"బోర్ కొడుతూంది, పిక్చర్ కు వెడదామా, స్వప్నగారూ?"
"సారీ అరుణా! తలనొస్తూంది!"
"అయితే కూర్చొని కబుర్లు చెప్పుకొందాం. కూర్చోండి. నేను గబగబా వంట ముగించేసి వస్తాను. ఈ రాత్రి మీరిక్కడే భోజనం చేయాలి! మీవారు లేరుగా?" అరుణ లోపలికి వెళ్లిపోయింది.
స్వప్న, స్వరూప్ ఇద్దరే మిగిలారు.
"మూగబొమ్మలా నా ముఖంలోకి అలా చూస్తున్నావేమిటి, స్వప్నా?" ఆర్తిగా తన కళ్ళలోకి చూస్తున్న స్వప్న కేసి ఆశ్చర్యంగా చూశాడు.
"ఎలా చూస్తున్నాను?"
"ఇంకెప్పుడూ ఈ ముఖాన్ని మరి చూడబోనట్టుగా ఆఖరిసారిగా తృప్తిగా చూసుకొంటున్నట్టుగా......."
"వెళ్లిపోతున్నానుగా? ఇంకెందుకు చూస్తాను నిన్ను? నిన్ను చూస్తే మాధవ్ లో ఈర్ష్య...
అనుమానం.... అతడిలో మళ్ళీ అవి రేగకుండా మనది శాశ్వతమైన వీడ్కోలు కావాలి!" ఈమాట అంటుంటే స్వప్న కళ్లలో కన్నీటి తడి మెరిసింది. గొంతు గాద్గదికమైంది.
"శాశ్వితమైన వీడ్కోలు!" నిర్వేదంగా విశ్వసించాడు. "అదే దేవీబాగ్ లో జరిగిందనుకొన్నాను. కాని, మళ్లీ తారసపడి మీ కాపురంలో కలతలు రేపుతాననుకొన్నానా? బ్రతికి వున్నంతసేపు ఇదే శాశ్వతమైన వీడ్కోలు అని ఎలా అనుకొంటాం స్వప్నా?"
"ఉహుఁ. మనం ఇక కలుసుకోం!"
"ఎలా చెప్పగలవు? ఎప్పుడో, ఎక్కడో కలుసుకోకపోతామా?"
"కలుస్తామో ఏమో! ఈ రూపంలో మాత్రం వుండము!"
"ఏ రూపంలో వుంటాం? తల ముగ్గుబుట్టల్లా నెరిసి ఒళ్ళు ఒణుకుతూనా? అప్పుడు పేచీ వుండదు! అప్పుడు మనల్ని ఎంత సన్నిహితంగా చూచినా మాధవ్ ఈర్ష్య పడడు!"
స్వరూప్ ఊహించినట్టుగా స్వప్న నవ్వలేదు.
"స్వప్నా!" ఆర్తిగా పిలిచాడు. "ఈ రోజు నీ ముఖంలో ఏదో వ్యధ కనిపిస్తోంది! ఎందుకు బాధ?మాధవ్ కూ నీకూ మళ్లీ ఏదయినా జరిగిందా!"
" ఏం జరగలేదు"
"అలా వున్నావెందుకు?"
"అంతేనా?"
అరుణ వచ్చింది పొయిమీద కుక్కరుంచేసి.
స్వప్న లేచింది హఠాత్తుగా.
"మీరు లేస్తున్నారేమిటి? మీకోసం నేను వంట చేస్తున్నాను!"
"ఉహుఁ. నేను ఇంటికి వెళ్లిపోవాలి! మరెప్పుడైనా వస్తాను!" బాగ్ చేతిలోకి తీసుకొంది. అరుణ అభ్యర్దన లెక్కచేయకుండా గబగబా మెట్లు దిగసాగింది. తూలి రెయిలింగ్ ఆసరా చేసుకోబోయిందిగాని పట్టుచిక్కక దొర్లిపోయింది.
కెవ్వమంది అరుణ.
స్వప్నకి స్పృహ వచ్చేసరికి అరుణ బెడ్ మీద వుంది. అరుణ, స్వరూప్ ఆమె ముఖంలోకి ఆత్రుతగా చూస్తూ కూర్చటుని వున్నారు.
"ఏమైంది నాకు?" దిగ్గున లేవబోయింది.
"పడుకోండి, స్వప్నా!" వారించింది అరుణ.
"ఉహుఁ. నేను వెళ్ళాలి. ఇప్పుడు నాకు బాగానే వుందిగా?"
"........."


