Previous Page Next Page 
రాగవాహిని పేజి 17

    "నేను! నేను ఆ వచ్చిన వ్యక్తి పోలీస్ అధికారి అనీ. ఆ హత్యా నేరం విషయమై మిమ్మల్ని ఆచూకి కనుక్కుని వచ్చాడేమో నని హడలి చచ్చాను. ఇంతకీ అతనెవరు?"

    "ఒక్కక్షణం ఆగు! వేడి వేడి కాఫీ తాగి సేద తీరేక చెపుతాను" అని జానకమ్మని కేకేసి కాఫీ తెప్పించి సత్య తాగాక డియస్పీ కథ చెప్పసాగాడు.

                                       *        *        *

    సామాన్యమైన కుటుంబంలో అతిసామాన్యమైన పల్లెటూళ్ళో పుట్టేడతను. చదువు సంధ్యలకి ఆ కుటుంబాలకి ఆమడదూరం. అయినా అతని నాన్న ఆ వూరి కరణంగారి వద్ద చదువు నేర్చుకుని సంస్కారాన్ని అలవర్చుకున్నాడు. ఆ సంస్కారంతో కొడుక్కి బాగా చదివించాలని యమ యాతనలకి లోనై కొడుకుని ఊరి ఊర్లకి పంపి చదివించేడు.

    తిండికి నిద్రకి సుఖానికి తపించకుండా చదువుకున్నాడు డియస్పీ. ఎలిమెంటరీ పాఠశాల చదువు మొదలుకొని యునివర్శిటీ చదువుదాకా ఎదిగేడు. ఒక్కో స్టేజిలో ఆ విద్యావిధానంలో ఆ విద్యాభ్యాసంలో ఆ ఉపాధ్యాయుల్లో వున్న లోపాల్ని గ్రహించేడు.


    మహారణ్యాల్లో మంటలు బయలు దేరతాయ్. వాటిని ఆర్పెయ్యాలని పిపీతికలు-అంటే చీమలు-దండుగా బయలుదేరతాయట. ఆ మహాగ్నిలో అవి సర్వనాశనమౌతాయి. అయినా అవి పట్టుదల వదలవు. చచ్చేవి చస్తూవుంటే వచ్చేవి వచ్చేస్తుంటాయి అయినా పట్టుదల వదలకుండా లక్షలుకోట్లుగా వచ్చేసే వాటి రాకవల్ల ఏర్పడ్డ ధూళికి ఆ మంటలు ఆరిపోతాయట ఏ కొంతో! చివరికి అయి కార్చిచ్చు ఆగిపోతుందట వ్యాపించకుండా.

    అలాంటి యత్నమే చేశాడు డియస్పీ కూడా.

    దేశం బాగుపడాలంటే విద్యావిధానం బాగుపడాలని తీర్మానించుకున్నాడు. అందుకే తానూ ఓ సాధనం కావాలని ట్రైనింగ్ కి వెళ్ళేడు. ఉపాధ్యాయుడయ్యాడు. కానీ అంతమందిలో ఒక్కడయ్యాడు. ఏటికి ఎదురీద లేకపోయాడు. నలభయ్ యాభయ్ మంది ఉన్న ఉన్నత పాఠశాల్లో ప్రధానోపాధ్యాయుడే మెజారిటీ వర్గానికి లొంగిపోయి నిర్లక్ష్యంగా వున్న స్థితిలో యితనేం చేయలేకపోయాడు.

    ఉన్న ఊళ్ళో ఉండి వ్యవసాయం సాగించుకోటానికి అనుకూలంగా వుంటుందని ట్రైనింగ్ అయి వస్తోన్న వర్గం ముందు అతనేం చేయలేకపోయాడు.

    రోజులు మారేయి. విద్యార్ధులలో క్రమశిక్షణ లోపించింది. శ్రద్ధ నశించింది. సినిమాలపై పెరిగిన మోజు పాఠాలని దూరం చేసింది.

    ఏటికి ఎదురీదలేననుకున్నాడు డియస్పీ.

    తన దారి తనది. దేశం మార్గం వ్యతిరేకంగా వుంది. తన మార్గాన్ని పటిష్టం చేసుకుంటే కానీ తన జీవితలక్ష్యం సాధించుకోలేడు. రోజుల తరబడి చేసిన ఆలోచనకి ఫలితంగా సాందీపుని విద్యాలయం వెలసింది.

    ఊరికి దూరంగా పదెకరాల పొలం ఉచితంగా సంపాదించాడు. వారిని వీరినీ యాచించాడు. సాధించాడు. ఆశ్రమ వాటికలాగా తీర్చిదిద్దాడు.

    అక్కడ చదివే విద్యార్ధులు జీతం కట్టక్కరలేదు. పని చేసే ఉపాధ్యాయులకి జీత బత్తేలుండవు. అందరికీ కామన్ హాస్టలు. పిల్లలు, టీచర్లు వాళ్ళ పిల్లలు అంతా అక్కడే భోజనం. అందరికి బట్టలు ఉచితం. వైద్యం ఫ్రీ. బుక్స్ ఫ్రీ....

    అన్ని రకాలుగా ఆదర్శ పాఠశాల అయింది. గవర్నమెంట్ గుర్తించింది. అతని శ్రమనీ విలువనీ గుర్తించింది.

    వివిధ పత్రికలు ప్రశంసించాయి. మంత్రులొచ్చారు. మెచ్చుకున్నారు. దాతలొచ్చారు. అచ్చా అన్నారు. మెచ్చుకుని ప్రశంసించారు. విరివిగా విరాళాలు యిచ్చారు.

    దేశంలో అలా తెచ్చేడు. ఇలా పంచేడు. పాఠశాల పెంచేడు. విద్య అంటే యిదీ విద్య అనిపించే అందరితో, ఆ పాఠశాలలో చేరిన విద్యార్ధి బి.ఏ. అయ్యేదాకా బయటికి రాలేడు. వచ్చేసరికి ఓ రత్నం! ఓ ముత్యం! పాసుమార్కులనే ప్రసక్తేలేదు. నూటికి నూరు! లేదా ఓ పదో అయిదో తక్కువ అంతే! పాఠాలతో కుస్తీ పట్టేవాళ్ళు చిత్తు చిత్తు చేసే వాళ్ళు! చదువు! చదువు! అంతే! మరో వ్యాపకం లేదు.

    అయితే చదువుతోపాటు వ్యవసాయం, వడ్రంగం, నేతలాంటి వృత్తి విద్యలు నేర్పేవారు. అక్కడ చదివివచ్చిన వాడికి పెరటితోట ఎంత ఉపయోగమో తెలిసొచ్చేది.

    ఎంత గొప్పవాడైనా విమర్శకు అతీతుడు కాడు.

    గావంచ, పైపంచె తప్ప మిగుల్చుకోని డియస్పీ అంటే కూడా విమర్శలొచ్చాయి. కడుపుకుట్టు ఎంతపనైనా చేయిస్తుంది. ఎవరో గిట్టని ఓ క్రూరుడు ఆ దేవాలయాన్ని అగ్నికాహుతి చేశాడు. పిల్లలు, ఉపాధ్యాయులు అంతా శృంగేరికి వెళ్ళిన సమయంలో తనూ, వాచ్ మన్, క్లర్క్ మాత్రం వున్నరోజు జరిగిందా సంఘటన!

    అర్ధరాత్రి! కారుచీకటి అమావాస్య!

    అగ్ని నాల్కలుసాచి ఆకలిగొన్న సింహంలాగా అన్నీ మింగేస్తూ వుంటే చూస్తూ ఏమీ చేయలేక ఆవేశాన్ని దుఃఖాన్ని ఆ క్షణంలో అణుచుకోలేక అదే అగ్నిలో దూకి చస్తానని వెళుతోన్న డియస్పీని ఆపేడు వాచ్ మన్.

    తెల్లారేసరికి అంతా స్మశాన వాటిక అయింది.

    కష్టపడి సంపాదించిన లైబ్రరీ, సామాగ్రి, అందరి వస్తువులు, వంటపాత్రలు, తిండిగింజలు, ఆడియో లీజువల్ సెట్ అదీ యిదీ అని అనకుండా ఆఫీసు రికార్డులతో సహా ధ్వంసమైపోయింది.

    కట్టుబట్టలతో నిలబడ్డ డియస్పీ మానసికంగా దెబ్బతిన్నాడు. ఆ సమయంలో ప్రజలే ఆదుకున్నారు నా అధ్యక్షతన ఓ సంఘం ఏర్పాటు చేశారయ్యగారు. లక్షలు లక్షలు విరాళాలు వచ్చాయి. తిరిగి రెట్టింపు ఉత్సాహంతో నిర్మించాం. శాశ్వతంగా వుండేట్టు ఇటుకలతో, ఆస్బెస్టాస్ పలకలతో కట్టేము.

 Previous Page Next Page