Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 39

   
    సాయంత్రం పిల్లవాడిని పంపింతే మాధవ్ వచ్చాడని తెలిసింది.

    స్వప్న బయలుదేరింది. ఆమె గుండెలు అదురుతున్నాయి. స్వరూప్ ని చూడకుండా ఉండలేనని ధిక్కరించి వెళ్ళింది. దానికి ఆయన ప్రతీకారం ఏరూపంలో వుంటుందో? ఆత్మగౌరవం దక్కని సంసారం తన కక్కరలేదని ఆవేశంతో అనేసి వెళ్లింది కాని నిజంగా అదే జరిగితే?భర్త వదిలేసిన స్త్రీగా నిలబడాలా తను?

    దీని కోసమేనా తను స్వరూప్ కు పరాయిదైంది?

    ముందు గదిలో ఈజీచెయిర్ లో సిగరెట్ కాలుస్తున్నాడు మాధవ్. జోళ్ళు గోడవారన విడిచి  అతడికేసి చూసీ చూడనట్లుగా లోపలికి  వెళ్ళిపయింది స్వప్న.

    స్వప్నని మెడపట్టి గెంటాలని లోనుండి లేస్తున్న ఉగ్రనరసింహుడిని పగ్గాలు పట్టి ఆపుతు్నాయి మాధవ్. స్వప్న ధిక్కారానికి తగిన ప్రాయశ్చిత్తం చేయమని అతడిలోని పురుషాహంకారం రెచ్చగొడుతూంది!కాని, చదువుతో సమకూడిన సంస్కారం అది చాలా మొరటుపని అని గర్హిస్తూంది!  పైగా వీధిలో జనమంతా ప్రోగుపడతారని భయం! స్వప్నతోపాటు తనూ ప్రదర్శన వస్తువైపోతాడు!

    సరిపడని సంసారాలంటే ఈ ప్రజలకి కడుపునిండే టాపిక్. అలాంటి భార్యభర్తలెంత చులకనైపోతారు వీళ్ళ ముందు.

    కాని...... మర్యాద పేరుతో భార్య అవినీతిని ఎంత కాలం భరించాలి? ఎలా భరించాలి! ఇది సహృదయత అనిపించుకొంటుందా? చవటతన మనిపించుకొంటుందా? మాటలతో తను సాధించే ప్రయోజనం తక్కువనే రాత్రి ఇంటికి తాళంపెట్టుకు పోయాడు. తన కోపం ఆమెకు తెలియాలనే. రాత్రంతా ఎక్కడ వుండిపోయిందో? ఆ స్వరూప్ గాడి దగ్గరే వుండిపోయిందేమో?

    ఈ ఊహతో అతడి ఒళ్ళంతా  తేళ్లూ జర్రులూ ప్రాకినట్టుగా అయింది.

    దిగ్గున లేచి లోపలికి వచ్చాడు.

    స్వప్న వంటిల్లు సర్దుతూంది.

    "ఎన్ని ఆటలాడి వచ్చినా భరిస్తానని నీ ఉద్దేశ్యంలా వుంది! ఈ ఇల్లు నీదికాదని చెప్పేశాను. నువ్వే మర్యాదగా వెళ్ళిపోతే సరి. లేకపోతే మెడపట్టి గెంటాల్సివచ్చింది!"

    "ఒళ్ళంతా గాయాలతో ఒళ్లు తెలియకుండా పడివున్నాడు అతడు! అతడు జత కలుపకుండా నేనొక్కదాన్ని ఏం ఆటలాడతానని మీ వుద్దేశ్యం?" అతడేం మాట్లాడినా మెదలకుండా ఊరుకోవాలనుకున్న స్వప్న ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేకపోయింది.

    "మళ్లీ నోరెత్తుతున్నావు! సిగ్గులేకపోతే సరి!"

    "దేనికి సిగ్గుపడాలి?"

    "ఎంత ధైర్యస్తురాలివి కాకపోతే పెళ్లికి ముందు ప్రేమకలాపాలు సాగిస్తావు?" 

    "ప్రేమకలాపం... ప్రేమకలాపం... ప్రేమకలాపం! ఎన్నిసార్లు ఈ మాటతో నన్ను అణచాలని, గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తారు? ప్రేమించి ప్రేమించబడిన ఆఢది అంత లోకువా? నేనేం అతడితో అక్రమసంబంధం పెట్టుకోలేదే! ప్రాణాపాయస్థితిలో వున్నాడని విని మనసుపట్టలేక చూద్దామని వెళ్లాను. అంతమాత్రానికి నన్ను మెడపట్టుకు బయటికి గెంటుతారా? ఇంటికి తాళం పెట్టుకు వెడతారా?"

    "ఇవాళ ప్రేమిస్తే తప్పా అంటున్నావు. రేపు కామిస్తే తప్పా అంటావు! మనుసులు ఎంత ఎదిగినా ఇవి ఒప్పలనేంతగా ఎదగలేదని నువ్వు గ్రహిస్తే మంచిది. క్షణక్షణం ఆత్మగౌరవం చంపుకుంటూ ఈ సంసారం చేసేకంటే విడిపోవటమే  మంచిదాన్నవే - క్షణక్షణం నీ మనసులో పరపురుషుడు మెదులుతూంటే - నీతో కాపురం చేయడం అంతకంటే  మనం విడిపోవడమే మంచిది. ఈ సంసారం మరీ హాస్యాస్పదం కాకముందే మనం విడిపోవాలి."

    "మనసులు కలియకపోతే విడిపోవడం, మనసులు కలిసినంత మాత్రాన జీవితాన్ని పెనవేసుకోవడం అంత సులభం కాదండీ, మన సమాజంలో!"

 Previous Page Next Page