స్వప్న నుండి తను విడిపోవాలనుకుంటున్నాడు గాని అదంత సులభం కాదు! చట్టబద్దంగా విడాకులు తీసుకోవాలంటే ఎంత డొంకతిరుగుడో వుంటుంది. కోర్టులో ఇవ్వాల్సిన సాక్ష్యాలు తలుచుకొంటే కంపరమెత్తుతుంది! చట్టం జోలికి పోకుండా విడిపోవాలంటే ఇరువైపు పెద్దలు రంగంలోకి దిగుతారు.
అలా అని ఇలా ఎన్నాళ్లు ఈమెతో కాపురం?
ఈ సమస్య ఇద్దరి మధ్యే నలగడంకంటే మూడో వ్యక్తిని ఆహ్వానిస్తే బాగుంటుందేమో! ఈ ఆలోచన వస్తూనే ఒకసారి రమ్మని పురుషోత్తానికి ఉత్తరం వ్రాశాడు మాధవ్.
అతడు మూడోనాటికల్లా దిగాడు.
స్వప్న లోపల వంటచేస్తోంది.
గంటసేపు బావగారిసొద విని అతడు లోపలికి వచ్చాడు. "బావ చెప్పేదంతా నిజమేనా?" అని అడిగాడు.
"ఏం చెప్పాడు?"
"నువ్వు స్వరూప్ తో మళ్లీ అక్రమ సంబంధం పెంచుకొంటున్నట్టు చెబుతున్నాడు?"
"ఏక్సిడెంట్ అయి చావుబతుకులమధ్య వుంటే చూసి వచ్చాను. ముందు ఆయన్నే తీసుకెళ్లమన్నాను. సిగ్గులేక పోతే సరి అని తిట్టాడు. ఒక్కసారి చూసివస్తే తప్పేమిటని అయన వద్దన్నా వెళ్లాను. దీన్నేనా సంబంధం పెట్టుకోవడమనేది?"
"నీ మనసుకి ఇది మామూలు విషయంగానే కనిపించవచ్చు! కాని, మరో మనిషి ఏమాత్రం సమర్దించలేని విషయం, స్వప్నా!ఒకరికి ఇల్లాలివై అతడిమీద మనసు చంపుకోలేకపోతే.... బావ సహృదయత నిన్ను ఈ మాత్రం ఈ ఇంటి నిలువవచ్చిందిగాని, మరొకరు మరొకరైతే ఎంత మాత్రం సహించని సంగతి ఇది! దైహికంగానే కాదు, మానసికంగా కూడా మరొకరితో ఆడదాన్ని పంచుకోవడానికి ఇష్టపడడు పురుషుడు!"
పురుషుడు పురుషుణ్ణి సమర్దించక ఏం చేస్తాడు?
కోరిన అమ్మాయి భార్య అయి వచ్చింది. తన బాధ ఇతడి కెలా తెలుస్తుంది?
ఈ నీతులు చెప్పేవాళ్లందరూ ఆ బాధలకు అతీతస్థానంలో వుండే చెబుతారు. స్వప్నలో కసిలాంటిది ఏర్పడుతూంది!
స్వరూప్ కు దూరమైన బాధ విశ్వరూపం దాలుస్తున్నట్టుంది. దానికి వీళ్ల సంకుచితత్వంతో సహకరిస్తున్నారు!
"స్వప్నా, ఈ సంగతి అమ్మవాళ్లవరకూ వెడితే ఎంత బాధపడతారో తెలుసా?"
ఈ కుటుంబ మర్యాద పేరుతో రెండు ప్రేమించుకున్న హృదయాలు నిర్దయగా నలిపివేయబడ్డ సంగతి ఈ పెద్ద మనిషి గుర్తుపెట్టుకొంటే బాగుండేది!
మాధవ్ కు అనుకూలంగా నడుచుకొని కాపురం కూలి పోకుండా కాపాడుకొమ్మని, ఈ సంగతి పెద్దవాళ్లవరకూ సాగకముందే మాసిపోయేలా చేయమని హితవులు చెప్పి, ఉపదేశాలు చేసి వెళ్లిపోయాడు పురుషోత్తం.
తను ఒకనాడు మాధవ్ కి మాటయిచ్చింది స్వరూప్ ని మ రిచిపోతానని! మరిచిపోలేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని! మొదటిది అసంభవంగా కనిపిస్తోంది. స్వరూప్ తనకి తిరిగి తారసపడకపోతే అది సాధ్యమయ్యేదేమో! రెండోది అది తనకి దగ్గరికి వస్తోన్నట్టే వుంది!
స్వప్నని ఒక విధమైన నైరాశ్యం, విరక్తి ఆవరించికొన్నాయి.
చాలాసేపటినుండి నిద్రపోతున్నట్టుగా వున్న స్వరూప్ కళ్లు తెరిచాడు. "కుడికాలు కొంచెం పైకి మడువు, అరూ!" తన పక్కన స్టూల్ మీద కూర్చున్న దెవరో చూడకుండానే అన్నాడు.