"నేను అలా అనలేదు సత్యా? తమాషాకి అన్నాను. సామాన్యంగా ఆడవాళ్ళు అందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రేమిస్తారు. దర్జాగా, నిష్పూచిగా, హాయిగా జీవితం వెళ్ళబుచ్చాలనుకుంటారు. అందుకే అలా అడిగేను.
ఆ మాటకొస్తే అందులో తప్పేంలేదు.
ఆయనకి ఐశ్వర్యం వుంటే నీకు అందం వుంది.
నీ ఐశ్వర్యం వెలకట్టలేనిది. ఇతర్లు శ్రమతో సాధించలేనిది. ఇక ఐశ్వర్యమంటావా? కృషిచేస్తే సంపాదించుకోవచ్చు.
అతని మాటలకి సత్య జవాబు చెప్పలేదు.
మెల్లిగా నడవసాగింది.
గేటువద్దకి వచ్చాక "జాగ్రత్త!" అని వెంకయ్యనీ హెచ్చరించాడు. సతీష్ కారులో కూర్చుంటూ,. సత్య కూడా ముందు సీట్లోనే అతని ప్రక్కకు కూర్చుంది.
చిలకా గోరింకల్లాగా వున్న వాళ్ళని చూసి అతని భార్యో, నిశ్చయమైన అమ్మాయో, ప్రియురాలో, స్నేహితురలో తెలుసుకోలేని వెంకయ్య ఏది ఏమైనా చూడముచ్చటగా వున్నారనుకున్నాడు.
కారు కదిలింది.
దార్లో ఏమీ మాటాడుకోలేదు వాళ్ళు.
* * *
రెండు రోజులు గడిచాయ్.
ఆ రోజు ఉదయమే బ్రేక్ ఫాస్టు ముగించుకుని టైమ్స్ వీక్లి చూస్తూ కూర్చున్నాడు సతీష్.
అతనికి కాస్త దూరంలో మరో సోఫాలో అర్ధమైనా కాకున్నా లైఫ్ మేగజయిన్ చూస్తోంది సత్య. అదే సోఫాలో ఈవ్స్ వీక్లి, ఫిలింఫేర్, శంకర్స్ వీక్లి మున్నగు పత్రికలున్నాయి.
హఠాత్తుగా మోగింది ఫోన్.
అలాగే వీక్లి చూస్తూ ఫోనందుకున్నాడు మామూలుగా.
"హలో!"
సతీష్ అతి మెల్లగా మాటాడుతాడు. జాగ్రత్తగా వినకపోతే ఆ మాటలు అర్ధంకావు. ఇక ఫోన్ లో మాటాడేటప్పుడు అతని స్వరం మరీ మృదువుగా జలతరంగిణి మ్రోగినట్లుగా వుంటుంది.
అతని మాటలు వీనులవిందుగా వినిపించినట్లుగా వుంటాయి సత్యకి.
"హలో!"
"నేను డి.యస్.పి.ని."
"నమస్తే...."
"నమస్తే...."
"ఏమిటి విశేషాలు...."
"మీతో స్వయంగా మాటాడాలి. ఎప్పుడు వీలవుతుందో చెపితే మళ్ళీ ఫోన్ చేసి వస్తాను."
కొన్ని క్షణాలు ఆలోచించాడు సతీష్. "ఇప్పుడే రాగలిగితే ఇంట్లోనే వుంటాను. మరో గంటదాకా ఎక్కడికి వెళ్ళను. ఆ తర్వాత థియేటర్ కి వెళతాను" అన్నాడు.
"పిక్చర్ ప్రోగ్రామా?"
"నో! నో! నథింగ్! అలాంటివి ఏమీ వుండవు. ఏదో ఫార్మల్ చెకింగ్. అంతే"
"అయితే యిప్పుడే తీరిగ్గా వున్నారా?"
"ఆఁ మరో పది నిమిషాల్లో రాగలిగితే రండి."
"విత్ ప్లెజర్! జస్టు పదినిమిషాల్లోనే వచ్చేస్తాను. నా పని కూడా పది పదిహేను నిమిషాలకి మించి వుండదు అంతే."
"అచ్చా!"
అవతల వ్యక్తి ఫోన్ క్రెడిల్ చేశాడు.
తనూ ఫోన్ పెట్టేసి, బజర్ నొక్కి ఇటు తిరిగిన సతీష్ సత్యని చూసి విభ్రాంతుడయ్యేడు.
ఆమె ముఖం నిండా చెమటలు పట్టేయి. కళ్ళలో భయం! భీతి! ఆందోళన! ముఖం కళ తప్పిపోయింది. అవకాశం యిస్తే కిటికీలోంచి దూకి పారిపోదామా అన్నంత ఆవేశం వుంది ఆ ముఖంలో!
"సత్యా!"
మృదువుగా పిలిచాడు.
"ఊఁ" విచలిత కంఠంతో బదులు పలికింది.
తను కూర్చున్న సోఫాలోనే కదలకుండా స్విచ్ నొక్కేడు. ఆటోమేటిక్ గా ఆమె వెనుక వున్న కిటికి తెరలు చప్పున తెరచుకున్నాయి. అంతవరకూ దారి నెరుగని గాలి గుప్పున ఇంటిమేట్ చిమ్మినట్లుగా చల్లగా వీచింది. క్షణకాలం శరీరానికి హాయి అనిపించింది.
ఆమె ముఖంలోని భయాందోళనలు తగ్గలేదు.
"ఒక్కదానివే కూర్చో! నేను మరో పది నిముషాల్లో ఆ వచ్చే వ్యక్తితో జస్టు పది పదిహేను నిమిషాలు మాటాడి పంపేస్తాను. నేను డ్రాయింగ్ రూంలోకి వెళతాను."
తలూపింది మెల్లిగా.
అంతలో జానకమ్మ రాగానే "జానకమ్మా! రెండు ఓల్టీన్ పంపించు డ్రాయింగు రూంలోకి, అలాగే అమ్మాయిగారికి వేడివేడిగా ఓ కప్పు పంపించు. లేదా తెచ్చివ్వు" అనేసి డ్రాయింగ్ రూంలోకి వెళ్ళేడు.
జానకమ్మ తలూపి వెళ్ళిపోయింది. మరో అయిదు నిమిషాలకి వేడివేడిగా కలుపుకుని తెచ్చింది ఓల్టీన్.
చప్పున కప్పు అందుకుని "జానకమ్మా? అతనితో డ్రాయింగ్ రూంలో మాటాడుతోంది ఎవరు?" అని అడిగింది.