె ముఖంలో ధైర్యం, ఆ వెంటనే భయం ఒక్కక్షణంలో ప్రతిఫలించేయి.

    "ఏమండి సతీష్! నన్ను కాపాడు!మీ అయ్యగారితో చెప్పి అతను నన్ను అరెస్టు చెయ్యకుండా చూడు! నన్ను కాపాడు" అంది దీనంగా ఆమె ముఖంలో వున్న దైన్యభావానికి అతని మనస్సు కరిగిపోయింది. "ఈ అమ్మాయికోసం ఏమైనా చెయ్యొచ్చు" అనుకున్నాడు.

    "తప్పకుండా చెపుతాను. ఇంతకీ ఏమిటి నీ భయం?"

    "ఆఁ ఆఁ డియస్పీ నన్ను అరెస్ట్ చేయటానికి కదా వచ్చింది? ఏమడిగేడు? ఏం చెప్పేరు?"

    ఒక్కక్షణం సతీష్ కనుబొమ్మలు ముడిపడ్డాయ్.

    "డియస్పీనా?" అస్పష్టంగా పలికేడు.

    "ఆఁ"

    అతని మనో మందిరంలో ఏదో తెర తొలగినట్లయింది.

    పకపక నవ్వేడు.

    విస్తుపోయింది సత్య.

    విరగబడి నవ్వేడతను.

    ఉక్రోషంగా చూసింది సత్య.

    నవ్వి నవ్వి అలసిపోయినట్లుగా ఆగిపోయేడతను.

    "మైడియర్ సత్యా! ఆ వొచ్చింది డియస్పీనే. కానీ పోలీస్ సూపర్నెంటు కాదు. నాకు తెలిసిన వ్యక్తి. అతనిపేరు డి.శివప్రకాష్. మేమే కాదు. దేశం దేశం అంతా అతన్ని డియస్పీ రెడ్డి అంటారు. అతనిదో వింత చరిత్ర?"

    "హమ్మయ్య!" అని గుండెలమీద చేయి వేసుకుని దీర్ఘంగా నిట్టూర్చింది సత్య. ఆమె మనస్సు క్షణాలపై తేలిక పడింది.

 Previous Page Next Page