Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 38

   
    "మీరు మరొకరిని పెళ్లాడారని అన్నయ్య వల్ల విన్నప్పుడు ఇలా మోసగించగల స్త్రీలు కూడా వుంటారా అనిపించింది నిజంగా అన్నయ్య ఎంత డల్ గా అయిపోయాడు! నేననుకుంటాను ఈ ఏక్సిడెంట్ లో అన్నయ్య ప్రాణం పోతేనే బాగుండేదేమోనని! ఒక్కసారి ఏడ్చి వూరుకొనేవాళ్లం! నిత్యం బ్రతుకుతూ చచ్చే అతడిని చూడడం ఎంత కష్టం!"

    "మరీ ఇంత నిర్దయగామాట్లాడకండి," ఏడవసాగింది స్వప్న మళ్లీ, వరండాలో స్తంభానికి ముఖంపెట్టి.

    "పెద్దవాళ్లని గౌరవించడం ముఖ్యమే. అలా ముఖ్యమనుకొన్నప్పుడు వాళ్లకు అనంగీకారమైన మార్గంలో మరొక వ్యక్తిని మీ ప్రేమపాశంతో బంధించి నడిపించడం తప్పు కాదా? అతడిని అక్కడే వదిలేసి మీ వాళ్లని బాధించలేనని వెనక్కి పారిపోవడం బాగుందా? ఇప్పుడేడిస్తే లాభమేమిటండీ? నలిగిన మావాడి గుండె సరికాదుగా?" ఆవేశంగా అడిగింది అరుణ.

    చివరిసారిగా దేవీబాగ్ లో స్వరూప్ తనను విడిచి వెళ్లిననాటి సంఘటన కొద్దిక్షణాలు ముందుగా జరిగినంత ఇదిగా కళ్లముందు కదిలింది స్వప్నకు.

    "స్వప్నా! నాకోసం నీవాళ్లని త్యాగం చేయలేవా?" ఎంత ఆర్ద్రంగా , దయనీయంగా అడిగాడు స్వరూప్!

    తను ఆ క్షణంలో  గుండె రాయిగా చేసుకొంది. కొద్దిగా నిగ్రహించుకోగలిగితే తనవల్ల కుటుంబ ద్రోహం, సమాజ విద్రోహం వారింపబడుతుందికదా అనుకొంది.

    కాని, ఈ ధర్మం పేరుతో - మూడు జీవితాలు అశాంతికి నిలయమైపోయాయి!

    భార్య తొలివలపు తనది కాదని తన భర్త, వలపు ఒకరిదీ, జీవితం మరొకరిదీ అయిన బాధ తనకూ, వలచిన పిల్ల దూరమై స్వరూప్... తనానాడు గుండె రాయిచేసుకోవడం వల్ల జరిగిన అనర్దమిది!

    స్వప్న ఇంటికి చేరేసరికి రాత్రి పదిగంటలయింది వస్తూ అనుకొంది. మాధవ్ ఎన్ని మాటలన్నా తను మెదలకుండా ఊరుకోవాలని! కాని, మూసిన తలుపుకు తాళం వేళాడుతూ స్వప్నని వెక్కిరిస్తున్నట్లుగా కనిపించింది!

    మాధవ్ ని ఎదిరించి ఈ రోజు స్వరూప్ ని చూడడానికి వెళ్లిన ఫలితం మాత్రం బాగుండదని ఊహిస్తూ వచ్చిన స్వప్న మ్రాన్పడినట్టుగా కాస్సేపు అక్కడే నిలబడింది.

    అతడు తనకు గుణపాఠం చెప్పడానికే ఇంటికి తాళం పెట్టుకొనిపోయాడు. ఇప్పుడే వస్తాడన్న ఆశ లేదు. ఇలా రోడ్డుమీద ఎంతసేపని నిల్చోవడం?

    ఆ వీధి మలుపుదగ్గర స్వప్నకి కావలసిన వాళ్ల ఇల్లు వుండడం, ఈ రాత్రి  ఈ ఆపదనుండి తప్పించుకోడానికి సరైన ఆశ్రయం అనుకొని అటు నడిచింది.

    పిన్ని వరుసైన ఆ ఇంటావిడ, "ఏమే, ఇంత రాత్రి వచ్చావు?" అంది.

    "ఒక ఫ్రెండుకు ఏక్సిడెంట్ అయితే చూడడానికి హాస్పిటల్ కు వెళ్ళాను, పిన్నీ! వచ్చేసరికి రాత్రి అయింది. ఆయన నా కోసం బయల్దేరారో ఏమో! ఇంటికితాళం వుంది. రాత్రిపూట ఎంతసేపని రోడ్డుమీద నిల్చోడమని ఇటువచ్చాను." అంది.

    ఒక గంట అక్కడే కూర్చొని వాళ్ల అబ్బాయిని పంపించింది మాధవ్ వచ్చాడేమో చూసిరమ్మని. వెళ్లొచ్చి తలుపు మూసేవుందని చెప్పాడు.

    "అయ్యో!  మీ ఆయన నీకోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో!'ఆవిడ వ్యకతం చేసింది. "ఏం చేస్తావు? ఈ రాత్రి ఇక్కడే పడుకో!" అంది.

    స్వప్నకి గుండెలమీద బరువు తీసేసినట్టుగా అయింది. ఆవిడకు అసలు సంగతి తెలిసిపోకుండా ఈ రాత్రి తలదాచుకోడానికి చోటు దొరికింది కదాని!

     కాని, ఉదయం కూడా మాధవ్ రాకపోయేసరికి స్వప్నకి పెద్ద చిక్కు సమస్యలో చిక్కుపడినట్టుగా అయింది. "ఈయన ఇలా రోడ్డుమీద నిలబెట్టి అల్లరిపెడదామనుకొన్నారా!"

    పిన్ని గారింట్లోనే ఆ పూట గడిచిపోయింది స్వప్నకు.

 Previous Page Next Page