Previous Page Next Page 
రాగవాహిని పేజి 12

    సత్యకూడా కళ్ళు తుడుచుకుని పక్కనేవున్న పేపర్ చూస్తున్నట్టు ముఖాని కడ్డం పెట్టుకుంది.

    రామయ్య వచ్చేడు. అతని వెంట మరో వ్యక్తి వచ్చేడు.

    "ఏమిట"న్నట్టుగా చూసేడు సతీష్.

    ఆ వచ్చిన వ్యక్తిని వదిలేసి రామయ్య వెళ్ళిపోయేరు. ఆ వ్యక్తి తన చేతుల్లో వున్న కవర్ల బొత్తిలోంచి ఓ కవర్ తీసి యిచ్చేడు. అది ఓ ఆహ్వాన పత్రిక.

    అది నగరంలో వ్యాపార రంగంలో సుప్రసిద్ధుడైన రంగనాయకులు గారి కుమారుని వివాహాహ్వాన పత్రిక.... ఆ రాత్రే రిసెప్షన్... డిన్నర్. ఆ తర్వాత సుప్రసిద్ధ నేపధ్యగాయకుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యం అతని చెల్లెలు శైలజ సినీ సంగీత కచేరి....

    "తప్పకుండా రావాలని చెప్పమన్నారు అయ్యగారు" విషయంగా అన్నాడా వ్యక్తి.

    "ఊఁ"

    అంతలో ఆగమన్నట్టు చూసి ఫోనెత్తాడు సతీష్.

    "హలో!" మృదువుగా పలికేడు సతీష్.

    "హలో! సతీష్. నేను రంగనాయకుల్ని-"

    "నమస్కారం!"

    "ఇన్విటేషన్ వచ్చిందా?"

    "ఆ యిప్పుడే.. యిక్కడే వున్నాడు అతను."

    "చూడు. నేనే స్వయంగా రాలేకపోయాను. ఒంటరిగాడిని. అన్నీ చూసుకోవాలి. మనుషుల్ని నమ్మి వదిలేస్తే ఎక్కడవుతుంది? ఎక్కడ ఏం లోపం జరిగినా నేనేకదా బాధ పడవలసింది? అందుకే అన్నీ స్వయంగా చూసుకుంటున్నాను. అందుకే నీలాటి ముఖ్యమైన వాళ్ళకి ఫోన్ కొడుతూ కూర్చున్నాను. నేనే రాలేదని రాకపోయేవు. తప్పకుండా రావాలి."

    "థాంక్స్! తప్పకుండా వస్తాను. మీరింతగా చెప్పాలా? కిషోర్ పెళ్ళికి నన్నింతగా పిలవాల్సిన అవసరమే లేదు. పెళ్ళి షంషాబాద్ లో కాకపోతే పెళ్ళికి వచ్చేవాడిని. తప్పకుండా వస్తాను."

    "ఆరింటి కంతా వచ్చెయ్యాలి!"

    "కొంచెం ముందుగానే వస్తారు. "బాలూ" వాళ్ళు వచ్చారుకాదా?"

    "ఆఁ కచేరి ఆరింటికే ప్రారంభమవుతుంది. వాళ్ళు మధ్యాన్నమే కార్లో వచ్చేరు. అతని పార్టీ యిప్పుడే వచ్చింది."

    "అలాగా! తప్పకుండా అయిదింటికల్లా వచ్చేస్తాను."

    "థాంక్స్!"

    అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేసిన చప్పుడు కాగానే తనూ క్రెడిల్ చేశాడు.

    ఇన్విటేషన్స్ తెచ్చిన వ్యక్తి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.

    ఒక్కక్షణం నిశ్శబ్దం రాజ్యం చేసిందా గదిలో.

    "సత్యా!"

    "ఊఁ" పేపరు దించేస్తూ పలికింది. ముఖంలో దుఃఖ ఛాయలు లేవు. కానీ వాన వెలిసినతర్వాత ఆకాశం వుండేట్టుగా వుంది ఆమె ముఖం.

    "నేను ద్రాక్షతోట వేపుగా వెళుతున్నాను. నువ్వూ రా! కొంచెం అలా తిరిగొస్తే నీవు రిలాక్స్ అవుతావు!"

    సమాధానంగా చెప్పకుండా లేచింది....

    "కొంచెంసేపు ఆగు, ముఖం కడుక్కుని వస్తాను" అంది బాత్ రూమ్ వేపు కదులుతూ.

    సతీష్ అదే గదిలో వుండిపోయాడు ఏదో ఆలోచిస్తూ. తర్వాత పేపర్ అందుకుని జాగ్రత్తగా తిరగేశాడు.
ఎక్కడయినా ఆ సంఘటన తాలూకు వార్త ప్రచురితమైందేమోనని. ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ మళ్ళీ చూశాడు. లేదు.

    దాంతో తృప్తిగా నిట్టూర్చేడు.

    అంతలో ముఖం కడుక్కుని వచ్చింది సత్య.

    అద్దం ముందు నుంచుని ముఖానికి పౌడరద్దుకుని, బొట్టూ కాటుకా పెట్టుకుంది.

    ట్రిమ్ గా తయారయింది సత్య.

    ఆరాధన పూర్వకంగా చూసి "ఓ మాట చెప్పనా?" అని అడిగేడు సతీష్. అతనికి ఆమెని చూసేకొద్దీ పలకరించాలని గాసిప్ మాట్లాడాలని, ఆమె మనస్సు నాకట్టుకోవాలని కోరిక బలమవుతోంది. అంతదాకా అంతటి భవనంలో ఒంటరిగా పెరిగి, ఆదరణకి అప్యాయతకీ, మనసారా పిలిచే పిలుపుకి నోచుకోని అతనికి సత్య రాక ఏరువాకలాగా అయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా అజమాయిషీతో, తనక్రింది వ్యక్తులపై అదార్టీలాగా కాకున్న సూపర్ విజన్ లాగా ప్రవర్తించటంతో అతనికి గాంభీర్యమే అలవాటయింది.

    కొన్నేళ్ళుగా అన్నం ముఖం నోచుకోని వ్యక్తికి హఠాత్తుగా పంచభక్ష పరమాన్నాలు లభించినట్టుగా వుందతనికి.

    "చెప్పు, వింటాను" అంది సత్య నవ్వుతూ. అంతదాకా ఆలోచనా కారుమేఘాలు కమ్మిన ఆమె ముఖం యిప్పుడు తేటదేరి వెన్నెల విరజిమ్మే కార్తీక పున్నమి చంద్రుడిలా వుంది.

    "నువ్వు నిన్న ఆ నా డ్రెస్ లో ఎంత అందంగా వున్నావో, ఈరోజు యీ డ్రెస్ లో అంతే అందంగా వున్నావ్? కానయితే యీ చీరలో హుందాగా కనిపిస్తున్నావ్! కొందరికి పట్టుచీర కడితే బొమ్మలా తయారై నూలు చీర కడితే అందమైన కుందనపు బొమ్మలా వుంటారు. మరికొందరు మామూలు చీరలో పనిమనిషిలావుంటే ఖరీదయిన చీరలో మహారాణిల్లా వుంటారు. నువ్వలా కాదు!"

    అతని పొగడ్తకి సిగ్గుపడింది.

 Previous Page Next Page