Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 43

   
    మాధవ్ ఎంత నిర్దయుడైపోయాడు తన పట్ల! ఆత్మహత్య చేసుకొమ్మని ఆదేశించేముందు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య అన్న అభిమానం, ఇన్నాళ్ళు ఒక కప్పుకింద కలిసి జీవించిన అనుబంధం పిసరంతకూడా అడ్డురాలేదా?

    దొంగలుపడి చెల్లాచెదురుగా చిమ్మివేసినట్టుగా పడివున్న వస్తువుల కేసి వెర్రిగా చూస్తూ చాలాసేపు అలాగే కూర్చిండిపోయింది. అవి సర్దే ప్రయత్నం చేయలేదు. మాధవ్ కోసం భార్యగా తనేమీ చేయలేకపోయినా అతడి చివరి ఆదేశాన్నైనా వెంటనే నెరవేర్చాలి!

     మాధవ్ వ్రాసుకునే లెటర్ పాడ్ తీసుకొని ఒక పేజీలో ఇలా వ్రాసింది.

    "మాధవ్ గారూ!

    మీ ఆదేశానికి పూర్వమే నా వాగ్దానం నెరవేర్చుకోవాలనే నిశ్చయానికి వచ్చేశాను. నావల్ల మీకు భార్యగా సుఖం దక్కకపోయినా అప్రదిష్ట చుట్టుకొనేలా చేయడం ధర్మం కాదని తెలుసు! అందుకే వెంటనే మీ ఆదేశం నెరవేరుస్తున్నాను.

                                                                                                                                      - స్వప్న"

    మరో కాగితం మీద ఇలా వ్రాసింది.

    "ప్రియమైన స్వరూప్!

    వెళ్లిపోతున్నాను. ఈ ప్రపంచంనుండి వెళ్లిపోతున్నాను. నువ్విది చదువుకొని "స్వప్నా" అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచే సమయానికి అది వినడానికి స్వప్న జీవించి వుండదు.

    దేవీబాగ్ లో మన ప్రేమలతని  పెంచుకొన్నాం.

    అక్కడే విరిచేశాననుకొన్నాను. తాత్కాలికంగా  విరిచేశానేమో గాని తిరిగి నిన్ను చూడడంతో అది అసలు కొనలుగా సాగి మాధవ్ కి నేనిచ్చిన వాగ్దానం నిలుపుకోలేని బలహీనురాలిని చేసింది!

     దానికి పరిహారంగా ఆయనకి నేనిచ్చిన వాగ్దానం మరో విధంగా చెల్లించేలా చేసింది. (ఆ వాగ్దానం ఏమిటో మాధవ్ వ్రాసిన ఉత్తరం దీనితో జతచేస్తున్నాను. చదివితే  నీకు తెలుస్తుంది!) మాధవ్ కి నేను వ్రాసిన ఆఖరి మాటలు అతడి అడ్రస్ కు పంపించు!

     నిన్ను పెట్టిన బాధకు నాకీ శాస్తి కావలసిందేగా, స్వరూప్?నీ హృదయం ఎంత ఘోష పెట్టిందో - అది ఉసురుగా నన్ను భర్తృపరిత్యక్తను చేసింది. మళ్లీ జన్మంటూ వుంటే నిన్ను ప్రేమించి పెళ్లాడే అదృష్టాన్ని కోరుకొంటూ వెళ్ళిపోతున్న - స్వప్న.

    మాధవ్ వ్రాసిన చీటీతోపాటు ఈ రెండు కాగితాలూ జతచేసి కవరులో పెట్టి  మూసి స్వరూప్ అడ్రస్ వ్రాసింది.

    కవరు బాగ్ లో పెట్టుకొని ఇంటికి తాళంపెట్టి బయలు దేరింది. బజారులో టిక్ ట్వంటీ తీసుకొని అదికూడా బాగ్ లో పెట్టుకొంది. అక్కడినుండి స్వరూప్ ఇంటికి బయల్దేరింది ఆటోలో.
 
    స్వరూప్ డిశ్చార్జీ అయి ఇంటికి వచ్చి రెండురోజులైంది. మరో వారం రోజుల్లో అతడు సాగర్ వెళ్లిపోతున్నాడు. ప్రస్తుతం అన్నను కనిపెట్టుకొని అరుణ ఇక్కడే వుంది.

    స్వరూప్ స్వప్నని చూస్తూనే అడిగాడు. "మాధవ్ ఈరోజు శ్రీశైలం వెళ్లిపోయాడటగా? నువ్వెప్పుడు వెళుతున్నావు, స్వప్నా?"

    "ఎవరు చెప్పారు నీకు?"

    "రాంప్రసాద్!"

    అయితే ఆయన శ్రీశైలం వేయించుకొని తనకి దూరంగా వెళ్ళిపోయాడన్నమాట!

    "ఆయన క్వార్టర్ దొరికాక రాస్తానన్నారు. సెలవు పెట్టి వెడతాను!"

    అరుణ టీ తీసుకువచ్చి ఇచ్చింది.

 Previous Page Next Page