ఈ రెండు రోజులు మనస్పూర్తిగా స్వరూప్ కి సేవచేసింది స్వప్న. తన కారణంగా ఇతడెంతో మానసికవ్యధ అనుభవించాడు! ఆత్మహత్య చేసుకోబోతూ ఈ మాత్రం ఇతడికి సేవ చేసుకోగల అవకాశం లభించడం తన అదృష్టం!
స్వప్న ఇంటికి వచ్చినా, బయటికి వెళ్లినా "ఎక్కడికి? ఎందుకు?" అని అడగడం మానేశాడు మాధవ్. అతడూ ఒక విధంగా రాగద్వేషాలను జయించే ప్రయత్నంలో వున్నాడు. ఎలాగూ విడిపోవడానికి నిశ్చించుకొన్నాక ఆమె ఎక్కడికి వెడితే ఏం? ఏం చేస్తే ఏం?
అవమానమా?
దాన్ని అరికట్టడం తన తరం కాదు!
రెండు రోజుల తరువాత తిరిగివచ్చిన అరుణ, ఆమె తండ్రీ జీవచ్చవాల్లా కనిపించారు. వస్తూనే అరుణ బావురుమంటూ అన్నగారిమీద పడింది. "అమ్మని బూడిద చేసివచ్చాం, అన్నయ్యా" అంటూ.
16
బడినుండి తలుపు తాళంతీసి లోపలికి అడుగుపెట్టిన స్వప్న ఇంట్లో జరిగిన మార్పుకు కొయ్యబారినట్టుగా నిలబడిపోయింది.
గదిలో సామానంతా చెల్లాచెదురుగా పడి వుంది.
స్వప్న తలుపు తెరుస్తూనే కంటికి కనిపించేలా టీపాయ్ మీద ప్లవర్ వాజ్ కింద కాగితం వుంచబడింది.
ఆ కాగితం చేతిలోకి తీసుకోకముందే ఏం జరిగివుంటుందో స్వప్నకు తోచిపోయింది. మాధవ్ వెళ్ళిపోయి వుంటాడు, ఈ ఇంటిని వదిలేసి, తనని వదిలేసి చాలా రోజులు అయింది.
తన కుర్చీలు, బల్ల ఇంకా తనదైన సామాను ఏముందో అవన్నీ తీసుకెళ్లిపోయినట్టున్నాడు. ఇల్లంతా ఒకసారి కలియదిరిగి చూసి టీపాయ్ దగ్గరికి వచ్చింది ఫ్లవర్ వాజ్ జరిపి వణికే చేతులతో కాగితం చేతిలోకి తీసుకుంది.
"స్వప్నా!
నేను వెళ్లిపోతున్నాను.
మనం కలిసి భార్యాభర్తలంగా జీవించడానికి ఏడాది గడువు కోరావు! స్వరూప్ ని మరిచిపోవడానికి ఈ వ్యవధి కావాలన్నావు. ఇచ్చాను. ఏ మగవాడూ ఇవ్వని అవకాశం నేను నీకిచ్చాను! ఈ అవకాశాన్ని నువ్వే వృధా పుచ్చుకొన్నావు! దోషరహితంగా వెళ్ళిపోతున్నానన్న తృప్తి నాకుంది.
ఇకపోతే,
నువ్వాగడువు కోరిననాడు నాకొక వాగ్దానం చేశావు. నేను జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు కొంచెం కష్టంగా వుండవచ్చు! నీ ప్రేమకథ ప్రపంచం ముందు బట్టబయలు కాకముందే నీ భర్త నిన్ను వదిలేశాడని ప్రపంచానికి తెలియక ముందే నువ్వు ప్రాణత్యాగం చేస్తానన్నావు!
నువ్వు నీ వాగ్దానాన్ని వెంటనే నిలబెట్టుకో గలిగితే మన రెండు కుటుంబాల పరువు మంటగలపకుండా కాపాడిన దానవౌతావు!
ఆవేశంతో వాగ్దానం చేశానంటావా- నీ ఇష్టం! నీ విశృంఖల జీవితానికి నేను అడ్డురాను. త్వరలో నీకు విడాకులందేలా చేస్తాను - మాధవ్"