"మరి వెళదామా?" అని అడిగింది మాట మారుస్తూ. ఎవరికయినా ముఖాన్నే "నువ్వందంగా వున్నావు! దేవతవి" అంటూంటే ఎలా వుంటుంది?
ఆమె ఎటికసీకి మృదువుగా నవ్వి "పద!" అని కదిలేడు.
అతన్ననుసరించిందామె.
ఇద్దరూ జంటగా కారెక్కుతూవుంటే చూసిన జానకమ్మ తృప్తిగా నిట్టూర్చింది.
"అమ్మా!"
బాధగా మూలిగేడతను.
అంతదాకా అతన్ని అంటిపెట్టుకుని అతని ఆరోగ్యాన్ని అతి శ్రద్ధగా పరీక్షిస్తూ కాచుకుని వున్న వ్యక్తి ముఖం వికసించింది.
"అమ్మా!" మళ్ళీ బాధగా పిలిచాడతను.
"కళ్ళు తెరువు!"
బలంగా కనురెప్ప లెత్తేడు. ఆ కాస్త శ్రమకే అలసిపోయినట్టుగా ఆ కనురెప్పలు మళ్ళీ మూతబడ్డాయి.
"ఇటు చూడు జగ్గూ!"
"వూఁ"
"కళ్ళు తెరు!"
"తెరవలేను."
"ఏమైంది?"
"తలంతా భారంగా వుంది. కళ్ళు తెరవాలంటే మెదడులోని నరాలన్నీ చిట్లిపోతున్నట్లుగా వున్నాయి. కళ్ళు తెరవలేకుండా వున్నాను."
"పోనీలే! కళ్ళు తెరవ్వద్దు, వళ్ళెలా వుంది?"
"ఫరవాలేదు."
"నొప్పులున్నాయా? కాస్త బ్రాందీ నోట్లో పోసుకుంటావా?"
"వూఁ" ప్రశ్నార్ధకంగా పలికేడు.
"కొంచెం బ్రాందీ తాగు. శరీరం అలసినందుకు విశ్రాంతిగా వుంటుంది. నిద్రకూడా బాగా పడుతుంది" బీరువా తెరచి బ్రాందీ సీసా మూతతీసి కొద్ది కొద్దిగా నోట్లో పోశాడు.
"థాంక్స్!"
"నేను క్లబ్ వేపు వెళ్ళొస్తాను. హాయిగా పడుకుని నిద్రపో మరో నాల్గయిదు రోజులు పోతే! మామూలు మనిషవుతావు అన్నాడు డాక్టరు. ఏం భయంలేదులే!"
"వెరీ మెనీ థాంక్స్!"
అతను వెళ్ళిపోయేడు.
మరో అయిదు నిమిషాలకి బ్రాందిమత్తుతో కళ్ళు బలంగా మూసుకుని పోయాయి.
* * *
ఇంపాలా కారు వూరు దాటి వెళ్ళింది.
"దారి కెటు చూసినా పచ్చనిపొలాలు. అన్నీ పంపుసెట్లు, వ్యవసాయంపై ప్రజలకి బాగా మక్కువ పెరిగింది" అన్నాడు సతీష్.
సత్య తలూపింది.
మరో పది నిమిషాలు పరిగెత్తి కారు ఆగింది.
"నిషా గార్డెన్స్" అన్న బోర్డు కనిపిస్తోంది.
"ఇదే మన ద్రాక్షతోట" అన్నాడు సతీష్ నవ్వుతూ.
"అవునులే! అయ్యగారు వ్యాపారం వ్యాపారం అంటూ దేశం తిరుగుతుంటారు, నువ్వేమో నీవే అయ్యగారన్నట్టుగా తయారయ్యావు. ఇక తోట మనదేనంటే తప్పేం" తనూ నవ్వుతూ అంటించింది చురక.
"అరె! ఎందుకంత ఈర్ష్య, నువ్వెప్పుడూ వినలేదా? ఇది మా అయ్యగారిల్లు.... ఇది మా రెడ్డిగారి తోట.... అని అనుకోవటం వాళ్ళంతా మా అంటే నేను మనది అన్నాను తప్పా?"
"తప్పని ఎవరన్నారు కాదంటే యింత సంపద పెంచుకుంటూ ఆయన అనుభవిస్తున్న దేమిటి?" ఎప్పుడూ దేశాలు పట్టుకుని తిరగడం, హోటల్ తిండి లాడ్జింగ్ నిద్ర, అంతేనా?"
"ఆయనకేం నాలుగు కార్లున్నాయి. హైదరాబాద్ లో, మద్రాస్ లో, కర్నూల్లో, నెల్లూరులో, విజయవాడలో యిళ్ళున్నాయి. విమానాలలో తిరుగుతారు, కార్లలో వెళతారు, ఫోన్ లలో మాటాడతారు. తను వృద్ధి చెందుతున్నారు, దేశానికి సంపద, తనక్రింద పనిచేసే వాళ్ళకి భుక్తీ పెంచుతున్నారు."
కారు దిగింది సత్య.
తనూ కారు దిగి "ఏం మాటాడవు?" అన్నాడు సతీష్.
"ఏం మాటాడమంటావ్? దేశం తిరిగేవాడిని, అందునా పట్నవాసం మనిషివి, బ్రతకనేర్చిన వాడివి దేనికి తగ్గట్టు దానికి సమాధానం చెపుతావు.... బదులు నేనేం పలకను?"
పకపక నవ్వేడు సతీష్.
"మై డియర్ సత్యా! అనకుండానే అంటున్నావు. బాగా చమత్కారంగా మాటాడవు? ఇంతకీ మా అయ్యగారికి లోటేమిటంటావ్?" ముందుకు నడుస్తూ ప్రశ్నించేడు.
"ఏం లేదులే హాయిగా వున్నాడు కదా? పెళ్ళాం బిడ్డలు అంటూ గొడవలు లేకుండా?"
ఒక్కక్షణం ఆగాడు.
సత్య కూడా నిలుచుంది కదలకుండా.
"ఓహ్! ఎంత చక్కని ఐడియా యిచ్చేవు. ఇన్నేళ్ళుగా నా మనసులో లేని ఊహని లేవగొట్టావు? థాంక్స్ సత్య? బ్రతుకులో వున్న వెలితేమిటో స్పష్టంగా చెప్పేవు. అది గమనించలేక ;చాలా వ్యర్ధమైంది.... తప్పకుండా మేరేజ్ సెటిలవ్వాలి" తనలో తనే అనుకుంటున్నట్టుగా అన్నాడతను.