Previous Page Next Page 
రాగవాహిని పేజి 11

    "మేం అందరం కలిసే వెళ్ళేం. మాతో రాలేదు"

    ఆశ్చర్యపోయింది, వెంటనే భయపడింది.

    "ఒకవేళ మిమ్మల్ని కలుసుకోలేకపోయిందేమోలే!" ఒక్కతే ఎలా వెళ్ళిందో ఏమో?" ఆందోళనగా అంది.

    ఆమె సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయింది.

    "ఏం పిల్లలో ఏమో! చెపితే వినరు. వాళ్ళకి తెలీదు. వాళ్ళ పట్టుదలే వాళ్ళది, వాళ్ళ ఆలోచనే వాళ్ళది. వాళ్ళు పెద్దవాళ్ళ మాటంటే లక్ష్యంలేదు.

    ఏం చేసిందో ఏమో?

    రోజురోజుకి నాగరికత బలిసి టౌనులు అన్నీ అడవుల్లా తయారయ్యాయి. ముఖం చూసి కనుక్కోలేని తోడేళ్ళు, మృగాలు, పులులు యధేచ్చగా తిరుగుతున్నాయి.

    భగవాన్!

    నా పిల్లని కాపాడు. సురక్షితంగా తిరిగొచ్చేట్టు చూడు"

    ఆందోళనగా భగవంతుని ప్రార్ధించింది. ఆ పూట ఏమీ తినలేదు. సరిగా నిద్రపోలేదు.

       
                                                         *        *        *

    మరురోజు మామ్మూలుగా తెల్లారగానే అలవాటుకొద్దీ "అమ్మమ్మా" అంటూ పిలిచింది సత్య.

    ఒక్కక్షణం సమాధానానికి వేచి చూచి, చుట్టూ చూసి నాలిక్కరుచుకుంది.

    తనెక్కడుందో చూసుకుని సిగ్గుపడిపోయింది.

    సరిగ్గా నిన్న యిదే సమయంలో తనెక్కడుంది?

    ఆ విషయం గుర్తుకు రాగానే ఆమె మనస్సు వికలమైంది.

    "ఆ మనిషి చనిపోయాడేమో! ఎవరన్నా చూసి పోలీస్ రిపోర్టు యిచ్చారేమో? తనపై హత్యా నేరం వుంది. తనెక్కడికి పారిపోయినా తన వెంటే నేరం పరిగెత్తి వస్తుంది.

    తనకి శిక్ష తప్పదు.

    "భగవాన్!"

    తల పట్టుక్కూచుంది మంచం మధ్యలో.

    "అమ్మాయిగారూ!"

    సత్య లేచి మంచంలో దిగులుగా కూర్చోవటం చూసి పిలిచింది జానకమ్మ.

    "ఏమ్మా! ఏమైంది? ఎందుకలా వున్నావ్? మీ వాళ్లెవరయినా గుర్తుకొచ్చారా? ఒక్కరోజుకే అలా అయిపోయావేమ్మా?"

    ఆమె ఆప్యాయంగా అడిగేసరికి సత్య కదిలిపోయింది.

    "జానకమ్మా, నేను.... నేను...."

    అంతలో అటుగా సతీష్ రావటంతో జానకమ్మ తప్పుకుంది.

    నేరుగా గదిలోకి వచ్చి కుర్చీలాక్కొని దగ్గరగా కూర్చుని "ఏమిటి మహారాణీలాగా మంచం మధ్యలో కూర్చున్నావ్? ముఖం కడుక్కుని కాఫీ గట్రా తాగవా?" అన్నాడు నవ్వుతూ.

    సూటిగా అతని ముఖంలోకి చూసింది.

    ఆమె ముఖం చూసి "సారీ! ఏమైంది? ఎందుకలా వున్నావ్?" అని అడిగేడు ఆప్యాయంగా.

    "నేను- నేను- హంతకిని.... నన్ను.... నన్ను.... ఎవరూ రక్షించలేరు."

    చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది.

    అలాగే చూస్తూ వుండిపోయేడు.

    అయిదు నిముషాలు గడిచేయి.

    ఆ ఉద్ధృతం తగ్గాక "చూడు సత్యా! నువ్వెక్కడున్నావో నీకు తెలీదు. ఇది రాజభవన్ కంటే భద్రమైన స్థలం ఇక్కడి కెవరూ రారూ! రాలేరు! పోలీసులకి నీ ఆచూకీ తెలీదు. ఎవరో- ఎవర్నో చంపేరు- కేసు పెండింగ్ లో పెడతారు. ఎంక్వయిరీలో ఏమీ తేలదు- కొన్నేళ్ళకి కేసు మూసేస్తారు అంతే! మరేం భయపడకు" అని అనునయంగా అన్నాడు.

    "కానీ! కానీ! నేను మాత్రం ఫ్రీగా ఎలా వుండగలను? నా ఆత్మరక్షణ కోసమే కానీ ఒక మనిషి ప్రాణాలు తీశాను. అది పోలీసులు కనుక్కోలేక పోవచ్చు. కోర్టులు శిక్షించలేక పోవచ్చు. కానీ నా మనస్సు నా మనస్సే నాకు పెద్ద శిక్ష. అది క్షణక్షణమూ చేసే చిత్రహింస ఎలా భరించడం?"

    అనునయంగా నవ్వేడు సతీష్.

    "సత్యా! ప్రతిక్షణమూ మనిషి తను జీవించటానికై ఎన్నో హత్యలు చేస్తున్నాడు. సేద్యం చేసేవేళ కకృషికుడు జీవరాసుల్ని తనకి తెలియకుండానే చంపుతున్నాడు. వచన క్రియలో కూడా ఆ తంతు వుండనేవుంది. ఆఖరుకు మనం పీల్చే గాలిలోకూడా ఒక కొన్నివేల సూక్ష్మక్రిములు చనిపోతున్నాయి. అందుకే జైనులు ముక్కుపై గుడ్డ వేసుకుని గాలి పీలుస్తారుట! కాబట్టి అనుక్షణం ఏదోరకంగా హింస జరుగుతూనే వుంటుంది."

    సత్య సమాధానం యివ్వలేదు.

    "సత్యా!"

    "మీ రెన్నయినా చెప్పండి. నా మనస్సు కుదుట పడటంలేదు."

    నిట్టూర్చేడు సతీష్.

    "ఈ తరహా మనుషులింతే! వీళ్ళకి తెలీదు. ఒకరు చెపితే వినరు. తమ ధోరణి తమది. ఎంతచెప్పినా యింతే! చిన్న చేపను అతి సునాయాసంగా పెద్దచేప మింగేసి తన "ఆకలి" తీర్చుకునే యీ రోజుల్లో ఇవి అన్నీ అప్రస్తుతం.... కాలం గడిచేకొద్దీ మానసికంగా మారాలే తప్ప వీళ్ళు ఇప్పట్లో బాగుపడరు" అనుకున్నాడు.

    సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బజర్ మ్రోగింది.

    "యస్! కమిన్" అన్నాడు కుర్చీలో సర్దుకుని కూర్చుంటు.

 Previous Page Next Page