ఆశ్చర్యంగా అతన్నే చూస్తూ "ఏమిటి సతీష్ పెళ్ళంటే అంతగా మురిసిపోతున్నావ్? పెళ్ళి నీకా? మీ అయ్యగారికా?" అని తమాషాగా అడిగింది.
గేటువద్దకెళ్ళి బజర్ మ్రోగించాడతను, ఆమె ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా.
అది చాలా పెద్ద గార్డెన్ కావటం వల్ల గేటునుంచి పిలిస్తే ఏ మూలో వుండే తోటమాలికి వినిపించదని కాలింగ్ బెల్ సిస్టమ్ అరేంజ్ చేశారు. ఒక్కచోట నొక్కితే అది తోటలో అయిదారుచోట్ల మ్రోగుతుంది. అది వినగానే పరిగెత్తుకొని వస్తాడు తోటమాలి.
తర్వాత సత్యవేపు తిరిగి "సత్యా! మా అయ్యగారి పెళ్ళయినా నా పెళ్ళయినట్టే! ఆయనకి అమ్మాయి నిశ్చయమైతే నాకయినట్టే, ఎందుకంటే ఆయన ఎప్పుడో చెప్పేశారు. తన పెళ్ళిలోనే నా పెళ్ళీ గ్రాండ్ గా జరగాలని" అన్నాడు.
అంతలో తోటమాలి రావటంతో సత్య మౌనం వహించింది. అతనొచ్చి "దండాలండి అయ్యగారూ!" అని సతీష్ కు నమస్కారం చేసి తలుపు తెరిచాడు.
ఇద్దరూ నూతన గృహప్రవేశం చేసే వధూవరుల్లాగా తోటలో అడుగు పెట్టేరు. తోటమాలి తిరిగి తాళం వేయబోతూ వుంటే "వెంకయ్యా నువ్విక్కడే వుండి కారుని చూస్తూవుండు. ఈ మధ్య కారు దొంగలుకూడా ఎక్కువయ్యేరు. మేం వెళ్ళి అలా అలా తిరిగివస్తాం?" అన్నాడు సతీష్.
"చిత్తం! చిత్తం!" అంటూ ఆగిపోయాడతను.
"బావుంది.... అయ్యగారికంటే ఠీవి ఎక్కువే వెలగబెడుతున్నావే." అంది సత్య.
"ఏమనుకున్నావు మరి నేనంటే?" కొంటెగా నవ్వాడతను.
పకపక నవ్వింది సత్య.
"ఏం నవ్వుతావ్?"
"ఏం లేదులే! ఇలా అధికారాలు చెలాయించడం ఈ దేశంలో మామూలే! ఇందిర ప్రధానయితే సంజయ్ పెత్తందారయ్యాడు. అలాగే అన్నిచోట్లా, ఆఖరికి మా పల్లెటూళ్ళలో కరణం, మునసబు కొడుకులు వాళ్ళ తమ్ముళ్ళు అసలు వాళ్ళకంటే ఎక్కువే అధికారం చెలాయిస్తారు. అసలు వాళ్ళ నాశనానికి నాంది పాడతారు."
సతీష్ బదులు పలకలేదు.
సత్య కూడా మరేమీ అనుకోకుండా అతన్ని అనుసరించింది.
అది ద్రాక్ష పండే కాలం కాదు, అందుకని తోట అంతా పచ్చపచ్చగా వుందేతప్ప ఎక్కడా ఆకర్షణీయంగా లేదు.
ఒకచోట ఆగి "ఇక వెళదామా? ఎంత తిరిగినా యింతే పంట కొచ్చినప్పుడు వస్తే గుత్తులు గుత్తులుగా వేళ్ళాడే పళ్ళని చూస్తుంటే ఎంతో అందంగా వుంటుంది" అన్నాడు సతీష్.
"అలాగే వెళదాం పద!"
వెనుతిరుగుతూ అడిగింది మళ్ళీ "ఇంత ద్రాక్ష ఏం చేస్తారు?"
"మామూలుగా అందరూ రాష్ట్రంలో వివిధ పట్టణాలకి ఎగుమతి చేస్తారు. కానీ మేం మాత్రం అంతా విదేశాలకి ఎగుమతి చేస్తాం. ఈ రకం ద్రాక్షకి విదేశాల్లో చాలా గిరాకీ వుంది."
"అబ్బో చాలా ఆదాయం వస్తుందే?"
"ఊఁ"
"ఇదిగో సతీష్ మీ అయ్యగారిని త్వరగా పెళ్ళి చేసుకోమను, భార్యతో సహా విదేశాలకి వెళ్ళి రావచ్చు" అంది నవ్వుతూ.
నడుస్తున్న వాడల్లా ఆగి ఆమెవైపు చూశాడు.
"ఏం అంత వింతగా చూస్తున్నావ్?"
"ఏం లేదు. ఎందుకంతగా మా అయ్యగారికి పెళ్ళికి నువ్వు తహతహ లాడుతున్నావా అని? ఏమిటి నీ ఇంటరెస్టు?" గుచ్చిగుచ్చి చూస్తున్నట్టుగా అడిగేడు.
"నువ్వేమిటలా చూస్తున్నావ్? అయినా ఇందులో నా యింటరెస్టు ఏముంది? మీ అయ్యగారి పెళ్ళయితే ఆయనా భార్య ఇంటిపట్టున వుంటే ఇల్లూగిల్లూ చూసుకుంటారు-- ఎప్పుడూ బిజినెస్ బిజినెస్ అంటూ దేశం మీద పడకుండా సుఖపడతాడనీ అన్నాను."
"అంతేనా?"
"కాక ఇంకేమిటి?"
"ఏం లేదులే! చూస్తూ చూస్తూ వుంటే మా అయ్యగారిపై ఇష్టం, ఆయనపై సదభిప్రాయం, ఆయన ఆస్థిపై ఇంటరెస్టు పెరుగుతుంది.... ఏమైనా ఆయన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావేమో ననుకున్నాను. ఒకవేళ అలాంటి అభిప్రాయం వుంటే చెప్పు. ఫరవాలేదు. మాటాడతాను. నీ అందానికి మా అయ్యగారి ఐశ్వర్యానికి, అందానికి తగిన జోడి అవుతుంది."
హఠాత్తుగా నిలబడిపోయింది సత్య.
ఆమె ముఖం సిగ్గుతో ముడుచుకుపోయింది. కొద్దిగా కోపం కూడా వచ్చింది. దాంతో ముఖం వాడిన రోజాలా అయింది.
"ఎంత మాటన్నావ్? నేనేం దురాశ పరురాలిననుకున్నావా? నాకేం అంత ఆశలేదు. ఈ తోటలూ, ఈ దొడ్లూ, ఈ కార్లూ, ఈ ఐశ్వర్యం చూసి నేను భ్రమపడ్డాననుకున్నావా?"
నే నెవరో నాకు తెలీదా? నా అంతస్తు, నా యోగ్యత నాకు తెలీదా? అందని పళ్ళకి ఆశ పడతాననుకున్నావా?
నేనెక్కడ? ఆయనెక్కడ?
నక్కకి నాగలోకానికి పోలికెక్కడ?
సతీష్! చాలా పొరపడ్డావ్? నా కలాటి వ్యామోహం లేదు."
గద్గద కంఠంతో అన్న మాటలు విని తృప్తిగా నిట్టూర్చేడు సతీష్. చూసినప్పటి నుంచీ ఆమె అందానికీ, గుణగణాలకి మార్కులు వేసుకుంటూ వస్తోన్న సతీష్ ఈ జవాబుతో ఆ మొత్తానికి మరిన్ని మార్కులు కలిపేడు.