కాలు కదుపుతూంటే "అమ్మా, అబ్బా!" అంటూ అతడు వ్యక్తం చేసిన బాధకు స్వప్నకు కళ్లలో నీళ్లుతిరిగాయి. చీమకైనా హాని తలపెట్టని మెత్తని మనసు. ఇతడి నింత బాధకు గురిచేసాడెందుకు దేవుడు?
కాళ్లకింద పడిన దుప్పటి పైకిలాగి అంచులు సరిచేసింది స్వప్న.
అతడి ముఖంలో భావాలు చూసి నవ్వబోయింది. "మీరు చూస్తున్నది స్వప్ననే కలకాదు!"
"అరుణ ఏదీ?"
జవాబు చెప్పాల్సివచ్చేసరికి స్వప్నకు గుండెలో రాయిపడినట్టుగా అయింది. కొడుక్కి ఏక్సిడెంట్ అయిన సంగతి ఎలాగో స్వరూప్ తల్లికి తెలిసి గుండెలో నొప్పి వచ్చి మాటాపలుకు లేకుండా పడిపోయిందట. అక్కడినుండి ఎవరో ట్రంకాల్ చేస్తూనే అరుణా, ఆమె తండ్రీ ప్రయాణం కాక తప్పలేదు.
అరుణ స్వప్న అడ్రస్ అతికష్టంమీదజ తెలుసుకొని వచ్చి, తిరిగి తాము వచ్చేదాకా అన్నయ్య సేవాబారం స్వీకరించమని అర్దించింది.
స్వప్న సందేహించకుండా అరుణతో వచ్చి స్వరూప్ భారాన్ని మీద వేసుకొంది. ఆ సంగతే స్వరూప్ తో చెప్పింది.
తల్లిని గురించిన ఆందోళనతో నిండిపోయింది స్వరూప్ ముఖం. అమ్మకి గుండెలో నొప్పివచ్చినప్పుడల్లా ప్రాణం పోయినంత పనిగా చేస్తూ వుంటుంది! ఇప్పుడు ఎలా వుందో?
"మాధవ్ ని అడిగివచ్చావా?" కాస్సేపు అయ్యాక అడిగాడు.
"ఆఁ. వెళ్లమన్నాడు" ఆ సమయంలో నిజం చెప్పి అతడిని నొప్పించాలనిపించలేదు.
"అయితే మాధవ్ మారాడన్నమాట" అతడి కళ్లలో సంతృప్తిలాంటిది కదిలింది. "ఏక్సిడెంట్ ఎలా అయిందో తెలుసా?"
"తెలుసు. ఆర్. టి. సి. బస్సుకింద పడ్డావు!"
"ఎందుకు పడ్డానో తెలుసా?"
"కావాలని పడ్డావా?" స్వప్న భయంగా అడిగింది.
"కావాలని కాదు. నాకు ఏక్సిడెంట్ జరిగిన రోజు నువ్వు సుల్తాన్ బజార్ వచ్చావా!"
"రాలేదే?"
"అయితే నీలాంటి అమ్మాయి వుండాలి! నువ్వే అనుకొన్నాను. నీ కళ్లలో పడకూడదని గబగబా వెళ్లబోయాను! ఆ తొందరలో పడ్డాను బస్సుకింద"
స్వరూప్ కోరికమీద అతడిని దిళ్లకు చేరగిల కూర్చోబెడుతుండగా గదిలోకి ఇద్దరు యువకులు వచ్చారు. ఇద్దరిలో ఒకడు మాధవ్. రెండో అతను రాంప్రసాద్. స్వరూప్ ని పరామర్శించి అయిదు నిమిషాల్లో వెళ్ళిపోయారు.
"స్వప్నా, మాధవ్ మాట్లాడలేదేమిటి నీతో?"
"పక్కన ఆయన స్నేహితుడు వున్నాడుగా? నేను తన భార్యనని అతడికి తెలియడం ఇష్టంలేదు కాబోలు!"
"నిజం చెప్పు, స్వప్నా! నువ్వు రావడం మాధవ్ కి ఇష్టమేనా?"
"అరుణ వచ్చి పిలిచినప్పుడు ఆయన ఇంట్లోనే వున్నాడు. ఆపదలో ఆదుకోలేకపోతే మనం ఎందుకు - వెళ్లు," అన్నాడు.
నిజానికి అరుణ వచ్చి పిలిచినప్పుడు మాధవ్ ని ఒక్క మాట కూడా అడగలేదు స్వప్న. తను త్వరలో జీవితం చాలించబోతూంది, మాధవ్ కి తను చేసిన వాగ్దానం ప్రకారం! అతడిని అడగాల్సిన అవసరం కనిపించలేదు!